అయోధ్య కాండము
శ్రీ రామాయణము -
అయోధ్యా కాండము
123-క.
కందర్పరూప! ఖండిత
కందర్పవిరోధిచాప! కరుణాద్వీపా!
వందితశుభనామా! ముని
సందోహస్తుత్యభూమ! జానకి రామా!
టీక : కందర్పరూపుడు - మన్మథుని వంటి
రూపము కలవాడు, ఖండితకందర్పవిరోధిచాపుడు - శివధనురభంగం చేసినవాడు, కరుణాద్వీపుడు -
కుప్పగా దయ కలవాడు.
124-వ.
శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహాముని
కెఱిగించిన తెఱంగు వినిపించెద నాకర్ణింపుము.
శ్రీ రామునకుఁ
బట్టాభిషేక సన్నాహము
125-సీ.
తన సుమంత్రాది ప్రధానులతోఁ గూడి-సుఖ గోష్ఠి నుండగ నఖిల మునులఁ
జక్కఁగా రావించి, సమ్మదంబున వంశ-గురువుతో దశరథ ధరణినాథుఁ
డనియె నీ భూభారమంతయు నొక్కట-నేలితిఁ జాలదే యేక హేళి?
నటుగాక పగతుర నవలీల గెల్చితి, -నిల్పితి ధర్మమ్ము నిష్ఠతోడ
నింత చాలదె? యాశకు నెంత కెంత?
రామచంద్రుని ధరణికి రాజు గాఁగ
మీరు సూడంగఁ బట్టంబు భూరి మహిమఁ
గట్టవలయును మంచి లగ్నమునఁ జెలఁగి.
టీక : హేళి- హేళనకలది, కేళిక, విలాసము
126-తే.
అనుచు గురునకుఁ దెల్పి, తా నతని సమ్మ
తమున సౌభాగ్య మంగళ ద్రవ్య సమితిఁ
గూర్చుఁ డనుచును మంత్రులకును నెఱుంగఁ
జెప్పి, శృంగార మీ పురిఁ జేయుఁ డనియె.
127-వ.
అట్టి సమయంబున
సూర్యాస్తమయ వర్ణనము
128-తే.
పగలు ప్రాగ్భాగమున
నుండి గగన వీథిఁ
జరమ దిక్కున కేఁగఁగా శ్రమము దోఁచి
చెమట పట్టిన స్నానంబుఁ జేయ నరుగు
కరణి, నపరాబ్ధిలో దివాకరుఁడు గ్రుంకె.
129-క.
మేలిమి సంధ్యా రాగము
వ్రాలిన చీఁకటియుఁ గలిసి వరుణుని వంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టె నట నభోమణి తలఁగన్.
130-క.
వారక కల్పద్రుమమునఁ
గోరకములు పుట్టినట్లు గురుతర కాంతిన్
దారకములు తలసూపెన్
జోరానీకమ్ము మిగుల స్రుక్కుచు నుండన్.
టీక : కోరకము- మొగ్గ
131-ఆ.
కారు మొగులు రీతిఁ, గాటుక చందాన,
నీటి భాతి, నింద్ర నీల మహిమ,
మాష రాశి పోల్కిఁ, మఱి మఱి యపు డంధ
కార మవని యెల్లఁ గలయఁ బర్వె.
టీక : మాష- మినుములు
132-వ.
అట్టి సమయంబున.
133-చ.
తలవరులన్, నిజాధిపుల, దర్పకు నేర్పునఁ గన్నుఁ
బ్రామి, య
త్తలఁ, దమ పిన్నపాపల, నుదారత నేర్పడ నిద్రపుచ్చి, ని
ర్మల కరకంకణావళులు, మట్టెలు రట్టుగ
మ్రోఁగనీక, వి
చ్చలవిడిగాఁ జరించి రొగి జార లతాంగులు మధ్య
రాత్రులన్.
టీక : తలవరి- తలారి, రాత్రి కాపాలాకాయువాడు
134-చ.
సురతము లేక యుస్సురను బోటి, మగం డుడికించు
కాంతయున్,
సరస మెఱుంగు చంద్రముఖి, సావడి దంటయు, బేరకత్తెయున్,
బర పురుషాభిలాషమును బాయని భామిని, పోరుకట్టునన్
బరఁగిన భామ లాది యుపభర్తలఁ గూడి చరించి
రత్తఱిన్.
చంద్రోదయ వర్ణనము
135-ఉ.
భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవ మైన యా
బృహ
ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది
మీఁగడల్
పూని సమీరుచేఁ దెరలఁ బూర్వ దిశం గనుపట్ట
దానిపై
ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ
దగన్.
టీక
: వెట్ట- వేడిమి, పెల్లు ఉడుకు- మిక్కిలి తాపము,
136-చ.
కుముదములుం, జకోరములుఁ, గోమల సస్యముఁ, జంద్రకాంతముల్
రమణఁ జెలంగ వెన్నెల తిరంబుగఁ జేసె జగంబు
లుబ్బఁగాఁ,
గమలములున్, వియోగు, లధికంబుగఁ జోరులుఁ, జక్రవాకముల్
రమణఁ గలంగ వెన్నెల తిరంబుగఁ గాచె జగంబు
లుబ్బఁగాన్.
137-ఉ.
నారదు లైరి సన్మునులు, నాక మహీజము లయ్యె
భూజముల్,
శారద లైరి భామినులు, శంకరశైలము లయ్యె
గోత్రముల్,
పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకు లయ్యె
నాగముల్,
వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు
వెన్నెలన్.
టీక : పారద - పాదరసము
138-చ.
కొడుకుదయించె నంచలరి కోరి సుధాంబుధి మిన్ను
ముట్టి, య
ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర
చంద్రికల్
పుడమికిఁ బాలవెల్లి గతిఁ బొల్పెసలారఁగఁ జంద్రుఁ
డొప్పె, న
య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁ బయోనిధిఁ
బద్మనాభుఁడై.
టీక : ఉడుపతి - చంద్రుడు
139-వ.
అట్టి సమయంబున,
140-ఉ.
కోరి చకోర దంపతులు గుంపులు గుంపులు గూడి, రంతులన్
బేరిన చంద్రికారసముఁ బేర్కొని మార్కొని పొట్ట
నిండగాఁ
బారణసేసి, పెన్ బయలఁ బ్రాఁకుచుఁ, జంచుపుటంబు
లెత్తుచున్
బేరెము వారుచుండె మదిఁ బ్రేమజనింప వధూటి
కోటికిన్.
141-ఉ.
వెన్నెల తీఁగలన్ గొనలు వేడుక ముక్కలఁ ద్రుంచి
తెచ్చి, దా
ర్కొన్న ప్రియాంగనా తతికిఁ గూరిమి నోరికి నిచ్చి, కేళికిన్
సన్నపుఁ కంఠ నాళముల సన్నలు సేసి సుఖించె
నింపుగన్
దిన్నని చంద్రకాంత మణి తిన్నెలమీఁదఁ జకోర
దంపతుల్.
ప్రభాత వర్ణనము
142-తే.
పాకశాసని సేవంతి బంతి దివికి
నెగుర వైచిన కైవడి నేమి చెప్పఁ
బాండు వర్ణంబుతోఁ బూర్వ భాగ సీమ
సొంపు మీఱఁగ వేగురుఁజుక్క వొడిచె.
టీక : పాకశాసని - పాకశాసనుని (ఇంద్రుని)
కొడుకు జయంతుడు, సేవంతి - చేమంతి
143-వ.
అట్టి సమయంబున.
144-క.
రవి యుదయించెను జనుఁడీ
దివియలు, నక్షత్ర సమితి, తిమిరము, శశియున్
బవ లేమిటి? కను రీతిని
గువలయమున గూళ్ళఁ గోళ్ళు గూయఁగ సాఁగెన్.
టీక : కువలయము - భూమండలము
145-చ.
వదలక పద్మరాగ మణి వజ్రపుఁ దర్మెనఁ బట్టి
నేర్పు పెం
పొదవఁగఁ దూర్పు కొండపయి కొప్పుగఁ దెచ్చి
జగద్గురుండు దాఁ
ద్రిదశవరేణ్యు కట్టెదురఁ దేఁకువ నిల్పిన దర్పణంబు
నా
నుదయము నొందె భానుఁడు సముజ్జ్వల
కోకనదప్రదీప్తులన్.
టీక : త్రిదశవరేణ్యుడు - ఇంద్రుడు, తేకువ - ధైర్యము, దర్పణం -అద్దం, కోకనదము - చెంగల్వ
146-వ.
ఆరాత్రి రాజశేఖరుని చిత్తంబు
వచ్చునట్టుగా మెలంగి, యాతఁడు దన్ను మెచ్చు టెఱింగి, కైక యిట్లనియె:
రాముని గానలకుఁ పంపుటకై
కైక పన్నాగము
147-ఆ.
“వసుమతీశ! నాకు వర మిచ్చి తప్పుట
తగవు గాదు మీకుఁ, దలఁపులోన
మఱచినా రదేమొ, మన్నించి తొల్లింటి
యీవు లీయవలయు నీ క్షణంబ.
148-క.
జననాథ! నా కుమారుని
వినుఁడీ పట్టంబు గట్టి వేవేగను, రా
ముని మునిగా” ననుపుఁడు మఱి
వనమునఁ బదునాలుగేండ్లు వర్తింపంగన్.
149-వ.
అని ప్రార్థించిన విని పార్థివేంద్రుఁడు
డిల్లపడి తల్లడిల్లుచు నుల్లంబు గలంగి ముసుంగిడి యచ్చేడియ పలికిన పలుకులకు మాఱాడ
నోడి మిన్నక యున్న సమయంబున, సుమంత్రుం డేఁతెంచి "స్వామీ! రామచంద్రుని
బట్టంబు గట్ట సుముహూర్తం బాసన్నం బయ్యెఁ గావున మిమ్ము నచ్చటికి విచ్చేయ నవధరింపుఁ
డని వశిష్ఠ భగవానుండు విన్నవించు మని పంపె" నని చెప్పిన కైక యిట్లనియె:
150-మ.
“అనిలో మున్ను నృపాలు
చిత్తమున కే నాహ్లాదముం గూర్చి, నా
తనయుం బట్టము గట్టి, రాఘవుని బద్నాల్గేండ్లు కాంతారమం
దును వర్తిల్లఁగఁ బంపఁ
గొన్న వరమున్ ద్రోయంగ రాదెంతయున్
వనసీమన్ ముని వృత్తి
నుండు మనుఁడీ వైళంబ యా రామునిన్.”
151-క.
అని పలుకు కైక పలుకులు
విని వేగమ మరల వచ్చి విన్నఁదనంబున్
దనుక వశిష్ఠునితోడన్
వినుపించె సుమంత్రుఁ డట్టి విధ మేర్పడఁగన్.
సీతా లక్ష్మణులతో
శ్రీరాముని యటవీ నిర్గమనము
152-వ.
అనిన విని వశిష్ఠాది ప్రముఖులును, సుమంత్రాది ప్రధాన
జనంబులును, సైన్యంబులును, బరివారంబులును విన్ననై యున్న నాసన్న యెఱింగి, రామచంద్రుఁడు రాజ చిహ్నంబులు త్యజించి, జటా విభూతి వల్కలంబులు
దాల్చి, ధనుర్ధరుండై యున్నంత, లక్ష్మణుండును భూపుత్త్రికయును దోడం జనుదేరఁ, దల్లులకు నమస్కరించి, వశిష్ఠానుమతంబున
నాశీర్వచనంబులు గైకొని, యాస్థానంబు వెలువడి యరణ్యంబున కరుగునప్పుడు పుర జను
లందఱును బురపురం బొక్కుచు, దశరథ మహారాజును దూషించుచుఁ, గైకను నిందించుచు, మూఁకలై శోకించుచుండ, నది యంతయు విని
దశరథుండు పురోహితామాత్య బంధు వర్గంబులతో శ్రీరామచంద్రుఁ డేఁగిన త్రోవం జన్నంత, నా రాముఁడు దూరంబునం
జనియె దశరథుండును మరలి వచ్చి పుత్త్ర శోకంబున నాక పురంబునకుం జనియెఁ దదనంతరంబ.
గుహుని ప్రపత్తి
153-ఆ.
చనుచు రాఘవుండు స్వర్ణది యొడ్డున
గుహుని గాంచి యతనిఁ గుస్తరించి
తడయ కోడఁబెట్టి దాఁటింపు మనవుడు
నట్ల చేయఁదఁలచి యాత్మలోన.
టీక : స్వర్ణది - ఆకాశగంగ
154-క.
"సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు
వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము
పెంపునన్.
155-వ.
ఇట్లు శ్రీరామచంద్రుని శ్రీపాదంబుల నీటఁ
గడిగి యోడపై నెక్కించి, యమ్మువ్వుర నవ్వలికి దాఁటించిన నా క్షణంబ.
భరద్వాజ ముని
యాదరాతిథ్యము
156-ఉ.
రాజ కులావతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను
నా భర
ద్వాజ మహా మునీంద్రు పదవారిజముల్ గని మ్రొక్క, నాతఁడం
భోజ హితాన్వయాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన
రామునిం
బూజ లొనర్చి కందఫల మూలములం బరితృప్తుఁ
జేసినన్.
టీక : అంభోజహితాన్వయాబ్ధి -
సూర్యవంశమనుసముద్రము
157-వ.
సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి
మఱుసటి దిన మర్కోదయమ్మున.
టీక : అర్కోదయము - సూర్యోదయము
158-ఆ.
ముదముతోడఁ దమ్ము ముని భరద్వాజుండు
భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ
జనియె భ్రాతృ దార సహితుఁడై సన్ముని
కూటమునకుఁ జిత్రకూటమునకు.
భరతుని భాతృ భక్తి
159-మ.
ఘనుఁడా రాముఁడు
చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో
నన దంతావళ వాజిరత్న రథ నానా యోధ సంఘంబుతో
డ, నమాత్యద్విజబంధు
వర్గములతోడం గూడి వాద్యంబులం
జనుదెంచెన్ భరతుండు
రాముకడకున్ సద్భక్తి సంపన్నుఁడై.
టీక : దంతావళము -గజము, వాజిరత్నము -శ్రేష్ఠమైన
గుఱ్ఱము,
160-సీ.
చనుదెంచి, రాముని చరణంబులకు మ్రొక్కి, -కైకేయి చేసిన కపటమునకు
నగరంబు విడిచి, యీ పగిది ఘోరారణ్య-మున కిట్లు రానేల మునుల పగిది?
నది గాక, మన తండ్రి యత్యంత మైనట్టి-పుత్త్ర శోకంబునఁ బొక్కి పొక్కి
త్రిదశాలయమ్మున దేవేంద్రుఁ గనఁ బోయె-నని చెప్ప విని రాముఁ డంతలోన
భరత లక్ష్మణ శత్రుఘ్ను ధరణిసుతులఁ
గూడి దుఃఖించి దుఃఖించి, కొంత వడికి
నాప్త వర్గంబుచే మానె, నంతమీఁద
భరతుఁడిట్లనె శ్రీరామభద్రుతోడ.
టీక : త్రిదశులు - దేవతలు, ధరణిసుత - సీతాదేవి
161-తే.
" రాజు లేకున్నచో మఱి రాష్ట్రమందుఁ
గార్య మెట్లౌను? మీ రెఱుంగనిది కలదె?
నేఁటి సమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ
దిరిగి విచ్చేయుఁ” డనుడు
నా భరతుతోడ
162-వ.
శ్రీ రామచంద్రుం డిట్లనియె.
శ్రీ పాదుకా ప్రదానము
163-చ.
“జనకుఁడు సేసినట్టి మితిఁ జక్కఁగఁ దీర్చి, కడంక నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు, మాట గా
దనకు” మటన్న, నొల్లనన, నాతనికిం దన పాదుకా యుగం
బొనరఁగ నిచ్చి పొమ్మనుచు నుర్వికి రాజుగఁ బంచె
సొంపుగన్.
టీక : మితి - గడువు, గుఱి - హద్దు
విరాధ వధ
164-వ.
ఇట్లు భరతుని భరతాగ్రజుం డనునయించి
మరలించి, నాకలోకకవాటం బగు చిత్రకూటంబు కదిలి సౌమిత్రి భూపుత్రులం గూడి పోవు నెడ, నటవీ మధ్యంబున విరాధుం
డను దైత్యాధముం డపరాధంబు చేసి, దిగ్గన డగ్గఱి జగతీతనూభవ నెత్తుకొని గగన మార్గంబున
కెగిరిపోవునెడ వాఁడి బాణంబున వాని కంఠంబును ద్రుంచి, గారుడాస్త్రంబున మరల నొయ్యన జనక నందనం
డించి, భయంబు వాపి, ప్రియంబు సూపి, యొయ్య నొయ్యన నయ్యెడ నున్న యత్రి మహాముని యాశ్రమంబునకుం జని, ఘనంబున నా ఘనుండు సేయు
పూజలం గైకొని, రామచంద్రుం డచ్చటి మునీంద్రులకు దైత్యులవలని భయంబు లేకుండ నభయం బిచ్చి, మన్ననం గొన్ని దినంబు
లాయా మునుల యాశ్రమంబుల నిలుచుచు, వార లనుప శరభాది మృగోత్కర శరణ్యంబగు నరణ్యంబుఁ
జొచ్చిపోయె”నని చెప్పిన విని నారదుని వాల్మీకి మునీంద్రుం “డటుమీఁది కథా విధానం
బెట్టి”దని యడుగుటయు.
టీక : నాకలోకకవాటము - స్వర్గద్వారము, సౌమిత్రి - లక్ష్మణుడు
ఆశ్వాసాంత పద్య
గద్యములు
165-క.
జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా!
టీక : జలజాక్షుడు - పద్మాక్షుడు, సుధాజలరాశిభవ్యమందిరజలజాకరచారుహంస - పాలసముద్రం అను దివ్య
మందిరసరస్సు నందలి మనోజ్ఞమైన హంసవంటివాడు
166-గ.
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు
జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ
విరచితంబైన శ్రీ రామాయణ మహా కావ్యంబునం దయోధ్యా కాండము సర్వము నేకాశ్వాసము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి