యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
522-క.
కామారివినుతనామా!
సామీరికృతప్రణామ! సంహృతరక్షో
గ్రామా! వర్షామేఘ
శ్యామా! సంగ్రామభీమ! జానకిరామా!
శ్రీరాముఁడు
వానరసేనతో లంకపై దాడి వెడలుట
523-వ.
శ్రీనారద మునీశ్వరుండు
వాల్మీకిమునీశ్వరున కెఱింగించిన తెఱంగు వినిపించెద సావధానచిత్తంబుతో నాకర్ణించు
మట్లు శ్రీరామచంద్రుండు వానరసైన్యముతో వెడలి నడుచుచుండ హనుమంతుం డంతకుముందు తాను
లంక కరిగి మగిడి వచ్చి యచ్చటి వృత్తాంతమంతయు శ్రీరామచంద్రున కెఱింగించియుఁ ద్రోవలో
నుబుసుపోకకుఁగా మరల రావణుం డుండు చందంబును రాక్షసస్త్రీల సంవాదంబును
నింద్రజిత్తతికాయాది కుమారవర్గంబు తెఱంగునుఁ గుంభకర్ణవిభీషణాది సోదరుల యునికియును
లంకిణిపొంకం బణంచుటయు లంకలోపలకుఁ బోయిన చందంబును లంకాపురీ దహనంబును
సముద్రలంఘనంబును నది యిది యననేల తాఁజేసివచ్చిన కార్యంబు నెల్ల నెవరెవ్వరేదేది
యడిగిన వారి కా వృత్తాంతంబు నెఱింగించుచుండ మిగిలిన కపులు వినుచుఁ దమ జాతి చేష్టలు
సూపుచుఁ జనుచున్న చందంబు సుగ్రీవుండు రామచంద్రునకుఁ జూపుచు నడచుచున్న సమయంబున.
524-ఉ.
కొందఱు మంతనమ్ములనుగొంచును గొందఱు దొమ్ములాడుచుం
గొందఱు రామలక్ష్మణులకుం బ్రియమౌగతి నాటలాడుచుం
గొందఱు గంతులేయుచును గొందఱు పండ్లిగిలించి చూపుచి
ట్లందఱుఁ బోవుచుండిరి దయానిధి రాముఁడు
సంతసిల్లఁగన్.
525-సీ.
పాదఘట్టనలచేఁ బరఁగిన పెంధూళి- యాకసమ్మున మేఘమట్లు
పర్వ
వీఁకఁతో దాఁకిన వృక్షజాతం
బెల్ల- వ్రేల్మిడిఁ గొమ్ములు విఱిగి పడఁగ
బలువడితోఁ బోవు పక్షిజాతమ్ములు- భయముచే
నందంద పాఱుచుండఁ
జూపించి రావణాసురునిసైన్యం బిట్లు- మనవారిచేతను మ్రందఁ గలదు
అనుచు శ్రీరామునకు నర్కతనయుఁడిట్లు
సంతసము పుట్టఁజెప్పుచు సాగిసాగి
క్రమముగా నందఱునుఁ
గొంతకాలమునకుఁ
దిన్నఁగాఁ జేరిరి సముద్రతీరమునకు
టీక : మ్రందు- చచ్చు
526-వ.
ఇట్లందఱును సముద్రతీరమున విడిసి యున్న
సమయంబున హనుమంతుండు బుద్ధిమద్వరిష్ఠుండు గావున శ్రీరామచంద్రునకు నమస్కరించి
రావణుండు రాజ్యంబునం బట్టభద్రుండై యున్నవాఁడు వానిం జంపి సీతామహాదేవిం
దెప్పించుపనికై వేగ మన మందఱమును సిద్ధులమై యుండవలయు ననవుడు రామచంద్రుండు
తమ్మునితో.
527-క.
ఈ వానరులను
దోడ్కొని
ప్రావీణ్యముతోడ వృక్షపర్వతతతులన్
వేవేగమె
తెప్పింపుము
పోవుద మటమీఁద వైరి పురముంజేరన్.
528-వ.
అని యిట్లానతిచ్చి సముద్రతరణోపాయం బాలోచించుచుండె
నంత.
రాక్షస వీరులతో
రావణుని మంతనము
529-సీ.
అక్కడ రావణుం డఖిలమంత్రుల వేగ-రావించి
తగగ వారలకు ననియె
“మంత్రిసత్తములార! మర్కటుండొకఁ డేఁగు-దెంచి మనందఱం గొంచెపఱిచి
రాక్షస వీరుల రణభూమిఁ
బొలియించి-వనమంత బెకలించి వార్ధిదాఁటి
పోయెను బోరానిపోకలఁ బోవుచు-వాఁడు
శ్రీరామునివద్దకేఁగి
ఏమి చెప్పునో యామీఁద నామనుష్యు
లిద్దఱును వానరులఁగూడి యేపుమీఱ
వచ్చి లంకాపురములోనివారినెల్ల
నేమిచేయునొ యిపుడు నాకేమి దారి.”
530-వ.
అని యిట్లు రావణుండు నిండు పేరోలగంబునఁ
గూర్చుండి డోలాయమానమానసుండై విచారించుచుండ నాసమయంబున విభీషణుండు సాయంసంధ్యావిధిం
దీర్చికొని తన మంత్రులుం దానును గొల్వుకూటంబున కేతెంచి పెద్ద గద్దియపైఁ గొలువున్న
యన్నకు సాష్టాంగ దండప్రణామంబు లాచరించిన నతండును సంతోషించి యనుజునకు నర్హపీఠంబుఁ
జూపిన నాసీనుండై యన్నకిట్లనియె.
రావణునికి విభీషణుని
హితోపదేశము
531-తే.
“అవధరింపుము దేవ! మహానుభావ!
మనపురమ్మునఁ బ్రకృతము చనుతెఱంగు
విన్నవించెద నున్నది యున్నయట్లు
కొంచె మవధానముగ నాలకించుమయ్య.
532-సీ.
అన్నంబు నీరును నక్కఱ లేకుండ-భటు
లందఱును దుఃఖపడుదురయ్య
కంబాలఁ గట్టిన గజబృంద
మెల్లను-జవసత్త్వములు దూలి జడిసెనయ్య
హర్షంబుతోడుత హయజాతమంతయు-మెడ లెత్తుకొని వేడ్క మెలఁగెనయ్య
ప్రజ్వలించుచునున్న ప్రతిహోమకుండంబు-బొగలు గ్రమ్ముచు నాఱిపోవునయ్య
ఇట్టి యపశకునముల గన్పెట్టుమయ్య
సకలశాస్త్రంబు లెఱిఁగిన జాణవయ్య
యింపుగాఁ జెప్పుచుంటి
నాలింపు మయ్య
వేగ రాముని సతి నిచ్చివేయుమయ్య.
533-క.
సీతను దెచ్చుట మొదలుగ
నీతో నయవాక్యములను నేఁ జెప్పితి నీ
చేతమునఁ
బెట్టవైతివి
ఖ్యాతిగ నిఁక నైన సీత నాతని కిమ్మా.
534-వ.
అదియునుంగాక మొన్నరాతిరి సీతయొద్దఁ
గావలియున్న రాక్షసకాంత లందఱును నిద్రించుచున్న సమయంబునఁ ద్రిజట దిగ్గనమేల్కాంచి
నిదురించుచున్న స్త్రీలను లేపి చెప్పిన దుస్స్వప్నంబు విన్నవించెద నాకర్ణింపుము.
రామచంద్రుండు మనలంకపై దండు విడిసినట్లును; నీవును గుంభకర్ణుండును దక్షిణాభిముఖులై
గార్దభంబులపై నెక్కి పితృభూమి కరుగుచున్నట్లును; నింద్రజిత్తాదికుమార వర్గంబును
సైన్యంబును మూలబలంబును సర్వంబును నశించిపోవుచున్నట్లును; సీతం జేకొని శ్రీరామచంద్రుం డయోధ్యకుఁ
బోవుచున్నట్లును; గలఁగన్నదఁట. త్రిజటకల నిక్కంబై తోఁచెడిని. రాముండు వానరసైన్యంబుతోఁ గూడి
సముద్రతీరంబునకు వచ్చియున్నాఁడని చారులు విన్నవించిరి. ఆ రాముని దూతలు మఱల
నిచ్చటకు రాకమునుపే శ్రీరామచంద్రునకు సబహుమానంబుగా సీతను సమర్పించుటయు లెస్స
కార్యము. ఇంతచెప్పనేల మొన్న నొక్కదూత వానరవేషంబున వచ్చి తన పరాక్రమంబు నీకును
బరివారమునకును నెఱింగించిపోయె నది గుఱుతుంచుకొమ్ము” అని యిట్లు నీతిచెప్పు తమ్మునిపైఁ
గోపించి దిగ్గన కొలువుకూటంబు విడిచి యంతఃపురంబునకుఁ బోయె. నా సమయంబున నా సభలోని
వారందఱును దమతమ మందిరంబుల కరిగిరి.
535-క.
మఱునాఁ డెప్పటియట్లనె
సురుచిరముగఁ గొలువు సేయఁ జోద్యంబుగ ని
ద్దుర బోవుకుంభకర్ణుఁడు
సరిగా మేలుకొని వచ్చె సరభసలీలన్.
536-వ.
ఇట్లు వచ్చి గృహప్రవేశంబుఁ జేసి
స్నానాదిక్రియలు నిర్వర్తించుకొని భుజియించి మంత్రులతో నన్నకొలువునకుఁ జనుచుండు
కుంభకర్ణునితో మఱల విభీషణుండు మంత్రిసహితుండై వచ్చెను. అనుజు లిద్దఱును వచ్చి
నమస్కరించిన దీవించి సేమం బడిగి యుచితాసనంబులం గూర్చుండ నియోగించినఁ గుంభకర్ణుం
డత్యంతమును నాసన్నుండై కూర్చుండెను. కొంచెము దూరములోఁ గూర్చుండియున్న విభీషణుండు
మరల నన్నతో నిట్లనియె.
537-సీ.
“దశరథరాముండు తనపత్నిఁ గోల్పోయి-వానరావళిఁ గూడి వచ్చి యిప్పు
డదె చూడు మంభోధియావలి యొడ్డునఁ-గపిబలంబులతోడఁ గలసి
యుండె
రాముని సత్త్వంబు రమణిచే
మున్వింటి-మాతనితమ్ముండు నట్టిఁడంట
సొరిది వారికిఁ బ్రాపు సుగ్రీవుఁ
డున్నాఁడు-వార్ధి నిన్ ముంచినవానితమ్ముఁ
డాతఁడిట వచ్చి నిన్ను నుగ్గాడి కాని
సీతఁ దే నని పంతంబు చేసె
నంట
వలదు వైరమ్ము సీత నీవలయు వేగ
నతని నని గెల్వఁగా జాల రమరవరులు.
538-తే.
రాముఁ గెలువంగ వచ్చునే రాజసమున
సీత నర్పించి తత్పదాబ్జాతములకు
నర్థిఁ బ్రణమిల్లి శరణన్న నతఁడె
కాచు
సత్యసంధుండు సత్కృపాసాంద్రుఁ డతఁడు.
539-ఆ.
చంప వచ్చినట్టి శత్రువు నైనను
శరణు జొచ్చినంత సదయుఁ
డగుచు
నభయ మిచ్చి కాచు టాతని
బిరుదంట
సీత నిచ్చి రాముఁ జేరి
బ్రతుకు.”
540-వ.
అనిన విని రావణుండు కటకటంబడి విభీషణునితో
రోషభీషణంబుగా నిట్లనియె.
రావణుఁడు విభీషణుని
దూషించుట
541-తే.
“నీవు నాదాయతోఁ గూడి నీచబుద్ధి!
బుద్ధి సెప్పెదు నాకుఁ దమ్ముఁడవె నీవు
కడగి నీమంత్రులును నీవుఁ గంటిలోని
నెరసు సరవిగ నున్నారు నిశ్చయముగ.
542-తే.
నాకుఁ దమ్ముఁడవయ్యు ననార్యముగను
నాదుశత్రులఁ బొగడుచు నాకు
బుద్ధి
సెప్పవచ్చితి వౌరౌర సిగ్గులేక
యిచ్చవర్తింపుచుండు టిదేమి పనిర.”
543-వ.
అనిన విభీషణుం డన్న కిట్లనియె.
544-తే.
“నిన్నుఁ జంపఁగఁ దలపోసి నీదు
మంత్రి
వరులు గాచుకు నున్నారు వలదు
గోత్ర
కలహ మీచెడుబుద్ధి యేకరణి నబ్బె
నన్న? యింకొక్క కొన మాట యాలకించు.
545-వ.
రామచంద్రుం డాదినారాయణుండు సీత
యాదిలక్ష్మి వానరబలంబు బృందారక సందోహంబు గావున నీ వా రామచంద్రున కెదిరి జయంబు
గొనుట కడింది కార్యంబు నేఁ జెప్పిన బుద్ధి విని వేగ నా రాముని శరణు చొఱుము.
సుఖంబుగ మనుము. అని విన్నవించిన హితవచనంబులు రోగికిఁ బథ్యాహారంబు రుచింపని పోలికను
వీనుల కసహ్యంబు లైయుండ రావణుండు మండిపడి యిట్లనియె.
546-సీ.
“పటువిషం బొలికించుపాములతో నైన-జెలఁగి యింపుగఁ జెల్మి సేయవచ్చుఁ
గాని శత్రుల
నెప్డు గైవారములు సేయు-వానినిఁ దన ప్రాణబంధునైనఁ
జేరఁ దీసినయేనిఁ జేటు వాటిల్లును-గావున వీనిబల్గర్వ మణతు
విను కుంభకర్ణ! నీవును రాకమునుపు నీ-చెడుగు నాకును బుద్ధి చెప్పఁ బూనె”
ననుచు హుంకరించి యవ్విభీషణుఁ బట్టి
వేగఁ గత్తిఁ బూని వ్రేయఁ
బోవ
నట ప్రహస్తుఁ డప్పు డడ్డమ్ముగా
వచ్చి
“దేవ! నీకుఁ దగునె యీవిధంబు.
రావణునికిఁ
బ్రహస్తుని శాంత వచనములు
547-క.
నీ కేల
యింత కోపము?
నీకు హితముఁ జెప్పుచున్న నీతమ్ముని
నీ
వే కత్తి వ్రేసి చంపిన
లోకులు నిను మెత్తురయ్య? లోకస్తుత్యా!
548-తే.
గుణయుతుండైన మన విభీషణుఁడు లేని
లంక యేటికి సైన్యంబు లింక
నేల
వైభవం బేల యామీఁదఁ బ్రాణ
మేల
శాంత మవధారు దేవ! నీ స్వాంతమందు.”
549-వ.
అని ప్రహస్తుండు రావణుకోపంబును గొంత
శాంతపఱిచె నప్పుడన్న కోపంబునకుఁ దమ్ముండు కుంభకర్ణుండు వడవడ వడఁకి యన్న కెదురాడ
నోపక తమ్మునిఁ గాదనలేక గద్దియమీఁదఁ గూర్చుండియున్న యన్నకు మ్రొక్కి నిదుర
గృహంబునకుం జనియె నట రావణుండు విభీషణుం జూచి “యోరీ! నీవు విశ్వాస ఘాతకుండవు స్వామిద్రోహివి
గావున నీవు నా కొక్క పేదనరునిఁ బెద్దజేసి చెప్పెద వాతఁడె పౌరుషశాలియేని
నీవాతనింజేరి సుఖంబున బ్రతుకు మనిన” నతండిట్లనియె.
550-సీ.
“విను రాక్షసేశ్వర! విష్ణుసన్నిభుఁడు
రా-ముండు హా! పేదనరుండె నీకు
నతని సత్యస్థితి యతని పరాక్రమం-బిపుడు నీ కెఱుఁగంగ నెట్టు లగును
అవనీశు బాణంబు లతిరయంబున వచ్చి-దండించు నప్పుడైనఁ దలఁచు ననుఁ
బర్వత శిఖరముల్ పడినట్టు నీతల-లిలఁ గూలు నపుడైనఁ దలఁచు నన్ను
నీకు దమ్ముండ నౌటనే నీవు బ్రతుకు
కొఱకుఁ జెప్పిన నీ కింతకోప మేల
వినుము నామాట సీత నర్పించి యతని
శరణు వేడుము వలదు నీసాహసమ్ము.”
551-వ.
అని చెప్పిన హితవచనంబులకు మఱింత
కోపోద్దీపితమానసుండై యాజ్యాహుతిం బ్రజ్వరిల్లిన హుతాశను గతిన్మండిపడి పెళపెళనార్చి
గద్దియమీఁదం గూర్చున్న విభీషణుని వక్షంబు పగులం దన్నిన నతండు తనకన్నులనుండి తొరఁగు
జలకణంబులు హస్తంబులం దుడిచికొనుచు నాక్షణంబున మంత్రులుం దానును దనతల్లియైన కైకసి
యొద్దకుం జని సాష్టాంగదండ ప్రణామం బాచరించి యన్నచేసిన దుర్ణయం బెఱంగించి “శరణాగతవత్సలుండైన
శ్రీరామచంద్రుని సన్నిధానంబునకుఁ బోవుచున్నాఁడ” నని చెప్పి యాయమ్మ యనుమతంబు వడసి దీవనలు
గైకొని చని సముద్రతీరంబున విచారగ్రస్తుండై యున్న శ్రీరామచంద్రునింగని విభీషణుండు.
విభీషణ శరణాగతి
552-సీ.
భానుకులోత్తంస! వందితామరలోక! -జానకీనాయక! శరణు
శరణు
తాటకాప్రాణవిదారణ! రఘురామ! -సకలలోకాధార! శరణు
శరణు
దిక్కు నీవని వచ్చితిని దీనమందార! -పరమపూరుష!
రామ! శరణు శరణు
మాతృపిత్రాదులమాడ్కి సంరక్షించు-సర్వలోకస్తుత్య! శరణు శరణు
రాను వెఱచినాఁడ రక్షించు రక్షించు
మిపుడు నాకు నభయ మిమ్ము
ఇమ్ము
చూడు చూడు నిన్నుఁ జొచ్చితి
శరణమ్ము
కావు కావు నన్నుఁ గరుణతోడ.”
553-వ.
అని యివ్విధంబున రామచంద్రుని
స్తుతిసేయుచుఁ జేరవచ్చు తఱిని సుగ్రీవుండు శ్రీరామచంద్రునిఁ గని “విశ్వాసంబు సూపువాఁడై
దేవా! వీఁడు రావణుని తమ్ముండు విభీషణుం డనువాఁడు రాక్షసులు మాయలు సేయుదురు గాన; వీని వధియింప
నాజ్ఞయొసంగు” మనిన రామచంద్రుం డందులకు సమ్మతింపక “యితం డెవ్వండైన నేమి శరణన్న రావణుని
తమ్మునినే కాదు రావణునైనను గాచెద శరణని వచ్చిన వాని ప్రాణంబులు గాపాడుట రాజులకుఁ
బరమధర్మంబు. తొల్లి శిబి చక్రవర్తి రాజ్యంబు సేయుచుండ నొక్కఖగం బేతెంచి శరణు
చొచ్చిన నభయం బిచ్చి తన దేహముం గోసి దానిం దఱుముకొని వచ్చిన డేగ కిచ్చెనఁట. కావున
నాతని నాయొద్దకుఁ గొని ర” మ్మనవుడు సుగ్రీవుండు విభీషణునిఁ దోడ్కొని తెచ్చి
శ్రీరామచంద్రుని పాదారవిందములపైఁ బడవైచిన నతండు విభీషణునెత్తి యాలింగనంబుచేసి
యభయప్రదానం బొసఁగి “నేఁడు మొదలు నీవు మాకు హితుండవు బంధుండవు నయితివి గావున నిన్ను మా తమ్ములలో
నొకనిఁగాఁ జూచుకొనియెద నని నమ్మఁబలికి విభీషణా! యింక వైరిప్రభావంబు చెప్పు” మనిన దశరథనందనునకుం
వందనం బాచరించి కరంబులు శిరంబున ధరించి యతం డిట్లనియె.
విభీషణుఁడు రామునికి
రావణుని బల సంపదను దెలుపుట
554-క.
“రావణుబలసత్త్వస్థితి
యావీరుని శౌర్యమహిమ యభినుతి సేయన్
నావశముగా
దతం డల
దేవేంద్రుని వెట్టిఁ గొనును దినము నరేంద్రా!
555-క.
ఒక్కొక్క గవని వాఁకిట
నొక్కొక యేనూరుకోటు లుందురు దైత్యుల్
పెక్కురఁ
గావలి యుంచును
దక్కక మఱి యెల్లకడలఁ దానును దిరుగున్.
556-వ.
తన కుమారవర్గంబు లక్షయుం బదివేలు వారల
కొక్కొక్కరికి లక్షమంది బంట్ల నేర్పఱచి యుంచిన వారు లంకవీథులలోఁ గొందఱును
నగరుచుట్టును గొందఱును మఱికొన్నిచోట్ల మఱికొందఱును గుంపుగూడి తిరుగుచుందురు.
అయినను బ్రహ్మాదుల కైనను సాధింప వలనుపడని లంకాపట్టణము మీచేత సాధింపఁబడఁగలదు. కావున
మీరు వేవేగ సముద్రునిం బ్రార్ధించి సముద్రబంధనంబు సేయవలయు” ననిన నంత మహేంద్రపర్వతంబు డిగ్గి
సముద్రప్రాంతంబున విడిసి జాంబవదంగద సుషేణ నీల మైందాది వనచరవీరులచేత నలుదిక్కులయందు
గలపర్వతంబులను వృక్షంబులను బాషాణంబులను దెప్పించి కడలి కట్టం గడంగిన.
పర్వతములు రువ్వి
వారిధిపై వారధి తీరుప వానర వీరుల సముత్సాహము
557-శా.
కూపారుండును సంతసిల్లి జలజాక్షుం జూచి మిన్నంది స
ల్లాపం బుద్ధతిఁ బొంగఁ జూచి
విరసోల్లాసంబునన్ రాఘవ
క్ష్మాపాలుండును గోపముం గదుర నీగర్వంబు నాచేత వ
మ్మైపోనిప్పుడటంచు లక్ష్మణుఁడు విల్లందియ్యఁ బెన్వీఁకతోన్.
558-మ.
పరుషోద్యత్కుటిలాకృతిన్
బొమలుచూపట్టంగ శోణప్రభో
త్కరరేఖల్గనుఁగొల్కులన్నిగుడఁ గోదండంబు చేఁదాల్చి భూ
వర వంశాగ్రణి రాముఁ
డద్భుతముగా వారాశిమీఁదన్ వడిన్
శరజాలంబులు పేర్చి వ్రేయుటయు నిచ్చన్ బ్రాణభీతిన్ వడిన్.
559-క.
రాముని యెదుట సముద్రుఁడు
తా మానవురూపుఁదాల్చి దైన్యము
దోఁపన్
రామునకు
మ్రొక్కి యపుడా
ధీమంతున కనియె నిలిచి తేజం బెసఁగన్.
560-ఆ.
“ఇంక
నేల తడయ నినకులాధీశ్వర!
కపులఁ బంపి వేగఁ గట్టు
మయ్య
కట్టఁ గట్టి దాటు కమలాప్తకులచంద్ర!
నీదు కీర్తిలతకు నెలవు
గాఁగ.
561-వ.
మిమ్మును దరిసించుటకు మిన్నంటఁ బొంగితి
నింతియకాని కపటోపాయంబునఁ బొంగిన వాఁడను గా” ననిన రామభద్రుండు కరుణాసముద్రుండు గావున
సముద్రు నెప్పటి యట్ల యుండ నియమించి వానరులం బనిచిన.
562-క.
రాముని పంపునఁ బ్లవగ
స్తోమం బట్లరిగియరిగి దొడ్డగుకొండల్
క్షేమమునఁ దెచ్చి జలనిధి
రామాజ్ఞను వైచి రధిక రభసం బొప్పన్.
సముద్రమునఁ
బర్వతములను మ్రింగివేయు మహా మత్స్యములు
563-వ.
ఇట్లు వానర వీరులు పర్వత పాషాణ
వృక్షజాతంబులు లక్షోపలక్షలు గాఁ దెచ్చి వారాశిం బడవైచి తద్గుభగుభధ్వానంబుల
కుప్పొంగుచు బ్రహ్మాండ భాండంబు బ్రద్దలగు నట్లుగా నార్చుచు నట్టహాసంబులు సేయుచు
గంతులు పెట్టుచు వెక్కిరింపుచుఁ బరువు లెత్తుచు మున్ను దెచ్చివైచిన
పర్వతాదులనెల్లఁ దిమి తిమింగిలములు మ్రింగ నాసమయంబున.
564-ఆ.
తిరుగఁదెచ్చివైవఁ దేలి రాకుండుట
నాత్మలోన సంశయంబు నొంది
రాజసింహుఁడపుడు రత్నాకరునిఁ
జూచి
యడుగుటయును వేగ నాతఁడనియె.
నలునిచే సేతు
నిర్మాణము
565-సీ.
“రావణుపంపున రాలెల్లఁ
జేఁపలు-మ్రింగుచుండెఁ గదయ్య మేదినీశ!
తిమితిమింగిలములు దిరుగుచు
నాయందు-నుండి రావణుపంపు నొనరఁ
జేయు
నలుఁడు కట్టినఁ గాని నిలువ
నేరదు కట్ట-నలునిఁ బంపఁగదయ్య నళిననేత్ర!”
యని సరిత్పతి సెప్పి యవ్వేళ
నరిగిన-వీరు లిచ్చట మహావీర్యమునను
పర్వతంబులు తేరఁగా భానుకులుని
పంపుచేతను వారిధిఁబరఁగ వేగ
నలుడు నా ప్రొద్దె పది యోజనములు గట్టె
నంతలో సూర్యుఁడస్తాద్రి కరుగుచుండె.
కపిసేనతో
శ్రీరామచంద్రుని లంకాప్రవేశము
566-వ.
అంత సూర్యాస్తమయం బగుటయు వానరేంద్రులు
తమబలంబులం గూడి వేగునందాఁక సేతుబంధనంబునకుఁ గాపుండి. రంత సూర్యోదయం బయిన వెంటనే మహాబలశాలియగు
హనుమంతుండు సువేలాద్రి కరిగి యానగంబు పొంతనున్న హేమకూటంబును నాగపర్వతంబును
సింహాచలంబును నను మూఁడుగొండలు వాలపాశంబునం బెకలించి, నిమ్మపండ్ల మాడ్కిఁ బూల బంతుల వంతున
నెగుఱవైచుచు నేతెంచి, నలున కందిచ్చిన; నా పర్వతంబులు మూఁడును దొంబది యోజనంబులు
నిడుపుగల్గియుండ, నవ్విధంబున శత యోజనములు నిడుపును దశయోజనంబులు వెడల్పుగా నీరధిని బంధించి, నలుండావార్త రామున
కెఱింగించినతోడనే యతండు లంక లగ్గలు వట్ట నుద్యోగించి, పనసు నుత్తరపుగవను; జాంబవంతుఁ బడమటిగవను; గవయు దక్షిణపుగవను; హనుమంతు దూరుపు గవనుఁ; బట్ట నియమించిన
వారలును లంకాపురంబు లగ్గలకుంజొచ్చి రాక్షసుల నుగ్గునూచంబు గావించుచుండ హతశేషులు
పరుగెత్తి యావింతయంతయు రావణున కెఱింగించిన నతండు చింతాక్రాంతుడై దేవాంతక, నరాంత కాతికాయ, త్రిశిరో, మహోదర, మహాపార్శ్వాదుల
రామలక్ష్మణులం జంపి వారి శిరంబులు గొనిరండని పనుప; వా రరుగుదెంచి ఘోరాహవంబునం దమశిరంబులే
రామలక్ష్మణుల బాణంబుల కర్పించిన, వారిలోఁ జావక మిగిలిన యతికాయుం డరుగుదెంచి తండ్రి
యగు రావణున కిట్టు లనియె.
అతికాయుఁడు వానరుల
దుండగములను రావణునకు మనవిసేయుట
567-శా.
“దేవా! భానుకులావతంసుఁడు మహాధీరుండు రాముండు బా
హావిర్భూతమహా ప్రతాపమున దైత్యవ్రాతమున్ భూరి వీ
రావేశంబునఁ ద్రుంచెఁబో మనము నందాశ్చర్యమున్ భీతియున్
ద్రోవన్ వేఱవచింపనేల యిఁకఁ దద్ఘోరప్రతాపోన్నతుల్.”
568-వ.
అని అతికాయుఁడు విన్నవించిన నుల్కిపడి
కుంభకర్ణుని మేల్కొలుపఁ బనిచిన నతండును లేచి యావులింపుచుఁ బండ్లుగీటుచు లయకాల మృత్యువుం
బోలె నేతెంచిన నట్టి యనుజుం జూచి దశముఖుం డిట్టులనియె.
కుంభకర్ణుని సమర
వీరము
569-క.
“అనిలో నీ వారాముని
ననుపమబలశాలి యైన యనిలతనూజున్
ఘనుఁ డగులక్ష్మణుఁ గూలిచి
విను వారలతలలు గొంచు వేగమ
రమ్మీ.”
570-వ.
అని యనిపిన.
571-సీ.
భేరీమృదంగాది భీమవాద్యధ్వాన-ములకు సముద్రముల్ పొంగిపొరలఁ
గపులపాలికి లయకాలుఁడో యనుచును-వినువీధి దివిజులు వెఱచిఁ తొలఁగ
నతికాయుఁడును మహాహంకారమున వేగ-వెను వెంట రోషప్రవృత్తిఁ జనఁగఁ
గుంభకర్ణుండు కాకుత్స్థు పైఁ బోయిన-దక్షిణోత్తరసముద్రములరీతిఁ
గదిసి యిరువురుఁ బోరాడఁ గడగుటయును
గపులు వేవేగ వచ్చిరి విపులశక్తి
సాధ్యగంధర్వపతులెల్ల సరభసమునఁ
జూచుచుండగఁ బోరిరి సురుచిరముగ.
అతికాయ కుంభకర్ణుల
సంహరణము
572-వ.
ఇట్లు పెద్దయుం బ్రొద్దు వీరావేశంబునఁ
బోరుచుండఁ గుంభకర్ణుండు విజృంభించి బలంబుల కుఱికి దిగ్గజకర్ణపుటస్ఫాటితంబుగా
నార్చుచు వానరవీరుల నసంఖ్యంబుగా మ్రింగుటకుం గడంగిన రఘువీరుం డలిగి
బ్రహ్మాస్త్రంబు ప్రయోగించి వాని శిరంబును దునిమాడె నంత నతికాయుండు తన పినతండ్రి
పాటున కలిగి రాఘవేంద్రుని కభిముఖంబుగా నిలిచి దివ్యాస్త్రంబులు ప్రయోగించుచుండ
లక్ష్మణుం డడ్డుసొచ్చి నానాస్త్రంబులు ప్రయోగించి ఘోరంబుగా యుద్ధంబుసేసి కడపట
వారుణాస్త్రంబు వింత సంధించి విడిచిన నది యతికాయుని శిరంబుం ద్రుంచె నంత హతశేషులైన
రాక్షసులు కాందిశీకులయి రావణుంజేరి.
573-తే.
“దేవ! దేవాంతకుఁడు సచ్చె దీనవృత్తిఁ
గుంభకర్ణుండు సమసెను ఘోరలీలఁ
దెగువ నతికాయుఁడును మ్రగ్గె దీని
కింకఁ
బూని ప్రతికార మొనరింపు భూరితేజ.“
574-వ.
అని విన్నవించిన మండిపడి రావణుం
డింద్రజిత్తుం బంపిన నతం డాగ్రహంబున.
ఇంద్రజిత్తు
బ్రహ్మాస్త్రముచే వానరసైన్యమును హతమార్చుట
575-క.
పరవీరులపై వైశ్వా
నరుచేఁ గొన్నట్టి చాపనారాచములుం
బరిఘయు
బ్రహ్మాస్త్రముఁ గొని
దుర మొనరింపంగ వచ్చె దోర్బలశక్తిన్.
576-వ.
తదనంతరంబున.
577-క.
తండోపతండములుగాఁ
జండాశుగసమితిఁ బఱపి శైలశరాళిన్
గాండమయంబుగఁ
జేయుచు
భండన మొనరించె దైత్యపతిపుత్త్రుండున్.
టీక : - చండ-
భీకరమైన, ఆశుగ- బాణముల, సమితి- సమూహము
578-సీ.
మిన్నక రామసౌమిత్త్రులమీఁదను-బ్లవగసేనలమీఁద బాహుశక్తి
బ్రహ్మాస్త్ర మడరింపఁ బటునినాదంబునఁ-బఱతెంచి వానరప్రతతిమీఁద
బ్రహ్మమంత్రజ్ఞానపరు లైనవారి ని-ర్భంధంబుగాఁ
జుట్టి పట్టి కట్టి
తక్కినవారల నుక్కడగించినఁ-గనుఁగొని
యమరేంద్రకంటకుండు
వైరమెల్లను నేఁటితోఁ దీఱె ననుచు
మించి కెరలుచు
విల్లెక్కు డించి పొదలి
శాంతతను బొంది రాక్షసచక్రవర్తి
కడకు నేఁగెను వడి ముద్దుఁ గొడుకుఁగుఱ్ఱ.
579-క.
మునినాయక! విను మంతట
దన మనుమలపాటు దెలిసి తనలోఁ దానే
కనుఁగొనఁ
జాలక పోయెనొ
యనఁగను నపరాబ్దిలోన నర్కుఁడు గ్రుంకెన్.
580-క.
అరవిందభవుని కరుణను
వర మందిన వాయుసుతుఁడు వసుమతిమీఁదన్
మఱి బ్రహ్మమంత్రజపముం
బిరుదై యున్నట్టి యలవిభీషణుఁ డొకఁడున్.
581-వ.
తక్కఁ దక్కినవా రెల్లను మూర్ఛాగతులై
చచ్చినయట్లు పడి యున్న సమయంబున వాయుసుతుండు విభీషణుండును దమలో నెవ్వరు సచ్చిరో
నొచ్చిన వారెవ్వరో విచారింపఁదగు నని మహోగ్రాంధకారంబు నడుమ నింగలపుఁ గొఱవులు
పట్టుకొని రణరంగంబుఁ గలయ శోధింపుచువచ్చి శరతల్పంబున నున్న జాంబవంతునిం గని
విభీషణుం డిట్లనియె.
582-క.
“భల్లూకేశ్వర! వానరు
లెల్లను నృపవరులతోడ నిలమీఁదను మూ
ర్ఛిల్లియుఁ జచ్చియు నున్నా
రొల్లంబోవుచును దీని కుపమ యె”
టన్నన్.
టీక : ఒల్లంబోవు- మూర్చపొవు
583-ఆ.
అపుడు జాంబవంతుఁ “డసురేశ! నీవంకఁ
గన్ను విచ్చి చూడఁ గానరాదు
వాయుసుతుని మేలువార్త నాకిప్పుడు
చెవులు సోఁకునటుల చెప్పుమయ్య.”
584-వ.
అనిన విని హనుమంతుండు.
585-చ.
పదములఁ జేరి మ్రొక్కుచును బాణియుగంబును
మోడ్చి నీ కృపన్
బ్రదికినవాఁడ నన్న నతి ప్రీతినిఁ జేరఁగ దీసి “నీవిటన్
బ్రదికితిగాన నీకతనఁ బార్థివముఖ్యునిసేన లన్నియున్
బ్రదుకు నిజంబుగా నిపుడు పావని!”
యంచుఁ బ్రియంబు సేయుచున్.
హనుమంతుఁడు తెచ్చిన
సంజీవనిచే వానర వీరుల పునర్జీవనము
586-వ.
“వినుము వాయునందనా! యా లవణసముద్రంబున్
దాఁటి హిమవంతంబును నిషధాచలంబును గడచి మేరుశైలంబును వెండికొండయును శ్వేతపర్వతంబును
నతిక్రమించి ఘృత సాగరంబు లంఘించి ద్రోణగిరి మధ్యంబునం దున్న యౌషధ శిఖరంబునం గల
సంజీవిన్యాది దివ్యౌషధంబులు గొనివచ్చి రాఘవప్రీతిగా సైన్యంబుల ప్రాణంబులు నిలిపి
కీర్తి వడయు” మని ప్రార్థించిన నియ్యకొని వాయునందనుండు వాయువేగ మనోవేగంబునం జని
జాంబవంతుడు చెప్పిన దివ్యౌషధాచలంబునె కొనివచ్చి సకల సైన్యంబుల ప్రాణంబులు గాచి
నిమేష మాత్రంబున నక్కొండ తొల్లింటి యునికిపట్టుననె నెలకొల్పి వచ్చెనపుడు.
587-క.
ఇనుఁ డుదయపర్వతంబునఁ
గనుపట్టినఁ దెల్లవాఱఁ గపిసైన్యములున్
జననాథుఁ
గాంచి మ్రొక్కిరి
జనపతియును వాయుసుతుని సంశ్లాఘించెన్.
కుంభ నికుంభాది
రాక్షసవీరుల నిహతి
588-వ.
అంత నింద్రజిత్తు పరాక్రమంబునకు
సంతోషించి నిజంబును గల్లయును దెలియుటకు రావణుం డనుపఁ జారులేతెంచి యుత్సాహంబుతో
యుద్ధ సన్నద్ధులై కెరలుచున్న వానర బలంబులం గనుంగొని మరలి చనుదెంచి రామచంద్రుని
బలంబున్న తెఱం గెఱింగించిరి. అది విని కలంగియుఁ గలంగనిన భంగి నాశ్చర్యంబు నొంది రామలక్ష్మణులపైకిఁ
గుంభనికుంభ గవాక్ష ప్రజంఘ శోణితాక్షులం బంపిన వారును దమతమ బలంబులతోడఁ
గరితురగరథారూఢులై వెడలి సింహనాదంబులు సేయుచు నావానర సైన్యంబుపైఁ గవిసి శరవర్షంబులు
గురియుచుఁ బరిఘలం జక్కుసేయుచు నడిదంబుల వ్రేయుచు ముద్గరంబులం జెండుచు ముసలంబుల
మోఁదుచుఁ గరులచే మట్టింపుచుఁ దురంగమములచేఁ ద్రొక్కింపుచు రథంబులం దోలి వెంపరలాడుచు
మహాహవంబు సేయుసమయంబునఁ గపిబలంబు లడరి గిరివర్గంబులుఁ దరువర్గంబులును ననర్గళంబుగఁ
గైకొని ప్రతిఘటించి పోరాడునప్పుడు.
589-క.
తెంపున వాలికుమారుఁ డ
కంపనుఁ డను వాఁ డెదుర్పఁ గని కోపమునం
గంపింపఁ
బట్టి వానిని
జంపెను వక్షంబు పొడిచి సాహసవృత్తిన్.
590-వ.
అప్పుడు.
591-చ.
కనుఁగొని శోణితాక్షుఁడు నకంపను ప్రాణముఁగొన్న వాలినం
దనునిపయిం గడుం గినిసి తార్కొనితాఁకి రథంబుఁ దోలినం
గనలుచు నంగదుండు తురగంబులతోన రథంబు నుగ్గుగా
దనుజుని మీఁదఁ దానుఱికి తన్నినవాఁడునుగూలె నేలపైన్.
592-ఆ.
అతఁడు నేలఁ గూల నా ప్రజంఘుండును
ఘనుఁడు యూపనేత్రుఁ డెనసి
వాలి
కొడుకుమీఁద రాఁగఁ గోపించి
మైందుండు
ద్వివిదుఁ డంతలోనె తెంపు
మిగిలి.
593-క.
దనుజులఁ దోలఁ బ్రజంఘుఁడు
గనుఁగొని యవ్వాలిసుతునికటములు పొడువన్
గనలి నిశాచరుశిరమును
ఘనతర దృఢముష్టిఁ
బొడిచి కడపెన్ ధరకున్.
594-సీ.
ఘనుఁడు ప్రజంఘుండు కదనంబులోఁ బడ్డ-నక్షయబలుఁడు యూపాక్షుఁ డంత
గదఁగొని వ్రేసిన ఘనతతోఁ గుప్పించి-భుజశక్తి నాతనిఁ బొదివి పట్టి
కొనిపోవునప్పుడు కోపించి యన్నకై-శోణితాక్షుఁడు వచ్చి శూరుఁ డగుచు
విడిపించుకొనఁ జూడ వడిగ మైందుఁడు డాసి-కలన యూపాక్షుని గదిసి పోరి
సాహసంబున నొఱలంగఁ జంపుటయును
శోణితాక్షుండు ద్వివిదునిఁ జూచి పొడువ
నతఁడు మూర్ఛిల్లి తెప్పిరి యసురఁ బట్టి
శిరము కూలంగ నడిదంబుచేత వ్రేసె.
595-తే.
శోణితాక్షుండు పోరిలోఁ జూర్ణమయినఁ
గుంభుఁ డప్పుడు కోపించుకొనుచు వచ్ఛి
ద్వివిదు నెదుఱొమ్ము
నాటఁగఁ దీవ్రశరము
లేసి వడిఁ జంపె నాజిలో నేమి
చెప్ప.
596-క.
తమ్ముని పాటు గనుంగొని
హుమ్మన మందుండు కుంభు నురతర ముష్టిన్
ఱొమ్మున
బొడిచిన నతఁ డొ
క్కమ్మున గూలంగ నేసె నమరులు దలఁకన్.
597-ఉ.
అంగదుఁ డంతఁ గుంభుని శతాంగముపై నొకపర్వతంబు భూ
మిం గలయంగ వ్రేయుటయు మేదినికిన్
వడి దాఁటి వాలిపు
త్త్రుం గని దైత్యుఁ డాగ్రహముతో ముసలంబున వ్రేయనొచ్చి తోఁ
కంగొని వజ్రిపౌత్త్రుఁడు సగర్వమునన్ దగమోదెనార్చుచున్.
టీక
: - శతాంగము- యుద్ధమునకు
ఉపయోగించు రథము
598-క.
కాలాంతకరుద్రులతోఁ
బోలుపఁ డగు కుంభుఁడపుడు భుజబల శక్తిన్
వాలికుమారుని
ధరపైఁ
గూలఁగ వడి నేసె నైదుకోలలచేతన్.
టీక -
పోలుపుడు- పోలినవాడు
599-వ.
ఇట్లు వాలి కుమారుండు కుంభునిచేత
బాణపీడితుండై పడుట యెఱింగి రామచంద్రుఁడు వానిపై సుగ్రీవ జాంబవద్ధనుమ దాదులం బంపిన.
600-క.
వారంద ఱధిపునాజ్ఞను
భూరుహుములు గిరులుఁ గొనుచు భువనము లదరన్
బోరున
నార్చుచుఁ గుంభునిఁ
దారసమై వ్రేసిరంత దర్పోద్ధతులై.
601-క.
వారలు వ్రేసిన తరు గిరు
లారయఁ దనుఁ దాఁకకుండ నవి తునియలుగాఁ
గ్రూరాస్త్రంబులఁ
దునుముచు
నారసములఁ వారివారి నాటఁగ నేసెన్.
602-క.
ఏసినఁ గుంభుని రవిజుం
డాసమయమునందు నేసె నద రంటంగా
నేసినఁ
గ్రమ్మఱ రవిజుని
గాసిల వక్షంబు పొడువఁగా నిలఁ బడియెన్.
603-తే.
మూర్ఛతేఱి యారవిజుఁ డమోఘముష్టి
పూని దౌత్యునిఱొమ్ము పైఁ బొడువ
నంత
శరధిమథియించు మందరాచలముమాడ్కి
ధీరత యడంగి దిర్దిరఁ దిరిగి
పడియె.
604-ఉ.
కుంభుఁడు గూలినంగని నికుంభుఁడు దాఁ బరిఘాయుధంబు సం
రంభ మెలర్పఁ ద్రిప్పి దినరాజతనూజుఁనిపైకి రాఁగ బల్
సంభ్రమమొప్ప వాయుజుఁడు శౌర్యము గన్పడ నడ్డమైన ది
క్కుంభిగముల్ కలంగఁగను గొబ్బున వక్షమువైచె నార్చుచున్.
605-క.
వ్రేసిన పరిఘాయుధ మది
వీసము నాటంగలేక విఱిగిన మిగులన్
గాసిలి
దైత్యుఁడు పవనజు
నాసమయమునందు నేసె నడిదము చేతన్.
టీక - వీసము- చాలా తక్కవ, ఎలా అంటే వీసము అంటే 1/16వ వంతు అనగా
రూపాయిలో అణావంతు, (అ) బంగారం తూకంలో తులం (సుమారు 11గ్రా.) లో 1/16వ వంతు వీసం, ఇది 6
గురువిందగింజలకు (గుంజలకు) సమానమైన బరువు.
(ఆ) బెత్తెడులో 3వ వంతు ఏస్కుడు
(బొటకనవేలు వెడల్పు), పదహారవవంతు వీసం,
606-తే.
అంత హనుమంతుఁ డుగ్రుఁడై యసురగళము
నందు వాలంబు దగిలించి యాకసమునఁ
ద్రిప్పి ధరణీతలంబునఁ ద్రెళ్ళఁ
గొట్టి
సింహనాదంబుఁ జేసె నచ్చెరువు గాఁగ.
607-వ.
అట్టి సమయంబున.
608-క.
హతశేషులు ఘటకర్ణుని
సుతు లాహవభూమిఁ దెగినసుద్దులు లంకా
పతి కెఱిఁగించిన దుఃఖో
న్నతుఁడై యొక్కింతతడవునకు
నిట్లనియెన్.
టీక - ఘటకర్ణుడు -కుంభకర్ణుడు, అతని కొడుకులు కుంభ,
నికుంభులు
609-తే.
“మనకుఁ గలయట్టి బాంధవగణము సుతులు
దొరలుఁ బరివారమును
గంధకరులు హరులు
గుటిలకపియూధములబారి గొఱియ
లగుచుఁ
దెగిరి మునుముట్ట నేటితోఁ దీవ్రగతిని.”
టీక - గంధకరి - మదపుటేనుగు.
610-వ.
అని చింతింపుచుఁ గొంతవడికి
ధైర్యంబుంగొని.
శ్రీరాముఁడు
మకరాక్షుని రూపు మాపుట
611-క.
దైతేయవల్లభుఁడు గడు
ప్రీతిన్ మకరాక్షుఁ జూచి పృథుతరశక్తిన్
మీ తండ్రి ఖరునిఁ జంపిన
యాతనిపై సూడు వీఁగు మరుగుమటన్నన్.
టీక - సూడు వీగుట- పగ తీర్చుకొనుట
612-సీ.
సింధురరథభటసైంధవంబులతోడఁ-దఱచైన పట్టు ఛత్రములతోడఁ
బటహభేరీముఖ్యబహువాద్యములతోడ-దట్టంపునానాయుధములతోడ
వందిమాగధసూతబృందస్తుతులతోడఁ-గెరలాడుబిరుదుటెక్కెములతోడ
బహుళకాహళశంఖభాంకారములతోడ-రాజిల్లునవచామరములతోడ
నడిచె దిగ్దంతి భూదారనాగకూర్మ
కులనగేంద్ర యుతముగ భూతలము గదలఁ
బదరజఃపాళి సంఛన్నభానుఁడగుచు
దక్షుఁడై నట్టిమకరాక్షుఁ డాక్షణంబ.
టీక -
భూదారము- వరాహావతారము, నాగ- దిగ్గజములు లేదా ఆదిశేషనాగుడు, కూర్మము- కూర్మావతారము,
కులనగేంద్రము- కులపర్వతము
613-వ.
ఇట్లు భయంకరంబుగాఁ గదలి వానరవీరులతోడం
దలపడి పోరాడునెడ వానరబలంబులు తలచెడి పాఱుటగని రాజపుంగవుండోహో వెఱవకుఁ డని
తనమఱువునకున్ మరలించి మకరాక్షుందేఱి చూచి చండకాండముల తండంబులు ఖండించి హరుల
శరంబులపాలుచేసి రథంబులను సారథులతోడం గూడఁ బృథ్విం గలిపి బలంబులఁ జలంబునం దఱిమి
సింహనాదంబు చేసినం గినిసి మకరాక్షుం డిట్లనియె.
614-క.
మా తండ్రి
ఖరునిఁ జంపిన
నీతో యుద్ధంబు సేయ నేఁడిదె
కలిగెన్
నా తీవ్ర నిశిత సాయక
పాతంబుల పాలొనర్తుఁ బగ దీఱ నినున్.
615-మ.
అని గర్వోక్తులు పల్కుచుం గెరలి తీవ్రాస్త్రంబులారాముపైఁ
దనబాహాబలశక్తి నేయఁ గని కోదండంబునం దప్పుచున్
వనజాప్తాన్వయుఁ డేసె వాని నటగీర్వాణుల్ ప్రశంసింపఁగా
దనుజుం డేసెను రామభూవిభునిపైఁ దద్బాణజాలంబులన్.
616-క.
ఆశరము లుడిపి మఱియొక
యాశుగమున వానిచాప మపుడు దునిమి యా
దాశరథి
రథము పొడిగాఁ
గౌశలమున నేయ వాఁడు క్ష్మాస్థలి కుఱికెన్.
617-ఆ.
ధరకు నుఱికి దుష్టదైత్యుడు గదఁ ద్రిప్పి
భానుకులుని నేయ దానినొక్క
విశిఖముననె తునిమి వేగంబె
విభుఁ డగ్ని
శరముఁ దొడిగి వానిశిరము ద్రుంచె.
618-క.
ఆయెడ మకరాక్షుఁడు రిపు
సాయకములు దూఱనాటి చచ్చుట విని దై
తేయుఁడు
గుండెలు వగులఁగఁ
బాయని దుఃఖంబు పాలుపడి
చింతిల్లెన్.
619-వ.
ఇట్లు చింతాక్రాంతుండై కొంతతడ వూరకుండి
మేఘనాదునిఁ గనుంగొనియె.
వానరుల బీరమును వినిన రావణుని బెగడుపాటు
620-క.
“అక్కట! నీవును నేనును
దక్కఁగ మఱి తక్కినట్టి దళములు దెగఁగా
నొక్క కపి యైన గానీ
యక్కడ రిపులందు నొచ్చిరనఁగా వింటే.
621-వ.
అదియునుంగాక.
622-సీ.
నాగపాశంబున నాఁ డాజిలోఁ బడ్డ- ప్లవగు
లీరీతిని బ్రదుకు టెట్లు
బ్రహ్మాస్త్రమునఁ
గూల్పఁబడి ధాత్రి యెడఁబాసి-పోయినకపులెల్లఁ బుట్టు టెట్లు
కుంభకర్ణుఁడు సావఁ గొట్టినవానరుల్-చెచ్చెఱ జీవించి వచ్చు టెట్లు
అతికాయుఁ డడగించినట్టి కీశబలంబు- క్రమ్మఱఁ దానెల్ల గలుగు టెట్లు
రాముఁ డెన్నంగ నాదినారాయణుండె
వనచరావళు లెల్ల దేవతల మున్నె
కానలేనైతి నీరీతిఁ గదనమునను
వారిగెలువంగ నెవ్వారి వశము
చెపుమ.”
టీక - కీశబలము- వానరసైన్యము
ఇంద్రజిత్తు మాయా
సమరము
623-వ.
అని దీనాలాపంబు లాడుచున్న తండ్రికి నమస్కరించి
మేఘనాదుండు మేఘగంభీర వాక్యంబుల దుఃఖోపశమనంబు చేసి నేఁటితోడఁ బగ సాధింతునని
ప్రాగల్భ్యంబుగఁ బలికి యనిపించుకొని గజవాజిశతాంగాదు లగు చతురంగబలంబులు గూర్చుకొని
ఛత్రచామరంబులు పిక్కటిల్ల నట్టహాసంబు సేయుచు లంకాపురంబు వెడలి సంగ్రామరంగంబునకుం
జని తనబలంబులఁ జక్రాకారంబుగా నిలిపి తన్మధ్యంబున రథావతరణంబుచేసి
రక్తాంబరగంధమాల్యంబులు ధరియించి లోహపాత్రంబునఁ గృష్ణసర్పరక్తంబు నించి తర్పణంబు
చేయుచుఁ దద్విధియుక్తంబైన హోమంబులు సేయుచుండు నెడ నొక కృత్తి ప్రత్యక్షంబై నిలిచి “మెచ్చితి వరం బిచ్చెద
వేఁడు” మనిన నతండు “తా నాకసంబున నుండి భండనంబు సేయునెడఁ గపులకుం గానరాకుండ నంధకారంబు గావించిన
నేను వారిని జయింతు” నని ప్రార్థించిన నియ్యకొనియె నంత మేఘనాదుండు నభంబున కెగసి మహాంధకార బాణంబు
వ్రేసిన దానంజేసి పెంజీకటిం గప్పినఁ జీకాకై పాఱుచున్న వానరులంగని వాయునందనుండు
శ్రీరామచంద్రునితో నిట్లనియె.
624-క.
“వాయవ్యాస్త్రము చేతను
బాయును జుమ్మంధకారబాణ
విశేషం
బీయెడ
నేయుఁడు శ్రీరఘు
నాయక!”
యని విన్నవింప నవ్వుచు నంతన్.
625-క.
విల్లెక్కు వెట్టి మారుత
భల్లము సంధించి తివిచి పార్థిపుఁ డలుకన్
బెల్లార్చి
యేసె గగనం
బెల్లను వడిఁ దూల దైత్యుఁ డిలపైఁ గూలన్.
626-ఆ.
రాజతిలకుఁ డంబరమ్మున
కెగయంగ
వాయుశరముఁ దొడిగి వ్రేయఁ దడవె
మాయశక్తి దొలఁగి పోయిన
నంతలో
మేఘనాదుఁ డుర్విమీఁదఁ బడియె.
627-చ.
పడియును మేఘనాదుఁడు సుపర్వులు బెగ్గిల నుగ్రబాణముల్
తొడిగి ప్లవంగ సేనపయిఁ దోరముగా నడరింప నంతటన్
బెడబెడనార్చి మారుతివిభీషణు లుగ్రత దానవావళిన్
బొడిపొడి సేయ లక్ష్మణుఁడు పూనిక నాతనిఁ దాఁకె నార్చుచున్.
628-క.
అంతట దానవసేనలు
పంతము చెడి తలలు వీఁడ బాఱం గని తా
నెంతయు
వెఱవకుఁ డనుచును
గుంతము ద్రిప్పుచును దైత్యకుంజరుఁ డంతన్.
లక్ష్మణునిచే
నింద్రజిత్తు సంహారము
629-శా.
సౌమిత్రిం గని గర్వమొప్పఁ బలికెన్ శౌర్యంబు సంధిల్లఁగా
“నామీఁదం బఱపింపవచ్చితివె నా నాగాస్త్రసంఘంబులన్
నేమిమ్మందఱఁ గట్టుటల్ మఱచితే నేఁడైనఁ జింతింపుమీ
నీ మాసత్త్వవిశేషమెల్ల మదిలో నిక్కంబుగా లక్ష్మణా!”
630-వ.
అని బాణ ప్రయోగంబు సేసిన.
631-క.
వానిని బ్రతిశరములు దాఁ
బూనిక సంధించి త్రుంచి భుజబలశక్తిన్
దానవుని
మూర్ఛపుచ్చెను
భానుకులుం డంత నొక్కబాణముచేతన్.
632-ఆ.
ఇంద్రజిత్తుఁ డప్పు డినకులోద్భవునిచే
మూర్ఛనొంది తెలిసి మూర్ఖుగతిని
భాసమాన మైన బాణత్రయంబున
నతని నొవ్వనేసి యార్చెనంత.
633-సీ.
సౌమిత్రి తా వానిచాపంబు
నడిమికి-ఘనతరాస్త్రంబుచేఁ దునుఁగ నేసి
పదిబాణములు వానిబాహుమధ్యంబునఁ-గాటంబుగా
వడి నాట నేసి
తురగంబులను నాల్గు తూపులఁ
దునుమాడి-సారథి నొక్కట సంహరించి
శరవృష్టిఁ గప్పిన సురవైరి
కోపించి-కాద్రవేయాస్త్రసంఘంబు లేయ
గరుడశరమునఁ దునిమి లక్ష్మణుఁడు కినిసి
వడిఁ గుబేరాస్త్ర మతనిపై వైచె
నసుర
దానిఁ దునిమాడి వేగ నైంద్రాస్త్ర మేసె
నరవరుఁడు దాని యామ్యబాణమునఁ ద్రుంచె.
టీక- కాద్రవేయాస్త్రము- నాగా(కద్రువ కొడుకు)
అస్త్రము
634-వ.
ఇట్లు త్రుంచిన.
635-క.
వరుణాస్త్రంబును నేసెను
సురరాజవిరోధి రాజసూనుని
మీఁదన్
గర మలిగి రాముసోదరుఁ
డరుదారఁగ దాని ద్రుంచెనైంద్రాస్త్రమునన్.
636-వ.
మఱియును.
637-తే.
కనలి దానవుఁ డతనిపై గంధపుష్ప
సమితి నొప్పెడు గంధర్వశరముఁ దొడిగి
వ్రేయఁ గోపించి దశరథోర్వీపసుతుఁడు
ఖండశశిబాణమున దాని గండడంచె.
638-వ.
ఇట్లు గంధర్వ శరంబును ద్రుంచి యంతటం బోవక
దేవేంద్రదత్తంబైన భుజగాస్త్రంబు వింట సంధించి వేదంబులు నిత్యంబగునేని రామచంద్రుండు
ధర్మాత్ముండేని యింద్రాదిబృందారక ద్రోహి యైన యింద్రజిత్తునిశిరంబు నీ శరంబు
ద్రుంచుంగాక యని వానిపై లక్ష్యంబు చేసి ప్రత్యాలీఢ పాదస్థుండై నిలిచి
కర్ణాంతంబుగాఁ దిగిచి యేసిన నదియును గాలానలాభీల జ్వాలాజాలంబు లుప్పతిల్ల గగనంబునం
బఱతెంచి యక్కఱకు రక్కసుని శిరంబుఁ ద్రుంచిన.
639-క.
కనుఁగొని దేవత లందఱుఁ
దనుఁ బొగడఁగ మరలి రాముతమ్ముఁడు విజయం
బునఁ వచ్చి మ్రొక్క నాతని
మనుజేంద్రుఁడు కౌఁగిలించి మఱి యిట్లనియెన్.
640-క.
“నీచేత వీఁడు త్రుంగుట
భూచక్రంబెల్ల మేలు పొందెను వినుమీ
నా చేత దశముఖుండును
నీచుఁడు తెగుఁటెల్ల నిజము నిర్మలచరితా!”
641-వ.
ఇట్లు సౌమిత్రి చేత నింద్రజిత్తు తెగెనని
చెప్పిన నారదుని వాల్మీకి మహామునీంద్రుం డటమీఁది కథావిధానం బెట్టి దనియడుగుటయు.
ఆశ్వాసాంత పద్య
గద్యములు
642-క.
జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి
భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా!
643-గ.
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహా కావ్యంబునందు యుద్ధకాండమునం బ్రథమాశ్వాసము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి