సుందర
కాండము
272-క.
సూర్యకులరత్నదీపా!
సూర్యసహస్రప్రతాప! సుందరరూపా!
ఆర్యారాధితనామా!
శౌర్యాధికసుగుణసీమ! జానకిరామా!
273-వ.
శ్రీ నారద మహా ముని వాల్మీకి కెఱింగించిన
తెఱంగు విన్నవించెద నవధరింపుము.
సంపాతి కపివీరులకు సీత యునికిని దెలుపుట
274-తే.
రామునకు మ్రొక్కి యక్కపిరాజు కరుణఁ
దత్క్షణంబున వెడలిరి దక్షిణంబు
వెదకువా రగు వానరవీరవరులు
పంతముతొడుత నెంతయు సంతసమున.
275-క.
మును తా మేఁగిన దిక్కులు
పనివడి వెదకంగఁ జనిన బలిముఖు లెల్లన్
జనకజఁ గానక వచ్చిరి
మనుజేశుని కడకు చనిన మార్గంబుననే.
276-వ.
అట్టి సమయంబున,
277-క.
గిరులును, నదులును, వనములుఁ
బరికింపుచుఁ, బట్టణములు బహు విధ గతులన్
దిరుగుచు వెదకుచుఁ, గానక
కరువలిసుతుఁడాది యైన కపివరు లెదుటన్.
టీక : కరువలిసుతుడు- వాయుపుత్రుడు
278-క.
ఆలోఁ గాంచిరి సత్కపి
జాలముఁ, గరి శరభ సింహ శార్దూల మృగా
భీలముఁ, బుణ్య కదంబ వి
శాలము నగు నమ్మహేంద్రశైలము లీలన్.
279-వ.
ఇట్లు మహేంద్ర పర్వతంబు గనుంగొని డాయంజని
యచ్చట.
280-ఉ.
ఆతఱి వానరప్రవరు లా ధరణీసుతఁ గానలేక దుః
ఖాతురులై వగంబడఁగ నాయెడఁ దద్గిరినుండి
వచ్చి సం
పాతి యనం బ్రసిద్ధుఁడగు పక్షి కులేంద్రుఁడు
రావణుండు దా
సీతను గొంచుఁ బోవుగతిఁ జెప్పుచుఁ దెల్పెను లంక
త్రోవయున్.
టీక : సంపాతి - జటాయువు అన్న సంపాతి, అనూరుడు శ్యేని ల
పెద్దకొడుకు. కొడుకు సుపార్వ్శుఁడు.
281-క.
ఆ పక్షీంద్రునిచేతను
జాపలశుభనేత్ర రామచంద్రునిదేవిన్
బాపాత్ముఁడైన దైత్యుఁడు
వే పట్టుక చనిన త్రోవ విని కపు లెల్లన్.
282-వ.
మహానందంబు నొంది యమ్మహేంద్ర పర్వతం
బారోహించి పురోభాగంబున.
283-క.
ఆ కపి వీరులు గనుగొని
రాకాశనదీ ప్రచుంబితార్భట భంగా
నీక మహాఘనరవ భయ
దాకార నటత్ప్రకాశు నాజలధీశున్.
284-వ.
అట్లు కనుంగొని.
285-క.
తమ తమ సత్త్వస్థితులును
గమియించెడు నబ్ధి కొలదిఁ గనుకొని మదిలో
బ్రమయుచుఁ బలికెను గపి సం
ఘము లెంతయు డెందమందుఁ గళవళపడుచున్.
టీక : సత్త్వస్థితి - సత్తువ శక్తిసామర్థ్యముల స్థాయి, గమియించు - గమించు, వెళ్ళవలసిన, కొలది - పరిమితి
హనుమంతుని సాగర లంఘనము
286-క.
ఈ వార్ధి దాఁట సత్త్వము
మా వలనం జాల దింక మారుతి! వినుమా
పావని వగుటం జేసియు
నీవలనం దక్క నొరులు నేరరు దాఁటన్.
టీక
: పావని – వాయుపుత్రుడు
287-వ.
అని యిట్లు ప్రార్థించినతోడనే యుబ్బి
వారి వచనంబులకు సమ్మతించి వాయు తనూజుం డిట్లనియె,
288-ఉ.
పావనమూర్తి రామనరపాలకు పంపున నబ్ధి దాఁటెదన్,
దేవవిరోధి చేఁబడిన దేవిని జూచెదఁ, గానకుండినన్
లావున గడ్డతోఁ బెఱికి లంకయ తెచ్చెద, నట్లు గానిచో
రావణుఁ బట్టి తెచ్చెదను, రాముని సన్నిధి కెన్ని
రీతులన్.
289-వ.
అని వారి మనంబులు సంతసిల్లునట్లుగా
బిరుదులు వక్కాణించి, తనకుఁ దండ్రి యైన వాయు దేవునకును, ద్రిమూర్త్యాత్మకుండైన లోకబాంధవునకును, నింద్రునకును, సంద్రమ్మునకును
నమస్కరించి, శ్రీరామ లక్ష్మణులఁ దన మనఃపద్మంబునం దిడికొని మ్రొక్కి, బంధుమిత్త్రులం
గౌఁగిలించుకొని, వారిచేత దీవనలం బొంది, గమనోన్ముఖుండై,
290-చ.
మొగము బిగించి, పాదములు మొత్తముగా వడినూఁది త్రొక్కి, నీ
టుగ మొగమెత్తి, భీకర కఠోర రవంబున నార్చి, బాహు ల
త్యగణిత లీల నూఁచి, వలయంబుగ వాలముఁ ద్రిప్పి, వ్రేఁగునన్
నగము సగమ్ము
గ్రుంగఁ, గపి నాథుఁడు నింగికి దాఁటె
ఱివ్వునన్.
టీక : ఊదు - అదుము
291-వ.
ఇట్లు నింగి కెగిరిపోవుచుండు సమయంబునఁ
బావనికి నడ్డంబుగా మానవ రూపంబున మైనాక పర్వతంబును, సురస యను నాగ జననియు, ఛాయాగ్రాహిణియైన
సింహికయునుం, గనుపట్టిన నెల్లర నతిక్రమించి, సువేలాచలంబున కరిగి, యక్కడ నలయిక దీర నొక్క
యిక్కువ నించుక సేపు విశ్రమించియున్న సమయంబున.
టీక : మైనాకుడు - పర్వతము, హిమవంతునికిని మేరుపుత్రి అయిన మేనకకును పుట్టిన వాడు, ఇంద్రుడు పర్వతాల
ఱెక్కలు వజ్రాయుధంతో తెగకొట్టుతుంటే ఈ మైనాకుడు వాయుదేవుని సాయంతో సముద్రలోకి చేరి
రక్షింపబడెను, దానికి కృతజ్ఞతగా లంకకుపోవు హనుమంతుని తనపై కొంతసేపు విశ్రాంతి
తీసుకోమని అడిగును. రామకర్యం కనుక హనుమ అంగీరింపక స్నేహం మాత్రం చేసెను. సురస - ఈ నాగమాత
రాక్షసీరూపముతో సముద్రమధ్యమున హనుమను అడ్డగింప అతఁడు తన దేహమును మిగుల ఉరువుగా
పెంచి మఱినిముషమునకు అంగుష్ఠమాత్ర శరీరుడై ఈమె గర్భమున ప్రవేశించి బయలు వెడలి
వచ్చెను, సింహిక - రాక్షసి, లంకకు పోవు హనుమంతుఁని నీడవలన సింహిక పట్టుకోగా,
నిలిచి దాని కడుపులో దూఱి దేహమును పెంచి కడుపు చించుకొని బయటికి వచ్చెను, సింహిక
రాహువు తల్లి దితి కూతురు, విప్రచిత్తి భార్య, సువేలాచలము - లంకానగరములోని పర్వతము,
ఇక్కువ - స్థలము
లంకా నగర సందర్శనము
292-ఉ.
భేరికి సాటియౌ దనుజ భీషణభాషలు, భద్రనాగ ఘీం
కార నినాదముల్, హయ నికాయపు హేషలు, కాహళధ్వనుల్
వీరమృదంగనాదములు, విశ్వభయంకర లీల లంకలో
బోరు కలంగఁగా, శ్వసనపుత్త్రుఁడు చాలఁగ
నాలకించుచున్.
టీక : భద్రనాగము - భద్రగజము, బోరు -
హోరు, శ్వసనపుత్రుడు - హనుమంతుడు.
293-ఉ.
కోటికిఁ గోటులై పరఁగు కుంజర వర్గము, ఘోటకంబులున్
గోటికి నెక్కుడై పరగుఁ గోత్రసమానములౌ రథంబులున్
గోటికి హెచ్చులై పరఁగు ఘోర నిశాచర కోటి కోట్లతో
సాటికి నెక్కు నప్పురము సాహసవంతుఁడు గాంచె ముందరన్.
టీక : గోత్రము - కులపర్వతము
294-వ.
ఇట్లా లంకాపుటభేదనంబును వీక్షించి తన
మనంబున,
295-శా.
ఘోరాకారులు, కామరూపులు, మహాక్రూరాత్ము, లత్యుగ్రు లీ
శూరుల్, వీరలఁ గన్నుఁ
బ్రామి పురిలో శోధించు లా గెట్లొకో?
యీ రూపంబునఁ బోవఁగాఁ గనిన వా రెగ్గేమి గావింతురో?
నారీరత్నము సీత నందుఁ గనఁగా నా కెట్లు సిద్ధించునో?
296-వ.
అని తలంచుచున్న యవసరమ్మున,
297-ఉ.
క్రుంకెఁ బయోజ బాంధవుఁడు, గూండ్లకుఁ బక్షులు సేరె నెల్లెడన్
బొంకము తీసెఁ దామరలు, పూచెను గల్వలు, తారకావళుల్
బింకముఁ జూపెఁ గాంతి, నళి బృందము కూర్కెఁ, దమంబుఁ బర్వె, నే
వంకను జార చోరకులు వ్రాలి చరించిరి కౌతుకంబునన్.
298-వ.
ఇట్లు నిశా సమయమునందుఁ దన మేటిగాత్రం
బణుమాత్రంబుగా గుదియించి, యగ్గిరి డిగ్గి చనుచు, నల్ల నల్లనఁ బురద్వారంబు నొద్దకుఁ జేరి, వానరపుంగవుఁడు
పురప్రవేశంబు సేసి,
హనుమంతుఁడు లంకలో సీతకై కలయ వెదుకుట
299-ఉ.
మేడలు, రచ్చకొట్టములు, మిద్దెలు, మంచెలు, నాటకూటముల్
మాడువు, లంగళుల్, దనుజ మందిరముల్, పురగోపురావళుల్,
వాడలు, దేవగేహములు, వప్రచయంబులు, వేశవాటికల్,
గోడలు, నాదిగాఁగఁ గపి కుంజరుఁ డప్పుడు చొచ్చి
చూచుచున్.
టీక : రచ్చకూటము - సమావేశమందిరము,
ఆటకూటము - ఆటస్థలములు, మాడువు - మండువాయిళ్ళు, బోడిమేడ- డాబా ఇల్లు, అంగళులు - దుకాణములు,
వాడ - నగరములోని భాగము, దేవగేహము - గుడి, వప్ర – కోడగోడ, వేశవాటిక – వేశ్యలుండు
పేట
300-క.
మఱువులు, సందులు, గొందులు,
నిరవులుఁ, జొరరాని చోట్లు, నేకాంతంపుం
దెరువులు, నంతఃపురములు
నెరవునఁ గపికుంజరుండు వెదకం జొచ్చెన్.
టీక : మఱువు - మఱుగు ప్రదేశము, సంది -
సన్ననివీధి, గొంది – సన్నని సందు, ఇరవు - స్థానము, ఏకాంతదెరువు - వ్యక్తిగతదారులు,
నెరవున - నిండుగా, పూర్తిగా
301-ఆ.
గాలి లీల, శీతకర కాంతి విఖ్యాతి,
ధూమ రేఖ రీతిఁ దూఱి చొచ్చి
యసుర మందిరముల నక్కడ నిక్కడఁ
గలయఁ దిరిగి వెదకెఁ గపివరుండు.
302-వ.
ఇట్లు తిరిగి తిరిగి వెదకుచుఁ దన మనంబున
303-క.
“మాయా బలుండు రాక్షస
నాయకుఁ డిటఁ బట్టి తెచ్చినాఁ డతని మహా
కాయము నుగ్రాకృతిఁ
గని
తోయలి తన తనువు నెచటఁ దొఁఱగెనొ యకటా!
టీక : తోయలి - తొయ్యలి, యువతి
304-మ.
అటుగా కీతఁడె యన్య
దేశమున నా యబ్జాక్షిఁ బెట్టించెనో?
ఘటయంత్రస్థితి
వార్ధి మధ్యమునఁ దాఁ గ్రౌర్యంబునన్ దాఁచెనో?
పటు బాహాబలశక్తి
నాకభువనప్రాగ్దేశమం దుంచెనో?
చటులగ్రాకృతి రాము
బాణములకున్ శంకించి యెందుంచెనో?”
టీక : ఘటయంత్రము - నీటిని తోడు గిలక యంత్రము?
305-వ.
అని యీ గతి వితర్కించి,
306-ఉ.
“త్రుంతు విధాత జందెములు, ధూర్జటి శైలము వ్రత్తు, విష్ణు సే
వింతు, గ్రహంబులం దిరుగవేయుదుఁ, బూర్ణపయోధు లేడుఁ గా
రింతు, నుడువ్రజంబులను లెక్కలు పెట్టుదు, భూతలంబు గ్ర
క్కింతు, నహీంద్ర లోకమును గీడ్పడఁ జేయుదు సాహసంబునన్.
టీక :
దూర్జటి- శివుడు, ఉడు- నక్షత్రము, క్రక్కు- వమనము, గీట్పాటు- ఆపద
307-ఉ.
కొట్టుదు నింద్రుఁ, బావకుని గుండెలు వ్రత్తుఁ, గృతాంతుఁ జెండుదున్
బట్టుదు దైత్యునిన్, వరుణు మానముఁ గొందును, గాలిఁదూలఁగా
దట్టుదుఁ, గిన్నరేశ్వరుని ప్రాణము కల్గుదు, శూలిఁ ద్రోలుదున్,
జట్టలు ద్రుంతు రావణుని, సారసలోచనఁ జూపకుండినన్.
టీక : చట్టలు- జబ్బలు
308-క.
ఈ మాడ్కిఁ జేయ దేవ
స్తోమమ్ములు చంద్ర వదనఁ జూపెద రొండెన్
ఏమిటికిఁ గీడు
తగదని
రాముఁడు వల దనుచు మరలి రమ్మను నొండెన్.”
309-వ.
అని యనేక ప్రకారంబుల నాలోచించుచు నొక్క
గోపురం బారోహించె నా సమయంబున.
310-క.
పావని కనుగొనె నప్పుడు
పావన విఖ్యాత సుగుణ భావోపేతన్
సేవిత దనుజవ్రాతన్
భూవనితాజాత, నిత్య పూతన్, సీతన్.
311-వ.
ఆరామం జూచి, శ్రీరామచంద్రుని దేవిని గాఁ దలంపుచు, నగ్గోపురంబునుండి
డిగ్గి, సూక్ష్మ రూపంబుఁ గైకొని, శింశుపావృక్షం బారోహించి యందు.
312-సీ.
పతిఁ బాసినట్టాపదలకంటెఁ బలుమాఱు-వివిధమాయలచేత వేఁగి వేఁగి,
వీరదానవకోటి వికృతవేషంబులు-కనుగొని చిత్తంబు క్రాఁగి క్రాఁగి,
తన దిక్కులేమికైఁ దల్లడిల్లుచు నాత్మ-లోఁపల మిక్కిలి లోఁగి లోఁగి,
కర్ణకఠోరంబుగా నాడుమాటలఁ-దొరఁగెడి కన్నీటఁ దోఁగి తోఁగి,
రాముఁ దలఁచుకొంచు, రామునిఁ బేర్కొంచు
“రామ! రామ!” యనుచు రమణి పలుకఁ
గపివరుండు సూచి కామినీ రత్నంబు
సీత యనుచుఁ బొంగెఁ జిత్తమందు.
313-వ.
అట్టి సమయంబున రావణాసురుండు సీతాపహృత హృదయుండై
పన్నీట మజ్జనంబాడి, దివ్యాంబరంబులు గట్టుకొని, కర్పూర సమ్మిళితంబైన శ్రీగంధంబు నెఱపూఁత పూసి, పారిజాతపుష్పంబులు
ముడిచి, మువ్వంపుఁ దావి నివ్వటిల్లెడు జవ్వాది మెత్తి, దశశిరంబుల యందును రత్నమకుటంబులు ధరించి, మణిమండితంబు లగు
కుండలములు పూని, భానుప్రభావిలసితంబులగు పతకంబులును, ముక్తాహారంబులును, భుజకీర్తులును, బాహుపురులును, నంగుళీయంబులును, నవరత్న స్థగితంబగు
నొడ్డాణంబును నమరించి, చంద్రహాసహస్తుండై, కందర్ప విలాస సుందరుండగుచుఁ గిన్నర కింపురుష
గంధర్వామరోరగ సిద్ధ విద్యాధరాంగన లుభయ పార్శ్వంబుల నాలవట్టంబులుపట్టి, మౌక్తికఛత్రంబులును, దాళవృంతంబులును, వింజామరంబులును ధరించి
రాఁ గొందఱు కరదీపికా సహస్రంబులు గైకొని ముందఱఁ బిఱుంద నేతేర, నశోకారామంబునకుఁ
జనుదెంచె, నప్పుడు గంధవాతూలంబునం దూలు పుష్పలతయునుం బోలె వడవడ వడంకుచుఁ, దన సుందరాంగంబులు, హస్తోరు వస్త్ర కేశంబుల, మాటియుఁ, గప్పియు, నడంచియు, నివురుగప్పిననిప్పు
చందంబున, ధూళిధూసరంబగు రత్నంబు కైవడి, మేఘచ్ఛన్నంబగు చంద్రబింబంబు డంబున, నిత్తడిపొదిగిన
కుందనంపుశలాక లాగున, మాఱుపడియున్న జానకిని గదిసి,
టీక : ఆలపట్టము - వస్త్రముతో గుండ్రముగా
చేసిన విసనకఱ్ఱ.
రావణుఁడు మదనాతురుఁడై సీతను బ్రార్థించుట
314-క.
సీతను గనుగొని రావణుఁ
డాతత నయవాక్యఫణితి నతికుతుకమునన్
జేతోభవ నిశితాంబక
పాతంబులఁ జాల నొచ్చి పలుకఁగఁ జొచ్చెన్.
315-లగ్రా.
“తోయజదళాక్షి! వలరాయఁ డిటు లేచి పటు;
సాయకము లేర్చి యిపు డేయఁగఁదొడంగెన్,
దోయదపథంబున నమేయ రుచితోడ నుడు;
రాయఁడును మంచి వడఁ గాయఁగఁ గడంగెన్,
గోయిలలుఁ గీరములుఁ గూయఁగ నళివ్రజము;
లేయెడలఁ జూచినను మ్రోయుచుఁ జెలంగెన్,
నా యెడఁ గృపారసము సేయ కవివేకమున;
నీయెడల నుండుటిది న్యాయమె లతాంగీ!”
టీక : వలరాయుడు -
మన్మథుడు, తోయదపదము - ఆకాశము, ఉడురాయుడు - చంద్రుడు,
316-వ.
అని మఱియును,
317-సీ.
“అలకేశ్వరుం డుపాయనముగా నిచ్చిన-యంచిత చీనిచీనాంబరములు,
దివిజాధినాథుండు దిన దినంబును నిచ్చు-పారిజాతోల్లసత్ప్రసవములును,
దక్షిణాధీశుండు తగఁ గాన్క లంపిన-సురభి కర్పూరాది పరిమళములుఁ
బాతాళముననుండి ఫణిసార్వభౌముండు-పుత్తెంచినటువంటి భూషణములుఁ
గలవు నా యింట నే ప్రొద్దుఁ గదమ లేక
దేహ పరితృప్తి గావించి మోహ మలరఁ
గాము కేళి సుఖంబులఁ గలయు టొప్పు
విడువు మడియాస రామ భూవిభుని మీఁద.
318-సీ.
ఎవ్వాని వీటికి నేడు వారాసులు-పెట్టని కోటలై పెచ్చు పెరుఁగు,
నెవ్వాని సేవింతు రింద్రాది దేవత-లనుచర బలు లయి యనుదినంబు,
నెవ్వాని చెఱసాల నే ప్రొద్దు
నుందురు-గంధర్వ సుర యక్ష గరుడ కాంత,
లెవ్వాని భండార మిరవొంద విలసిల్లు-నవ నిధానంబుల వివిధ భంగి,
సకల లోకంబులును మహోత్సాహ వృత్తి
నెవ్వనికిఁ జెల్లుఁ బుష్పక మ్మెక్కి తిరుగ,
నాకె తక్కంగఁ గలదె యే నాట నైన?
మద్భుజాశక్తి ప్రతిపోల్ప నద్భుతంబు.
319-సీ.
శ్వసనుండు లోగిలి సమ్మార్జనముఁ జేయ-నబ్ధినాథుఁడు కలయంపి సల్లఁ,
బావకుం డరుదెంచి పాకంబు లొనరింప-శమనుండు వెసఁ బరిచర్యఁ జేయఁ,
బాకారి కల్పక ప్రకరంబు లర్పింప-దనుజేశ్వరుండు కైదండ యిడఁగ,
నరవాహనుండు తా నగరి వెచ్చము వెట్ట-నీశానుఁడు విభూతి నెలమి నీయ,
గురుఁడు పంచాంగ
మెప్పుడు సరవిఁ జెప్ప
నమర కిన్నర గంధర్వ యక్ష భుజగ
సిద్ధ కింపురుషాంగనల్ చేరి కొలువ
వైభవంబునఁ జెలు వొందువాఁడఁ దరుణి!
టీక : శ్వసనుడు - వాయుదేవుడు, మార్జనము - తుడుచుట,
అబ్ధినాథడు - వరుణుడు, కలయంపి - కళ్ళాపి, పావకుడు - అగ్నిదేవుడు, పాకము - వంట, శమనుడు - యముడు, పాకారి - ఇంద్రుడు, కల్పక ప్రకరము - కల్పవృక్షాల సముదాయము,
దనుజేశ్వరుడు - కుబేరుడు, కైదండ - చేయూత, నరవాహనుడు - నైరృతి, వెచ్చముపెట్టు –
కిరాణా సామాన్లకు అప్పుపెట్టు, ఈశానుడు -ఈశాన్యదిక్పతి, గురుడు – బృహస్పతి.
320-ఉ.
ఎత్తితి శంకరాచల మహీన బలంబున బంతి లాగునన్
మొత్తితి సర్వదిక్పతుల మూఁగిన గర్వము విచ్చిపాఱఁగా,
నొత్తితి శత్రుభూపతుల నుగ్రరణంబున భూమిఁ ద్రెళ్ళఁగా
మొత్తితి భోగికంఠము లమోఘ జవంబున మేటి కీర్తులన్.
321-తే.
జడలు ధరియించి తపసుల చందమునను
దమ్ముఁడును దాను ఘోర దుర్గమ్ములందుఁ
గూరగాయలు కూడుగాఁ గుడుచునట్టి
రాముఁ డే రీతి లంకకు రాఁగలండు?
322-ఆ.
ఇంకఁ జేయఁ నేర, రీఁదంగ నోపరు,
కట్ట లేరు, చుట్టి పట్ట లేరు,
జలధి దాఁట లావు చాలదు నరులకు,
వచ్చు త్రోవ చెపుమ వారిజాక్షి?
323-క.
దానవు లెప్పుడు చూచిన
మానవులను గెలువఁ గలరు, మది నూహింపన్
మానవ భక్షకులై మను
దానవులను గెలువ నరుల తరమే జగతిన్?
324-క.
జగతీశుఁడు మానవుఁడట!
నగరే భుజశక్తిచేత నా కెదురన్నన్?
నగధరుఁడో, నగధన్వుఁడొ,
నగభేదియొ, కొంత కొంత నాతోఁ బోరన్?
టీక
: నగధరుడు - ఆదిశేషుడు, నగధన్వుడు - శివుడు, నగభేది - ఇంద్రుడు
325-వ.
ఆ సంగతి యట్లుండనిమ్ము.
326-క.
నీ కన్నుల సౌభాగ్యము
నీకుచములఁ గలుగు మేలు, నీ ముఖ కాంతుల్
నీ కరముల లావణ్యము
నాకస్త్రీలందు లేవు నాకుం జూడన్.
327-మ.
సురకాంతల్ సరిరారు! యక్షసతులున్ సూటింపఁగారారు, కి
న్నరభామల్ ప్రతిరారు, సిద్ధవనితల్ న్యాయంబుగాఁబోల, రా
గరుడాబ్జాక్షులు
సాటిరారు, తలఁపన్ గంధర్వలోలాక్షులున్,
మఱి యేరీ నినుఁ
జెప్పి చెప్పఁ దరుణుల్ మత్తేభకుంభస్తనీ!
328-క.
వ్రీడ యలంకారముగా
నాడుము భయముడిగి మధురమైన మృదూక్తుల్,
బేడిసలనేలు కన్నులఁ
జూడుము కనుఱెప్ప లెత్తి సుదతీ! నన్నున్.”
టీక : బేడిస- చేప జాతి విశేషము
329-వ.
అని యిట్లు నోరికి వచ్చిన మచ్చునఁ
బ్రేలుచున్న యా నీచుని దుష్ట భాషణంబులకు రోసి తృణంబు చేపట్టి, జనక భూపాల నందన
యిట్లనియె.
సీత రావణుని దెగడి శ్రీరాముని బొగడుట
330-క.
“పతి దైవముగా
నెప్పుడు
మతిఁ దలఁచుచు
నుండునట్టి మగువలఁ జెఱుపన్
బ్రతిన గలయట్టి నీతోఁ
బ్రతివచనము లాడుకంటెఁ బాపము గలదే?
331-క.
పరదారాపేక్షకులగు
పురుషుల కాయువు నశించుఁ, బుణ్యము సెడు, స
త్పురుషుల దూషింపఁగఁ
దుది
నరకంబునఁ బడుదు
రనెడి న్యాయము వినవే?
332-వ.
అదియునుం గాక,
333-క.
తన సాహసంబు తానే
కొనియాడు నతండు హీనగుణుఁడని వినుచున్
నిను నీవ
పొగడుకొంటివి
వినఁగూడదు నీదు నీతివిరహితభాషల్.
334-శా.
సంగరరంగమందు నతి శౌర్యమునన్ రఘురాముతోడ మా
తంగ తురంగ సద్భట శతాంగ బలంబులఁ గూడి నీవు పో
రంగను నోప, కిప్పుడు విరాధ ఖరాదుల పాటుఁ జూచియున్
దొంగిలి నన్నుఁ దెచ్చితివి, తుచ్ఛపుఁ
బల్కులు పల్కఁ బాడియే.
335-సీ.
కూఁకటి ముడికినై కురులు గూడని నాఁడె-బెదరక తాటకఁ బీఁచ మణచెఁ,
గాధేయుఁ డొనరించు క్రతు రక్షణము సేయఁ-బెక్కండ్రు దైత్యుల నుక్కణంచె,
నవనిపై విలసిల్లు నఖిల రాజన్యులు-వ్రేలఁ జూపఁగఁ లేని విల్లు విఱిచె,
ఘోరాటవులలోనఁ గ్రుమ్మరు నప్పుడు-ఖర దూషణాది రాక్షసులఁ జంపెఁ,
బాదరజమున నొక ఱాయిఁ బడఁతిఁ
జేసె
లీల మాయామృగంబును గూలనేసె,
రాజమాత్రుండె మేదినీరక్షకుండు
రామభూపాలుఁ డాదినారాయణుండు.
టీక : గాధేయుడు – విశ్వామిత్రుడు.
*336-తే.
అట్టి రామున కీయది యనఁగ
నెంత?
లంక యన నెంత? దనుజుల పొంక
మెంత?
నీ వనఁగ నెంత? నీ లావు చేవ
యెంత?
చెప్ప నేటికి నీవె చూచెదవు గాక!
337-శా.
వీరాలాపము లాడనేల వినుమీ, విశ్వప్రకాశంబుగాఁ
బారావారముఁ గట్టి, రాఘవుఁడు కోపస్ఫూర్తి దీపింపఁగా
ఘోరాజిన్ నిను డాసి, లావు కలిమిన్ గోటీర యుక్తంబుగాఁ
గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి, భుక్తుల్ బెట్టు
భూతాళికిన్.
టీక : భుక్త - భోజనము
338-శా.
ఆరూఢప్రతిమాన
విక్రమ కళాహంకార తేజోనిథిన్
శ్రీరామున్, సుగుణాభిరాముఁ దెగడన్ జేకొన్న నిన్నాజిలో
దారన్ దొంగిలితంచు
నిష్ఠురగతిన్ దండించి ఖండింప ము
న్నీరెట్లైనను దాఁటివచ్చు నలుకన్ నేఁ డెల్లి శాంతింపుమా.”
టీక : మున్నీరు -
సముద్రము, నేడెల్లి - ఇవాళరేపు
339-వ.
అని తన్నుఁ జీరికిం గొనక వీరాలాపంబు లాడ
నా రావణుఁ డొడుపు దప్పిన కాలాహి చందంబున నుగ్రుండై మండిపడి యిట్లనియె.
రావణుఁడు కుపితుఁడై సీతకు వ్యవధి నొసఁగుట
340-క.
“ఆఁటదిగా యని కూరిమి
పాటించిన కొలది నన్నుఁ బలుకఁగఁ జొచ్చెన్,
మాటాడకుండ నాలుక
తూఁటులుగాఁ జేయకున్న దోసము గాదే!
341-క.
కుయ్యాడక నా ముందఱఁ
గయ్యమునకుఁ గాలుదువ్వఁ గడఁగెను దీనిన్
దయ్యాలకు బలి వెట్టెద
వ్రయ్యలుగా నఱికి యెల్లవారును జూడన్.
టీక : కుయ్యాడు - మొఱపెట్టు
342-క.
కాకున్న దీని బలిమిని
బైకొని నాకాంక్ష దీఱ భావజ కేళిన్
జేకొనక
విడిచిపెట్టినఁ
గైకొనునే నవ్వుఁ గాక గర్వము పేర్మిన్.
343-శా.
భీమాటోప భుజప్రతాప మహిమన్ భీమాచలం బెత్తి, సు
త్రామాద్యష్ట దిగీశ సైన్యముల సంగ్రామంబులో నోర్చి, యు
ద్దామప్రౌఢిఁ జెలంగుచుండెడు కళాధాముండ, నా ముందటన్
రామున్ గీముని జెప్ప
గిప్ప నగరా రాకేందుబింబాననా!
టీక : భీమాచలము - కైలాసము,
సుత్రాముడు - ఇంద్రుడు
344-సీ.
అఖిల లోకముల నా యాజ్ఞ నిల్పితి నేక-హేలను బుష్పకం బెక్కి తిరిగి,
వేల్పు మూఁకలచేత వెట్టి సేయించితి-దితి వంశ వల్లభుల్ నుతులు సేయ,
గణములతోఁ గూడ గైలాస మెత్తితి-బటువైన పూవుల బంతి పగిది,
వనజగర్భునిచేత వరములు గైకొంటి-దండిగా నత్యుగ్ర తపము సల్పి,
చెఱలు పట్టితి గంధర్వ సిద్ధ సాధ్య
భుజగ సుర యక్ష కిన్నర ముఖ్య సతుల,
నట్టి సామర్థ్య మెవరి కేనాఁడు గలదు?
మహిని నా కొక్కనికె కాక మంజువాణి!
345-తే.
నాకు నెదిరింప నొక పేద నరుని నొడ్డి
వెఱవ కీ రీతి దుర్భాష లఱచు దీని
జిహ్వ మొదలంటఁ బట్టి యీ శిత కుఠార
ధారఁ దునుమాడి ధారుణిఁ బాఱవైతు.”
346-వ.
అని చంద్రహాసంబు జంకించి లేవ నుంకించు
తఱిఁ గొందఱు ప్రియ సుందరు లడ్డంబు సొచ్చి,
347-చ.
“సురవరుఁడో? ధనంజయుఁడొ? సూర్యతనూజుఁడ యాతుధానుఁడో?
శరధి విభుండొ? గొప్పొ? పురశాసను మిత్త్రుఁడొ? భోగిభూషుఁడో?
గురుభుజశక్తిఁ గైకొనుచుఁ గోపము సూపఁగ నీకు నెంత యి
త్తరుణిపయిం బ్రతాపమున దారుణ కృత్యము సేయఁ గూడునే?
348-క.
ఏటికి మీ రిటు కినియఁగ
గాటపు జంకెనయె చాలుఁ, గరవాలున కీ
యాఁటది యర్హమె? మము నీ
మాటికి మన్నించి కావుమా యిఁకఁ జాలున్.”
349-వ.
అని శాంత వచనంబులఁ బ్రియంబు సెప్పిన
యప్పంకరుహాక్షుల విన్నపంబులు మన్నించి, యారాక్షస చక్రవర్తి వైదేహికిఁ గావలి
యున్న యేకజటా ద్విజటా త్రిజటా దుర్ముఖీ వాయుముఖీ శూర్పణఖలాదిగాఁ గల దైత్య కామినుల
వంకఁ గనుగొని.
350-క.
“గడు విచ్చితి నిరు మాసము
లొడఁ బఱుపుఁడు నేర్చినట్టు, లొడఁబడ కున్నన్
గడి కండలుగాఁ గోసుక
పడఁతులు భక్షింపుఁ డింతి పలలం బంతన్”
351-వ.
అని రోషారుణిత నేత్రుండై యతి
భీషణాకారంబుఁ దాల్చి పలికిన.
జానకి సంతాపము
352-క.
తన పతి నిందించుటకును
దన ప్రియములు చెప్ప వినక తక్కిన మీఁదన్
దనుఁ జంపుఁ డన్న మాటకు
నినకులవల్లభుని దేవి యేడ్చెన్
బెలుచన్.
353-సీ.
జానకి శోకింప సాధ్య కిన్నర యక్ష-గరుడోరగామర కాంత లెల్ల
వెంటనే శోకింప విని గంధవహుపుత్త్రు-డాత్మలోఁ
జింతించి యాగ్రహమున
నీ దుష్టదైత్యుపై నిప్పుడే లంఘించి-చెండాడ
నాచేతఁ జిక్కెనేని
కార్యంబు లెస్సగుఁ, గాక సత్త్వము తూలి-బలువిడి
వీనిచే బడితినేని,
సీతఁ గానంగ లేక కృశించి
రామ
భద్రుఁ డడఁగిన, సీతయుఁ బ్రాణ
మెడలు,
లక్ష్మణుండును జూడ నాలస్య ముడిగి
తెగును, నట్లైనఁ గార్యంబు తెఱఁగు దప్పు.
354-చ.
అని పవనాత్మజుండు దివిజారి పయిం దెగ వేళగాదు, భూ
తనయకు నాదు రాక, వసుధావరు మేలు నెఱుంగఁ జెప్పి, మీ
దను మఱి చూత మంచు నుచితస్థితి నూరక యుండె, నప్పు
డా
దనుజ విభుండు వోయె నిజధామముఁజేర
సతీ సమేతుఁడై.
355-వ.
అప్పుడు యామినీచర కామినులు రావణానుమతంబున
ననేక విధంబులగు మధురాలాపంబుల మిథిలాధీశు కుమారిం గుఱించి బోధించి, కార్యంబు సాధింప నోపక, యలసి యుంటంజేసి
యొక్కింతసేపు నిద్రించుచుండ, మేల్కొని త్రిజటయను నిశాచరి యిట్లనియె.
త్రిజటా స్వప్న వృత్తాంతము
356-మ.
“కల గంటిన్ వినుఁ
డింతులార! మన లంకాద్వీప మీ యబ్ధిలో
పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్నకోటీరముల్
కలనన్ గూల రఘూద్వహుం డెలమితో గంధద్విపంబెక్కి, యు
జ్జ్వల కాంతిన్ విలసిల్లు
సీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే.
టీక : గంధద్విపము- మదపుటేనుగు
357-క.
శుద్ధాత్ముఁడైన రాముఁడు
శుద్ధాంతపుదేవిఁ గాన శుభ సూచకముల్
సిద్ధమయి తోఁచుచున్నవి
సిద్ధంబీ మాట వేద సిద్ధాంతముగాన్.
358-క.
కావున నిక్కోమలి యెడఁ
గావలి యున్నట్టి మీరు కఠినోక్తులు
గా
నేవియు నాడకుఁ, డిఁక నీ
దేవియు రక్షింప మనకు దిక్కగు
మీఁదన్.”
359-వ.
అని చెప్పి మఱియును,
360-క.
“అమ్మా! వెఱవకు మదిలో
నిమ్ముగ మఱి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్
నెమ్మిగ నినుఁ గొనిపోవును,
మమ్మందఱ మనుపు, మమ్ము! మఱవక
కరుణన్.”
361-ఆ.
అనుచు దనుజ కాంత లంతంత
నెడఁ బాసి
నిదురవోయి, రంత నదరి
సీత
తనకు దిక్కులేమిఁ దలపోసి దుఃఖింపఁ
బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె.
హనుమంతుఁడు రాముని కుశల వార్తను సీతకు
విన్నవించుట
362-క.
“ఉన్నాఁడు లెస్స రాఘవుఁ,
డున్నాఁ డిదె కపులఁ గూడి, యురు గతి రానై
యున్నాఁడు, నిన్నుఁ గొని పో
నున్నాఁ, డిది నిజము నమ్ము ముర్వీతనయా!”
363-సీ.
ఆ మాట లాలించి భూమిజ తనలోన-వెఱఁగంది, శింశుపా వృక్ష మరసి
చూడంగ, నప్పుడు సూక్ష్మ రూపంబున-నొడికమౌ శాఖల నడుమ నున్న
కపి కుమారుని రూప మపురూపముగఁ జేసి -స్వాంతంబులోన హర్షంబు నొంది,
దనుజ మాయలచేతఁ దఱచు వేగుఁటఁ జేసి-మాఱాడ నేరక యూర కున్న
భావ మూహించి, తన్ను నా దేవి యాత్మ
నమ్మకుండుట దెలిసి, యా కొమ్మమీఁది
నుండి క్రిందికి లంఘించి, నిండు భక్తి
మ్రొక్కి నిలుచుండి
కరములు మోడ్చి పలికె.
364-ఉ.
“తమ్ముని గూడి పుణ్యగుణధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం
తమ్మున సైన్య సంఘము ముదంబునఁ
గొల్వఁగ నుండి, భూమిపై
మిమ్ములఁ జూచి రండనుచు మేటి కపీంద్రులఁ
బుచ్చి, యందు మొ
త్తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ
భాగము చూఁడ బంపుచున్.
శ్రీరామ ముద్రికా ప్రదానము
365-క.
" అంగనఁ బొడఁగన నీ వి
య్యంగను గడుఁ జాలువాఁడ వంచును, నాచే
నుంగర
మంపెను శ్రీ రఘు
పుంగవుఁ, డిదె కొ” మ్మటంచు భూమిజ
కిచ్చెన్.
366-ఉ.
ఇచ్చినఁ జూచి, రామ ధరణీశ్వరు ముద్రికఁగా నెఱింగి, తా
నిచ్చను మెచ్చి, యా
కువలయేక్షణ యాత్మ గతంబునందు నీ
వచ్చినదాని భావమును, వల్లభుచందము
నేర్పడంగ, నేఁ
జెచ్చెర నంతయుం దెలియఁజెప్పుము
నమ్మిక పుట్టునట్లుగన్.
367-వ.
అని విచారించి యిట్లనియె,
368-క.
“నిను విశ్వసింపఁ జాలను,
వినుపింపుము నీ తెఱంగు, విభుని
విధము నా”
కనవుడుఁ బావని తెలియఁగ
వినయంబున విన్నవించె విస్ఫుట
ఫణితిన్.
369-ఉ.
“రాముని డాఁగురించి, నిను రావణుఁ డెత్తుక వచ్చువేళ, నీ
హేమ విభూషణావళుల నేర్పడ ఋష్య మహాద్రి వైచినన్
మే మవి తీసి దాఁచితిమి, మీపతి
యచ్చటి కేఁగుదేరఁగాఁ
దామరసాప్త నందనుఁడు తా నవి సూపినఁ జూచి
మెచ్చుచున్.
370-సీ.
అర్క సంభవునకు నభయంబు దయచేసి-దుందుభి కాయమ్ముఁ దూలఁ దన్ని,
యేడు తాడుల సర్వ మేకమ్ముగాఁ ద్రుంచి-వాలి నద్భుతశక్తిఁ గూల నేసి,
సుగ్రీవునకుఁ దార సుదతిగా నిప్పించి-యంగదు
యువరా జనంగ నిలిపి,
వారలతోడను వానర సైన్యంబు-లెన్నేని గొలువంగ నేఁగు దెంచి,
మాల్యవంతంబునం దుండి, మనుజ
విభుఁడు
నిన్ను వెదకంగ నందఱ నన్ని దిశలఁ
బనుచునప్పుడు, దక్షిణ భాగ
మరయ
నంగదునితోడఁ గొందఱ మరుగుదేర.
371-తే.
వారి పంపున నవలీల వార్ధి
దాఁటి
వచ్చి సకలంబుఁ జూచి యీ వంకఁ గంటి
రావణుఁడు వచ్చి నిన్ను నుగ్రంబుగాఁగఁ
బలుకునప్పుడు నున్నాఁడఁ బాదపమున.”
హనుమంతుఁడు శ్రీరాముని శోభన గుణములను
వర్ణించుట
372-వ.
ఇవ్విధంబున బలుకుచుండినను నమ్మక యతనిం
గనుంగొని “రాముఁడే రీతివాఁడో యతని చందం బెఱింగింపు” మనవు డా వాయు నందనుండు, రఘునందనునకు వందనం
బాచరించి, భూమినందన కిట్లని చెప్పుచున్నాఁడు.
373-సీ.
“నీలమేఘచ్ఛాయఁ బోలు దేహమువాఁడు-ధవళాబ్జ పత్ర నేత్రములవాఁడు
కంబు సన్నిభమైన కంఠంబు గలఁవాడు-చక్కని పీన వక్షంబువాఁడు
తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు-ఘనమైన
దుందుభి స్వనమువాఁడు
పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు-బాగైన
యట్టి గుల్ఫములవాఁడు
కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడు
రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నె వాఁడు.
374-తే.
ఉరుతరాటవిలోన మహోగ్రతపము
వాయుదేవుని గుఱియించి వరుఁసఁ జేసి
యంజనాదేవి గనియె నన్నర్థితోడ
నర్కజుని మంత్రి, హనుమంతుఁ డండ్రు
నన్ను.”
375-వ.
అని యిట్లు తాత్పర్యంబునఁ బట్టునట్లుగా
విన్నవించి “దేవీ! నీ దేవుండయిన శ్రీరాముండు నాచేతి కిచ్చి యంపిన నూత్న రత్నాంగుళీయకంబు
నీకు సమర్పించితి నింక రిక్త హస్తంబులతోఁ జనుట దూతల కుచితమైన కార్యంబు గాదు. కావున
నిన్ను దర్శించినందులకు శ్రీరామునకు నమ్మిక పుట్టునట్టులుగా నీశిరోరత్నంబు నాకు
దయచేయవలయు” ననుటయు నా కుశేశయనయన యిట్లనియె,
టీక : కుశేశయ నయన- పద్మముల వంటి కన్నులుకలామె
సీత తన చూడామణి నానవాలుగ హనుమంతునకు
నిచ్చుట
376-క.
“నా నాథు క్షేమ మంతయు
ధీనిధి! నీచేత వింటిఁ దెలియఁగ, నైనన్
నీ నిజ రూపము చూడక
నే నా రత్నంబు నమ్మి నీ కీయఁ జుమీ!”
377-వ.
అనుటయు నా హనుమంతుండు,
ఆకస మంటఁ బెంచిన హనుమ రూపము
378-క.
చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబర
వీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్.
379-వ.
ఇట్లు తన మహోన్నత రూపంబు చూపి
యెప్పటియట్ల మరల సూక్ష్మ రూపంబు గైకొని నమస్కరించిన, నా హనుమంతునకు నద్దేవి తన శిరోరత్నంబు
ననుగ్రహించి యిట్లనియె.
శ్రీరామునకు సీత సందేశము
380-చ.
“రవికుల వార్ధిచంద్రుఁడగు రాముని
సేమము చాల వింటి, నా
వివిధము లైన పాట్లు పృథివీపతికిం
దగఁ జెప్పఁగల్గె నేఁ
డవిరళభంగి నీ వలన, నచ్చుగ
నే నుపకార మేమియుం
దవిలి యొనర్ప లేను వసుధాస్థలి
వర్ధిలు బ్రహ్మ కల్పముల్.
381-వ.
ఇట్లు దీవించి మఱియును,
382-క.
“ఏ యెడఁ జూచిన ధరణీ
నాయకు శ్రీపాద యుగము నా చిత్తములోఁ
బాయ దని విన్నవింపుము
వాయు తనూభవుఁడ పుణ్యవంతుఁడ! తెలియన్.
383-తే.
ఇపుడు రావణుఁ డేతెంచి కపట
బుద్ధి,
గర్వమునఁజేసి నన్నెన్ని కాఱులాడె,
నన్నియును నీవు చెవులార విన్న తెఱఁగు
పతికి దయ పుట్టఁగా విన్నపంబు సేయు.
384-సీ.
నిడుదపున్నెఱివేణి జడలుగా సవరించి-మలిన జీర్ణాంబరం బొలియఁ గట్టి,
భూమీరజంబు విభూతి పూఁతగఁ బూసి-తన
పతి మూర్తిఁ జిత్తమున నిల్పి,
నిరశన స్థితితోడ నిలిచి భూశయ్యను-బవళించి
నిదుర యేర్పడఁగ విడిచి,
తారక బ్రహ్మ మంత్రంబుఁ బఠింపుచుఁ-గఠిన
రాక్షస దుర్మృగములలోన
నహిత లంకా మహా ద్వీప గహన
సీమఁ
దపము సేయుచునున్నాను తన్నుఁ గూర్చి,
నాకుఁ బ్రత్యక్ష మగు మని నాథునకును
విన్నవింపుము సత్త్వ సంపన్న! నీవు.
385-వ.
అని చెప్పి మఱియును,
386-చ.
జనకుని భంగి రామ నృపచంద్రుని, నన్నును దల్లిమాఱుగాఁ
గని, కొలువంగ నేర్చు గుణగణ్యుని, లక్ష్మణు నీతిపారగున్
వినఁ గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి
చెప్పుమా.
387-క.
ఆ మాటలు మది నుంచక
నా మానముఁ గావు మనుచు నయ
వినయ గుణో
ద్ధాముఁడు, రాముని తమ్ముఁడు,
సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసివర్యా!”
388-వ.
అని యిట్లు జనక రాజ తనయ పలికిన పలుకు
లాలకించి హనుమంతుం డా జననితో నిట్లనియె.
389-క.
“ఇనుఁ డుదయింపక మున్నే
వననిధి లంఘించి, మనుజ వల్లభుకడకున్
నినుఁ గొనిపోయెద, వీఁపున
జననీ! కూర్చుండు” మనిన, సంతోషమునన్.
390-క.
“నీ వంతవాఁడ వగుదువు,
నీ వెంటనె వత్తునేని నెగడవు కీర్తుల్
రావణుకంటెను మిక్కిలి
భూవరుఁడే దొంగ యండ్రు బుధ
నుత చరితా!
391-వ.
అదియునుం గాక రామచంద్రునిం దప్ప నితరుల
నంటుదానం గాను, గావున నీతో రాఁదగదు మఱియును,
392-క.
దొంగిలి తెచ్చిన దైత్యుని
సంగడులగు వాని వారి సాహస
మొప్పన్
సంగర ముఖమునఁ జంపక
దొంగిలి కొనిపోవఁ దగునె దొరలకు
నెందున్?
టీక : సంగడులు- స్నేహితులు, సంగతి నుండువారు
393-వ.
మఱియు రామచంద్రుండు త్రిజగదేక వీరుండును, గోదండ దీక్షాగురుండును, రాక్షస కులాంతకుండును
నగుటంజేసి రాణివాస ద్రోహి యగు రావణుని సంగరరంగంబునఁ బ్రఖ్యాతంబుగాఁ జంపి కొనిపోవుట
ధర్మంబు; నీవు రామచంద్రునకుఁ బరమ భృత్యుండవును, బుత్త్ర సముండవును నగుటంజేసి, నీ వెంట నరుగుదెంచుట
తప్పుగాక బోయినను, బగ తీర్పక వచ్చు టుచితంబు గాదు. కావున రాఘవేశ్వరుల కిన్నియుం దెలియ
విన్నపంబుసేసి తడయక తోడ్కొని ర” మ్మనిన నద్దేవికి నమస్కరించి హనుమంతుం డిట్లనియె,
394-ఉ.
“నీ విభుఁ డబ్ధి దాఁటి, ధరణీతల నాథులు సన్నుతింప, సు
గ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి, నీచునిన్
రావణు నాజిలోఁ దునిమి, రాజస
మొప్పఁగ నిన్నుఁ గొంచు, సే
నావళితోడ నీ పురికి నారయ
నేఁగు నిజంబు నమ్ముమా!”
395-వ.
అని విన్నవించి నమ్రుండై యద్దేవిచేత
దీవెనలు పొంది, మరలి చనుచున్నవాఁడై తన రాక రావణున కెఱుంగఁ జేయవలయు నని తలంచి.
హనుమంతుని విక్రమ విహారము
396-సీ.
మేదిని సమముగా మేడలు గావించి-కేళీ గృహంబుల నేలఁ గలిపి,
కమలాకరంబులు కలఁచి గారలు వెట్టి-వృక్ష
జాతంబుల విఱుగఁ దన్ని,
పుష్ప గుచ్ఛంబులు పుణికి పాఱఁగ వైచి-తేనెలు
రాల్చి పూఁ దేనె లుడిపి,
పొదరిండ్ల పొడవులు చదియఁగా నుగ్గాడి-చప్పరంబుల
నేల చదునుజేసి,
వనముఁ గాచెడి రాక్షస వర్గములను
వీర వరులను, నెనిమిదివేలఁ జంప,
సీతఁ గాచెడి రాక్షస స్త్రీలు బెదిరి
పాఱిపోయిరి రావణుపాలి కంత.
397-వ.
ఇట్లు రావణుం జేరి వారు,
398-క.
“దేవా! నేఁ డొక మర్కటుఁ
డే విధమున వచ్చినాఁడొ యెఱుఁగము, సీతా
దేవిఁ గని మాటలాడియుఁ
బోవుచు వన మెల్లఁ బెఱికి ప్రోవిడి
కడఁకన్.
399-తే.
వనముఁ గాచెడి రాక్షస వర్గములను
దండి నొకనిని మిడి వోవకుండఁ బట్టి,
మేటి భుజశక్తి నందఱ గీటడంచి,
వాలి యున్నాఁడు సాహసవంతుఁడగుచు,”
కపి వీరుఁడు రాక్షస వీరులను గసిమసంగుట
400-వ.
అని విన్నవించినంతనే క్రోధరక్తాంతలోచనుం
డగుచు, నవ్వింశతి లోచనుండు విచారించి, వాఁడు రాముని పంపున వచ్చిన దూత కాఁబోలు, వానిం జంపుం డని
పదివేల రాక్షసులం బంపిన
401-క.
ఉగ్రాకారుం డగుచు ద
శగ్రీవుం డనుపఁ దనుజ సంఘంబులు
దా
మాగ్రహమునఁ జనుచు బలో
దగ్రక్రోధాత్ము లగుచుఁ దాఁకిరి
జడిమిన్.
402-ఉ.
తాఁకిన యంత, వాయుజుఁడు తా నదలించి కఠోర రేఖతో
వీఁక నెదిర్చి పేర్చి, రణవీథి నిశాచర సైన్య మెల్ల నొ
క్కూఁకున వెంటనంటి సమదోగ్ర బలంబునఁ బాఱఁ బాఁఱఁగా
దోఁకను జుట్టి మోఁదె, బలు దుర్దములం దునుమాడె నందఱిన్.
403-క.
అందునఁ జావక మిగిలిన
కొందఱు పఱతెంచి, యసుర కొల్వున “మొఱ్ఱో
యందఱ మ్రింగెను, దానవు
లందఱకును వీఁడు దారుణాంతకుఁ
డగుచున్.”
404-వ.
అని విన్నవించిన రాక్షసేశ్వరుం డగు
రావణుండు మండిపడి, పింగళాక్షుని, దీర్ఘజిహ్వుని, నశ్మవక్షుని, శార్దూలముఖుని, వక్రనాసుని బనిచిన, వారును దమ తమ బలంబులం గూడికొని రథారూఢులై వచ్చి, యార్చుచుం దాఁకి, శస్త్రాస్త్రంబు
లడరించిన, నవియెల్ల లెక్కగొనక, యక్కరువలి కొడుకు దర్పంబునం బేర్చి, వాల మల్లార్చి, యెదిర్చిన బలంబును బలువిడిగాఁ
దోలి, పింగళాక్షుని ద్రుంచి, దీర్ఘ జిహ్వుని దీర్ఘనిద్ర పుచ్చి, వక్రనాసుని
బరాక్రమంబునం జూర్ణంబు సేసి, యశ్మవక్షుని భస్మంబుఁజేసి, శార్దూలముఖుని మర్దించి, నిర్వక్రమ పరాక్రమంబున
గర్వించి, మరలి మకరతోరణంబు నారోహించి, యార్చుచున్న సమయంబున,
405-క.
చావక మిగిలిన దైత్యులు
రావణు కడ కేఁగి వేగ రాహుత్తు
ల పా
ట్లా వాయుజు
సాహసమును
వే విధములఁ జెప్ప నతఁడు విస్మయపడుచున్.
406-మ.
కుటిలభ్రూకుటి దుర్నిరీక్షణములం గ్రోధానలజ్వాల
లు
త్కటమై పర్వఁగ, మంత్రి
సూనుల, మహా గర్వాంధులన్, గ్రూరులన్
బటు బాహాబలు రార్వురం
బనిచె, శుంభద్విక్రమాటోప మ
ర్కట పారీంద్రముమీఁద
నుద్దవిడి సంగ్రామంబు గావింపఁగన్.
407-వ.
ఇట్లు పనిచిన నా యార్వురును,
408-సీ.
శతకోటి విక్రమ ప్రతిమానుఁ డైనట్టి-శతజిహ్వుఁ
డత్యంత సాహసుండు,
రోషానలాభీల శేషాహి యైనట్టి-రుధిరాక్షుఁ డత్యుగ్ర రూప యుతుఁడు,
పర సైన్య కానన పావకుం డైనట్టి-రక్తరోముఁడు మహా రణబలుండు,
కఠినశాత్రవలోకగజసింహుఁ డైనట్టి-శూరదంష్ట్రుఁడు
లయకాలహరుఁడు,
వ్యాఘ్ర కబళుండు పృథుతరాహవ
జయుండు,
స్తనితహస్తుండు సాహసోదార బలుఁడు,
వీర లార్వురు నత్యుగ్ర వేషములను
రూఢి వెడలిరి ఘన రథారూఢు లగుచు.
409-క.
తమ తమ బిరుదులు నెఱపుచుఁ
దమకంబున వెడలి రధిక దలములు
గొలువన్
ఘుమఘుమ భేరీ రవ సం
భ్రమములతో మంత్రి సుతులు పావనిమీఁదన్.
410-వ.
ఇట్లు కదిసి సింహనాదంబు లంబరంబునం జెలంగ, గజ తురంగ శతాంగ సుభట
నికరంబుం గూడి శస్త్రాస్త్రంబులం బొదివిన.
411-తే.
వాల మల్లార్చి, బ్రహ్మాండ గోళమెల్ల
పగుల నార్చుచు, భుజయుగంబప్పళించి,
రణము చేయంగ మకరతోరణము డిగ్గి
మంతు కెక్కిన యా హనుమంతుఁ డంత.
412-సీ.
ఒక్కొక్క రథముతో నొక్కొక్క
రథమును-విటతాటనంబుగా విఱుగఁ గొట్టి,
యొక్కొక్క గజముతో నొక్కొక్క గజమును-జాఁపచుట్టగఁ
బట్టి చావఁ గొట్టి,
యొక్కొక్క హయముతో నొక్కొక్క హయమును-వాల ముఖంబునఁ గూలఁగొట్టి,
యొక్కొక్క భటునితో నొక్కొక్క సుభటుని-వడిఁ
ద్రిప్పి చెక్కలు వాఱఁ గొట్టి,
బాహుబల గర్వమునఁ బేర్చి, ప్రథన
సీమ
మంత్రి సూనుల నార్వుర మడియఁ గొట్టి,
మకరతోరణమున విక్రమమ్ము మెఱయ
భీకరాకారుఁడై యుండెఁ బెచ్చు పెరిఁగి.
413-క.
ఆ రణ వీథిని నిలువక
పాఱిన హతశేషు లెల్లఁ బర్విడి, రాజ
ద్వారమున
బొబ్బ లిడి, రా
ఘోరాజిని మంత్రి సుతులు కూలి
రటంచున్.
414-వ.
వారి పాటు విని రావణాసురుం డదరిపడి, యాజ్యాహుతిం
బ్రజ్వరిల్లు హుతాశనుం బోలి మండిపడి, ప్రహస్త తనూజుండగు జంబుమాలిం గని, నీ వా వానరాధముని
వధించి శీఘ్రమ్ము రమ్మని యనిపిన.
హనుమంతుఁడు జంబుమాలిని రూపుమాపుట
415-ఉ.
అప్పుడు జంబుమాలి భయదాకృతి, వీర రసాప్తిఁ గన్నులన్
నిప్పులు రాలఁ, బేరలుక నిండఁగఁ, నూర్పులు పర్వఁ, జిత్రమై
యొప్పుగరొప్పుచున్, రణమహోత్సుకుఁడై గజవాజిబృందముల్
విప్పుగ వెంట రాఁగఁ, గపివీరు నెదుర్కొని విక్రమంబునన్.
416-క.
అదలించి, వాయు నందనుఁ
బ్రదరంబుల సేయ, నంతఁ బవనజుఁ డలుకన్
గొదగొని బలముల నన్నిటిఁ
జదియంగా మోఁదెఁ నొక్క సాలముచేతన్.
417-ఆ.
రథము నుగ్గు సేసి, రథ
సారథిని జంపి,
రథ తురంగమములఁ బృథుల శక్తిఁ,
బట్టి, వాలమునను బడఁగొట్టి
చంపిన,
జంబుమాలి కినిసి సాహసమున.
418-క.
అడిదంబును గదయును గొని,
పుడమికి లంఘించి, వాయు పుత్త్రుని నిటలం
బెడపక వ్రేసిన, ధరణిం
బడి మూర్ఛ మునింగి, తెలిసి బలయుతుఁ
డగుచున్.
419-క.
ఆలంబున నాతని కర
వాలంబును ద్రుంచివైచి, వర
భుజ శక్తిన్
నేలం గూల్చెను, విక్రమ
శాలిన్, వడి జంబుమాలి, సాహసశీలిన్.
420-ఆ.
అంత జంబుమాలి, యత్యంత
బలశాలి,
గర్వ మెల్లఁ దూల, కలన వ్రాలి,
పొలిసె ననుట దైత్యపుంగవుఁ డాలించి,
యాత్మ సంచలింప నాగ్రహించి.
421-క.
సాహసము వెలయ సమరో
త్సాహంబున దుష్ట కపిని జంపు
మటంచున్
బాహు బలాఢ్యుని, నరి నిక
రాహవ సంహారు, వీరు, నక్ష కుమారున్.
422-వ.
అంపిన నతండు.
అక్షకుమార పవనకుమారుల భీకర సమరము
423-సీ.
చిత్ర మాణిక్య రంజిత
వేత్ర విభవంబు-భానుకోటిప్రభాభాసితంబు,
భీకర ధ్వజ దండ బిరుదాలవాలంబు-శస్త్రాస్త్ర పరికర సంయుతంబు,
బంధురాధికజవ బహు హయోపేతంబు-కుటిల దిక్పాల దృగ్గోచరంబు,
ఘన నభోమార్గ విఖ్యాతైక గమనంబు-వర తపోలబ్ధాతి వైభవంబు,
నైన రథ మెక్కి, మద
వారణౌఘ సుభట
వీర హుంకార ఝంకార వార ములియఁ
గదలె హనుమంతుపైకి నాగ్రహ మెసంగ
మదము దైవార నక్షకుమారుఁ డలుక.
టీక : దైవారు- అతిశయించు
424-క.
అటు చని పావనిఁ గని ది
క్తటములు సెదరంగ నార్చి, దందడి
భూభృ
త్తటముపయిఁ
గురియు వర్షో
త్కట ధారల రీతి, నంప ధారలు
గురిసెన్.
టీక : దందడి- తీవ్రము, అధికము, భూభృత్తటము- కొండచరియ
425-ఉ.
వాయుజుఁ డప్పు డంప గమి వాల
ముఖంబునఁ ద్రుంచెఁ, ద్రుంచినన్
వాయుజుమీఁదఁ గ్రమ్మఱ నవార్య
బలంబున నేసె, నేసినన్
వాయుజుఁడుగ్రుఁడై తునిమె వాని
శరావళి నెల్లఁ బిమ్మటన్,
వాయుజు నాట సేసెఁ గడు వాఁడి
శరంబుల నక్షుఁ డుద్ధతిన్.
426-వ.
ఇట్లేసిన,
427-ఉ.
తాల మహీజ రాజిని రథంబును గూలఁగ మోఁదె, మోదినన్
నేలఁ బదాతియై నిలిచినేర్పున వాఁడు శరాళి మారుతిన్
ఫాలము నొంచె, నొంచినను బావని మూర్ఛిలి తేఱి, దానవున్
దూలఁగ ముష్టిచేఁ బొడిచె దోర్బల
శక్తి రణాంగణంబునన్.
అక్షకుమారాదుల సంహారము
428-సీ.
పొడిచిన మూర్ఛిల్లి, వడిఁ దేఱి, దైత్యుండు-గదఁ గొని వైచె వక్షంబు
పగుల,
వైచిన మారుతి వడి వాని గదఁ బుచ్చు-కొని
వాని దేహంబు గుదియ నేసె,
నేసినఁ దన వీఁక నోసరింపక వాఁడు-గగనంబు కెగసె నా క్షణమునందె,
వాయు తనూజుండు వదలక తన వెంట-నెగసిన, గదఁ గొని యేసె
నతని,
నతఁడు గదఁ ద్రుంప, ఖడ్గాన నతుల శక్తి
వాఁడు మారుతి తొడలు నొవ్వంగ నడఁచె,
నంత సోలుచునా హనుమంతుఁ, డెగిరి
పట్టుకొని వాని ధాత్రిపైఁ గొట్టి చంపె.
429-తే.
అంత హతశేషు లగువార లరుగుదెంచి,
సంభ్రమంబున దానవ చక్రవర్తిఁ
గాంచి, కొలువెల్ల సందడి గాఁగ, నపుడు
బహు విధంబుల హనుమంతుఁ బ్రస్తుతించి,
430-సీ.
అక్షుండు తెగె, నశ్మవక్షుండు తెగటాఱె-రక్తరోముఁడు
నీల్గె రణములోన
స్తనితహస్తుఁడు మ్రగ్గె, శార్దూలముఖుఁడీల్గెఁ-గింకర
వర్గంబు గీటడంగె
శార్దూలకబళుండు సచ్చె, దుర్జయుఁ డేఁగె-శతమాయుఁ డొరిగెను, సమసె
వక్ర
నాసుండు, మఱి రక్తనాసుండుఁ గడతేఱె-శూలదంష్ట్రుఁడు
నేలఁ గూలిపోయె,
మడిసె యూపాక్షుఁ, డట
జంబుమాలి తునిఁగెఁ
బింగళాక్షుని పే రంత బిలము సొచ్చె,
వనము కావలి రాక్షస వర్గ మడఁగె
దీర్ఘజిహ్వుండు నేటితోఁ దీఱిపోయె.
టీక : ఆశ్మవక్షుడు- రాతినంటి
వక్షము కలవాడు, రక్తరోముడు- ఎఱ్ఱవెంట్రుకలవాడు, సతనితహస్తుడు- ఉఱుమువంటిచేయివాడు,
శార్దూలముఖుడు- పులిముఖమువాడు, శార్దూలకబళుడు. పులులు తినువాడు,
431-వ.
అని వేఱు వేఱ విన్నవించిన నసురేంద్రుఁడు
విని తన మనంబున.
432-మత్త.
వీని వానరుఁ డంచు నాత్మను విశ్వసింపఁగ జెల్ల, దీ
దానవావళి మ్రింగఁ బుట్టిన దయ్యమో? యటుగాక వై
శ్వానరుం డిటువంటి రూపున వచ్చి
నిల్చెనొ? కాక యీ
మేను గైకొని విష్ణుఁ డీడకు మేటియై చనుదెంచెనో?
టీక : వైశ్వానరుడు- అగ్నిదేవుడు
433-మత్త.
కాక యే వర మైన నా కఱకంఠుఁ డిచ్చిన నుబ్బి యా
నాక వల్లభుఁ డెల్ల కాలము నాకు నోడిన భీతిమై
లోక భీకర మైన రాక్షస లోక మెల్ల నడంపఁగా
నీ కరాళపు రూపు నిప్పుడ యీడ
కంపఁగ వచ్చెనో?
434-మత్త.
కాక తక్కినవార లెవ్వరు గర్వ సంపద మీఱఁగా
నాకు డీకొని ఢాకతోడ రణంబు సేయఁగ నోపరే
లోకమందిటు క్రోఁతు లెక్కడ లోఁచు
దానవ వీరులన్
జోక వీనికిఁ గల్గెనేనియుఁ జూఱ పుచ్చఁడె సర్వమున్.
టీక
: డాక- శౌర్యము, ఓచు- ఓర్చు, జోక- సహాయము,
చూఱపుచ్చు- కొల్లగొట్టు, ఆక్రమించు
435-వ.
అని యిట్లనేక ప్రకారంబులఁ జింతించి
యక్షకుమారుం దలంచి పలు దెఱంగులఁ బలవించుచున్న తండ్రిం గాంచి మేఘనాదుం డిట్లనియె.
ఇంద్రజిత్తు హనుమంతునిపై నెత్తివచ్చుట
436-క.
దేవతలతోడఁ గూడను
దేవేంద్రుని గెలిచినట్టి దేవర!
మీకు
న్నీ వగపేటికి
నేఁటికి
దేవా! చిత్తంబులోన దీనుని భంగిన్?
437-క.
వానరుని గొండచేసుక
పూనికఁ జింతింప నేల? భుజ
బల శక్తిన్
వానిం జంపెద నొండెను
దీనుని గావించి పట్టి తెచ్చెద
నొండెన్.
438-వ.
నావుడు రాక్షసేశ్వరుం డతని మాటలకు మనంబున
నలరి, నీవు విరించి వరదత్త ప్రతాప హుతాశనుండవు, చాప విద్యా ప్రవీణుండవు, తపోబల సమర్థుండవు, దేవేంద్ర గర్వ
విమర్దనుండవు, మత్సమాన శౌర్య చాతుర్య ధుర్యుండవు, గావున నీ కసాధ్యం బగు కార్యం బెద్దియును
లేదు. నీ విపుడ పోయి వాని సాధించి రమ్మని పంచిన,
439-సీ.
మాణిక్యతపనీయమయ విమానముతోడఁ-గెంబట్టుబిరుదు టెక్కెంబుతోడ
సరిచెప్పఁగారాని శస్త్రాస్త్రములతోడ-బలమైన
దివ్యచాపంబుతోడ
నాహవకోవిదుండైన సారథితోడ-ఘనసత్త్వజవ తురంగములతోడఁ
గనుపట్టి దిక్కుల గగనయానముతోడ-బాల సూర్యోదయ ప్రభలతోడఁ
గరము విలసిల్లు రథ మెక్కి, గంధ
నాగ
తురగ రథ భట వంది సందోహ పటహ
శంఖ కాహళ దుందుభి స్వనము లొలయ
మేఘనాదుండు హనుమంతుమీఁద వెడలె.
440-లగ్రా.
పెక్కులగు గుఱ్ఱములుఁ, జొక్కపు రథంబులును; నెక్కువగు నేనుఁగులుఁ, గ్రిక్కిఱిసి రాఁగా
రక్కసులు
సేరి యిరు ప్రక్కలును గొల్వఁ, గడు; నుక్కునను మీఱి చల మెక్కుడుగ నంతన్
గ్రక్కదల
భూతలము, చుక్క లొగి రాల, శిల; లుక్కసిలి, నాదములు పిక్కటిలి మ్రోయన్
డెక్కెముల
మించి, జవ మెక్కుడుగఁ జూపు దళ; మక్కజముగా
నుడువ దిక్కులు వడంకన్
441-వ.
ఇట్లు భయంకరాకారంబున వెడలి, కంఠ హుంకృతులును, భేరీ భాంకృతులును, నంబరంబునఁ జెలంగఁ, బొంగి చనుదెంచుచున్న
రాక్షస సైన్యంబుం గనుంగొని హనుమంతుఁడు తోరణ స్తంభంబుపై నుండి, బధిరీభూత దిగంతరంబుగా
భీకర గతి నార్చిన.
మేఘనాదుని భయంకర సమరము
442-క.
కలఁగినవి దేవ గణములు,
జలధులు ఘూర్ణిల్లె, గిరులు చలనం బొందెన్,
జలజాప్త చంద్రు లొదిగిరి,
జలధరములు పఱియ లగుచుఁ జదలం
బర్వెన్.
443-క.
అప్పుడు దానవ వీరులు
నిప్పులు వర్షించునట్టి నిశితాస్త్రములన్
గప్పిరి కెందొగ వానలఁ
గప్పిన శైలంబుఁ బోలఁ గపివరు
మీఁదన్.
444-తే.
అంప వర్షంబు తనమీదఁ జొంపములుగ
లీలఁ గురియంగ, నవి యెల్ల లెక్కఁగొనక
భువికి లంఘించి, యప్పు డద్భుతముగాఁగ
వాల మల్లార్చి యొక మహాసాల మెత్తి.
445-తే.
తేరు లన్నియుఁ గూరాటి తేరులుగను,
గుఱ్ఱముల నెల్లఁ గావేరి గుఱ్ఱములుగ,
నేనుఁగుల నెల్ల వెడరూపు టేనుఁగులుగ
దళము లన్నియు మఱి హరిదళము గాఁగ.
టీక : కూరాటి- కాచిన కలి, తరవాణి, తేరులు- తేర్చినవి,
కావేరిగుఱ్ఱము- బాగా పరిగెట్టే లేదా పారిపోయే గుఱ్ఱము, హరిదళము- అరిదళము, చిత్రగంధము,
446-వ.
ఇట్లు సమయింపం జూచి బలంబుపై కుఱికి,
447-సీ.
కరి యూథములమీఁదఁ గదిసి
మావంతుల-తోడఁ గూడఁగఁ బట్టి తునియఁ గొట్టి,
గుఱ్ఱంపుఁ బౌఁజులకును దాఁటి రౌతులఁ-గలయంగఁ
బట్టి చెక్కలుగఁ గొట్టి,
రథములపైకి నుగ్రంబుగా లంఘించి-రథికులతోఁ గూడఁ రసను గొట్టి,
బలములమీఁద నిబ్బరముగాఁ గుప్పించి-వాల ముఖంబునఁ దూలఁ గొట్టి,
పటహ నిస్సాణ కాహళ పటిమ
లురియఁ
ద్రొక్కి శస్త్రాస్త్ర
నిచయముల్ తుమురు చేసి,
ఛత్రములఁ ద్రుంచి పడగల సత్త్వ మణఁచి
పవన సూనుండు సాహస ప్రౌఢి మెఱసె.
448-వ.
అట్టి సమయంబున,
449-చ.
అనలము రీతి మండి దివిజారి
తనూజుఁడు తేరు దోలి, య
య్యనిల తనూజు నేసె వివిధాయుధ
పంక్తుల, వాని నెల్లఁ దు
త్తునియలు సేసె వాయుజుఁడు, దోర్బల
శక్తిని దైత్యుఁడేయఁ, దోఁ
కను దునుమాడె వాని విశిఖంబుల నన్నిటి వాయు సూనుఁడున్.
450-క.
గిరులను బావని రువ్వుచు
దరువుల నేయంగఁ, గినిసి దానవుఁ డంతన్
దురమున నడుమనె త్రుంచెను
శరజాలముచేత నొక్క క్షణమున
వానిన్.
451-తే.
గంధవహుపుత్త్రుఁ డప్పు డాగ్రహముతోడ
రధముఁ గూలంగఁ దన్ని సారథినిఁ జంపి
గుఱ్ఱములఁ జంపి, కేతువుఁ గూల
నడవ,
మేఘనాదుండు కినిసి సమీరసుతుని.
452-వ.
అహంకారంబునఁ బ్రతిఘటించి,
453-క.
వాయవ్యాస్త్రము నంతట
వాయుజు మీఁదికి నతండు వడి
నేసిన, నా
వాయవ్యాస్త్రముఁ దూలెను
వాయుజునిం జంప నోడి వారని
కరుణన్.
454-వ.
అది వృథ యగుటం గని మఱియును,
455-క.
రౌద్రం బడరఁగ నేసెను
రుద్రాస్త్రం బతనిమీఁద రూఢిగ
నతఁ డా
రుద్రుని యంశం బగుటను,
రౌద్రాస్త్రము దేలిపోయె రభసం
బొప్పన్.
456-వ.
అమ్మహాస్త్రంబు గూడఁ దప్పిపోవుట
కాశ్చర్యంబు నొంది యింద్రజిత్తు మఱియును.
బ్రహ్మాస్త్రమునకు గట్టువడిన హనుమంతుఁడు
457-క.
సుర ఖచర యక్ష కిన్నర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ
గణం
బరుదంది చూడఁగా ని
ర్భర ముష్టిం దొడిగి యేసె బ్రహ్మాస్త్రంబున్.
458-వ.
అట్టి యవసరమున.
459-క.
సప్తాంభోధులు కలఁగెను,
సప్తద్వీపములు వణఁకె, శైలము
లదరెన్,
సప్తానిలములు దలఁకెను,
సప్తాశ్వుఁడు మ్రానుపడియె, జగములు
గదలెన్.
460-వ.
ఇట్లనేక ప్రకారంబులఁ గాలాగ్ని తెఱంగున
వెడలి, మిడుంగుఱులు చెదరి పడఁగ, బ్రహ్మాండమండలంబులం బట్టుకొనునట్టు పెనుమంట
లుప్పరంబెగయ, నేతెంచు బ్రహ్మాస్త్రముం గని హనుమంతుఁడు తన మనంబున,
461-ఆ.
తనకుఁ జిన్ననాఁడు దయచేసినటువంటి
వనజ భవునిచేతి వరముఁ దలఁచి,
బ్రహ్మ మంత్ర మప్డు పఠియింప, నది చంప
కతనిఁ గట్టి వైచె నవనిమీఁద.
462-వ.
ఇట్లు కట్టుపడిన కరువలి పట్టిని జూచి, రావణాసురుని పట్టి
తనలో నిట్టు లనుకొనియె,
463-క.
ఈ బమ్మాస్త్రము తాఁకున
కే బలియుఁడు బ్రదుక నోపఁ, డితఁడు
ఘనుండౌ,
నీ బాహుబలుని గట్టుట
నా బలిమికిఁ దొడవ కాదె నాకులు
మెచ్చన్!
464-క.
పెక్కండ్ర దనుజ వీరులఁ
జక్కాడిన వీనిఁ బట్టి, సాహసముగ
మా
రక్కసుల ఱేని యొద్దకుఁ
జక్కఁగఁ గొనిపోవు టదియ చంపుట
గాదే!
465-చ.
అని తన సత్త్వ సంపద రయంబునఁ బొంగుచు మేఘనాదుఁడ
య్యనిలజుఁ గొంచు నేఁగె దివిజారి
సభాస్థలి కద్భుతంబుగా,
ఘన రథ దంతి ఘోటక నికాయ భటావళి శస్త్ర దీప్తకే
తన వర శంఖ కాహళ వితాన రవంబులు మిన్ను ముట్టఁగన్.
466-వ.
ఇట్లు కొనిపోయి రాక్షసేశ్వరుం డయిన
రావణాసురు సమ్ముఖమ్మునం బెట్టినంతనే గాడుపుపట్టిం గని.
టీక : గాడుపుపట్టి- హనుమంతుడు
హనుమంతునిచే రావణుని యధిక్షేపము
467-క.
కుటిలభ్రూకుటి నటన
స్ఫుట ధూమ విలాస పవన ఫూకృతి జనితో
ద్భట రోషానల కీలో
త్కట నేత్రుం డగుచుఁ
బలికెఁ గటము లదురఁగన్.
468-ఉ.
“ఎవ్వఁడ వోరి? నీకుఁ బ్రభు వెవ్వఁడు చెప్పుము? నీ
విటొంటిమై
నివ్వనరాశి దాఁటి యిట కే గతి వచ్చితి? నామ మేమి? నీ
వెవ్వని ప్రాపునం బెఱికితీ వనమంతయు శంక లేక? యిం
కెవ్వని పంపునం దునిమితీ సురవైరుల నెల్ల నుగ్రతన్?
469-సీ.
అమరవల్లభు భోగ మంతయుఁ గైకొని-వీతిహోత్రుని సిరి నీటముంచి,
జముని కింకరులను సంహారమొనరించి-రాక్షసాధీశ్వరు శిక్షసేసి,
యంభోధినాథుని గాంభీర్య మణఁగించి-దోర్బలంబున
గాలిఁ దూలబట్టి,
విత్తనాథుని మహా విభవంబు గొల్లాడి-శూలహస్తుని
నొక్క మూల కదిమి,
అమర గంధర్వ కిన్నర యక్ష
భుజగ
గరుడ గుహ్యక ముని సిద్ధ వరుల నెల్లఁ
బట్టి మును వెట్టి సేయించునట్టి నన్ను
విన్నయంతన గుండెలు వ్రీల వెట్లు?
470-చ.
శరనిధి దాఁటి
వచ్చుటయ చాలక నా పురిఁ జొచ్చి, చొచ్చియున్
వెఱవక బంటవై వనము వేళ్ళకుఁ ద్రుంచితి, త్రుంచి క్రమ్మఱన్
బిరుదవు పోలె రాక్షసులఁ బెక్కురఁ జంపితి, చంపి నెమ్మదిన్
గరకరితోడ నా యెదుర గర్వముతోడన నిల్చి తద్దిరా!
471-క.
ఖండించెద నీ చేతులు,
తుండించెద నడుము రెండు తునుకలు
గాఁగన్,
జెండించెదఁ
గత్తులతో,
వండించెద నూనెలోన వారక నిన్నున్.”
472-వ.
ఇట్లు పట్టరాని కోపంబున నాటోపంబుగాఁ
బలుకుచున్న రావణాసురుం జీరికిం గొనక హనుమంతుం డిట్లనియె.
హనుమంతునిచే శ్రీరామచంద్రుని గుణ కీర్తనము
473-క.
“ఇనతనయుని వర మంత్రిని,
జనపతి యైనట్టి రామచంద్రుని
దూతన్,
ఘనుఁడగు వాయు కుమారుఁడ,
వినుమీ హనుమంతుఁ డనఁగ వెలసినవాఁడన్.
474-క.
రాముని పంపున వచ్చితి,
రాముని సేమంబు నీ పురంబున
నున్నా
రాముని సతి కెఱిఁగించితి,
రాముని కడ కేఁగుచుండి రాజస
వృత్తిన్.
475-క.
నా రాక మీకుఁ దెలియఁగ
బీరంబున వనము గలయఁ బెఱికితి శక్తిన్,
ఘోరాజి నాకు నెదిరిన
వారలఁ బంపితిని యముని పట్నము
చూడన్.
476-క.
నినుఁ జూచి తిరిగి పోయెడు
మనమున మఱి కట్టఁబడితి మనుజాశన!
నీ
యను వెల్లఁ గంటి, నింకను
వినుమా నా బుద్ధిఁ దెలియ వివరముతోడన్.
477-చ.
ఘనుఁడవు, నీతిమంతుఁడవు, కార్య మెఱుంగుదు, సాహసంబునన్
నిను నెదిరించి పోరుటకు నిర్జర వల్లభుఁ డోపలేఁడు, నీ
వనిన జగత్త్రయం బళుకు, నద్భుత
రూపము సెప్పరాదు, నీ
యనుపమ భోగ సంపదల కాఱడి తెచ్చితి విప్డు రావణా!
టీక : ఆఱడి- ఇక్కట్టు, అక్కర
478-క.
కడ లేని బలము, ధర నె
క్కడ లేని మహా ధనంబు కరి తురఁగంబుల్,
కడ గానరాని సంపద,
చెడ కుండఁగ నీకు బుద్ధి చెప్పెద వినుమా!
479-సీ.
కుదియించి సింహంబు కోరలు
పెఱుకంగ-శేషాహి దౌడలు చీల్చివేయఁ,
బీడించి దంభోళిఁ బిడికిటఁ బట్టంగఁ-గఠిన
కాకోలంబు కడి గొనంగఁ,
జెలఁగి బ్రహ్మాండమ్ము చిప్ప లూడఁగఁ దన్న-హంకారమున
బడబాగ్ని నుఱుక,
నంభో నిధానంబు లఱచేత నడవంగ-గిరి వర్గములఁ దలక్రిందు చేయఁ,
గల మహాబాహుసత్త్వ విఖ్యాతి
విపుల
చండ భుజదండ సాహసోద్దండ విజయ
కాల రుద్రావతార సంగ్రామ భీమ
మూర్తి మంతులు కపులు, సత్కీర్తియుతులు.
480-వ.
అదియునుంగాక దశరథరాజ నందనుండును, గౌసల్యా గర్భ
సంభవుండును, దాటకా ప్రాణాపహరుండును, విశ్వామిత్ర యాగ సంరక్షకుండును, నహల్యా శాప మోక్ష
దీక్షా గురుండును, హర కోదండ ఖండనుండును, జామదగ్ని బాహుబల భంగుండును, విరాధ నిరోధుండును, ఖర దూషణ త్రిశిర
శ్ఛేదనుండును, మాయామృగ సంచారి మారీచ సంహారకుండును, గబంధాంతకుండును, వాలి ప్రాణ నిబర్హణుండును, సుగ్రీవ రాజ్య సంస్థాపన
పరమాచార్యుండును, ధనుర్విద్యా ప్రవీణుండును, నమోఘ బాణుండును, రాక్షస కులాంతకుండును, గాకుత్స్థాన్వయాంభోనిధి
చంద్రుండును, గరుణాసింధుండును, నగు శ్రీరామచంద్రుండు కరుణాలంకారుఁడు గావున,
481-ఉ.
వారక సీత నిచ్చి, రఘువల్లభునిన్ శరణంబు చొచ్చినన్,
నేరము లెంచి చంపమికి నీ యెడ కెప్పుడు నేను
బూఁటగా
భారపడంగఁ జాలుదు, శుభస్థితి నమ్ముము, నమ్మ
కూరకే
పోరఁగఁ జూచితేనిఁ, బొరిపుచ్చక మానఁడు నిన్ను రావణా!”
482-ఉ.
నావుడు మండి, దైత్యకుల నాయకుఁ డుగ్ర విలోకనంబులం
బావక విస్ఫులింగములు పైకొని
పాఱఁగ, వీర ఘోర దై
త్యావళిఁ జూచి, “మీరలు
మహా విశిఖంబుల వీనిఁ
జంపుఁడీ
యావల రాముఁ డుల్కుచు భయాకులుఁడై
చెడిపోవు నట్టుగన్.”
483-వ.
అనిన విభీషణుం డిట్లనియె.
దూతను జంపుట దోసమని రావణునకు విభీషణుని
హితవు
484-క.
“దూతపనిఁ బూని వచ్చిన
దూతలు తమ నోరి కెంత తోఁచిన
నట్లా
నేతల నాడుదు, రాడిన
దూతలఁ జంపంగఁ దగదు దొరలకు
నెందున్.
485-క.
కాకుండిన మీ చిత్తము
కాకెల్లను దీఱ ముజ్జగంబులు
బెదరన్
ఢాక నడలించి తోకను,
వీఁకన్ ముట్టించి పోవ విడుచుట చాలున్.”
టీక : డాకన్-
అతిశయంగా, అడలించి- గద్దించి, అడలగొట్టి
486-వ.
అని విన్నవించిన.
487-ఆ.
నీతి వాక్య సరణి నెఱయంగ విని రావ
ణేశ్వరుండు కోప మెడలి పలికె
వీనిఁ దోఁక గాల్చి, వెడలంగఁ ద్రోయుఁ డీ
ప్రొద్దె యటకుఁ దిరిగి పోవుఁ గాక.
488-వ.
అని యిట్లానతిచ్చిన విని, రాత్రించరు లతనిని సభా
మధ్యంబునుండి బయటికి వెడలం గొనిపోయి యొక్కచోట.
వాలాగ్రజ్వాలలతో వాయుసుతుఁడు లంకను దగులఁ బెట్టుట
489-ఉ.
వాలము నిండఁ గోకలు జవంబున
గట్టిగఁ జుట్టి, వాని పైఁ
దైలము చక్కఁ జల్లి, పిఱుఁదం జని పౌరులు సూడఁ, బావక
జ్వాలఁ దగిల్చి, బొబ్బలిడి, వాడల వాడలఁ ద్రిప్పుచుండ, వా
తూల భవుండు దానికిని దూలక వహ్ని జపంబు సేయఁగన్.
490-ఆ.
అగ్నిదేవుఁ డప్పు డాత్మలోఁ
జింతించి
“హితుఁడు నాకు, లోక హితుఁడు పవనుఁ,
డతని పుత్త్రుఁ డైన హనుమంతునకు నేను
చలువ కూర్తు” ననుచుఁ జల్ల
నయ్యె
491-వ.
అప్పుడచ్చటి వృత్తాంతం బంతయుఁ, దనకుఁ గావలి యున్న
రాక్షసకాంతలవలన విని, చింతాభరాక్రాంతయై, జనకరాజ నందన కరంబు శోకించి, కరంబులు ముకుళించి “జగద్ధిత కార్య
ధుర్యుండును, రాఘవ ప్రియానుచరుండును, మత్ప్రాణ బంధుండును, జగత్ప్రాణ నందనుండును నైన హనుమంతునకు
శీతలుండవు క” మ్మని యగ్ని దేవునకు నమస్కరించి, యగ్ని మంత్రంబును, బ్రహ్మ మంత్రంబును
నుచ్చరించిన, నద్దానివలన వానికి వైశ్వానర భగవానుండు సల్లనయ్యె. బ్రహ్మాస్త్ర బంధనంబును
నూడె నట్టి సమయంబున.
492-సీ.
కొలువు కూటములకుఁ గుప్పించి, గజ వాజి-శాలల మీఁదికిఁ జౌకళించి,
భండార గృహముల పైకిని లంఘించి-మెఱుఁగారు మేడలమీఁది కుఱికి,
చప్పరంబులమీఁది కుప్పరంబున దాఁటి-యంతఃపురమునకు గంతువైచి,
చవికలమీఁదను సాహసంబున వ్రాలి-గరిడికూటంబుల సొరిది నెక్కి,
వాడ వాడల వీథుల వన్నె మెఱసి
హరుఁడు త్రిపురంబు గాల్చిన యట్టి లీల,
నొక్క గృహమైన లెక్కకు దక్క నీక
దానవేశ్వర పురము దగ్ధంబు చేసె.
టీక : చౌకళించు- ఉరుకు, చప్పరము- పందిరి, ఉప్పరంబున- మీదుగా, చవిక- చావడి,
రచ్చ, గరడీకూటము- శస్త్రాభ్యాసమండపము
493-శా.
అంభోరాశిని వాలవహ్ని నతిశౌర్యం బొప్పఁ చల్లార్చి, య
య్యంభోజానన సీతఁ గాంచి, తన
వృత్తాంతంబు తెల్లంబుగా
గంభీరధ్వని విన్నవింపుచు నమస్కారంబు
గావించి, సం
రంభం బొప్పఁగ వేడ్కతోఁ
గదలె ధీరప్రౌఢి హన్మంతుఁడున్.
మారుతి పిడికిటిపోటుతో యమపురి కరిగిన
లంకిణి
494-క.
పోయెడు వాయుజు “నెక్కడఁ
బోయెదు నాచేత” ననుచుఁ బోనీక వడిన్
డాయఁగ వచ్చిన లంకిణి
కాయము వగులంగఁ బొడిచెఁ గడు
వడిఁ గినుకన్.
495-వ.
ఇట్లు లంకిణిం జంపి, సువేలాచలం బెక్కి, సింహనాదంబు సేయుచు,
496-క.
పుడమీధరశృంగంబున
నడుగులు వడి నూఁది త్రొక్కి, యద్భుత
శక్తిన్
జలరాశి దాఁటఁ బావని
మిడివింటం బసిఁడి యుండ మీఁటిన
రీతిన్.
టీక : మీటు- విసురు
497-వ.
ఇట్లు కుప్పించి, యుప్పరం బెగసి, వాయు వేగంబునం జనుచు నయ్యబ్ధి మధ్యంబున
నున్న సునాభం బను శైలంబునఁ దన దేహంబు దాహంబుఁ దీర్చుకొని, సముద్రంబును దాఁటి, యవ్వలికిం జనియె
నప్పుడు.
దధివనమున వానర వీరుల యుత్సాహ క్రీడ
498-ఉ.
వచ్చిన పావనిం గని, జవంబున నంగదుఁ డాదియౌ కపుల్
గ్రచ్చఱ భక్తితో నెదురుగాఁ జన, నందఱఁ గౌఁగిలించి, వా
రచ్చటి కార్యమంతయుఁ బ్రియంబునఁ దన్నడుగంగఁ, బోయి వే
వచ్చిన చంద మేర్పడఁగ వారికిఁ జెప్పెను దప్పకుండఁగన్.
499-క.
రఘువరుఁ డిచ్చిన ముద్రిక
రఘువల్లభు దేవి కిచ్చి, రభసంబున
నా
రఘువరున కానవాలుగ
రఘువల్లభు దేవిచేతి రత్నముఁ
గొంటిన్.
500-మ.
అని చెప్పన్ విని, యంగదాదులు మహాహ్లాదంబునన్ బొంగి, పా
వని బాహాబల సత్త్వముల్
వొగడుచున్, వర్ణింపుచున్, వే పునః
పునరాలింగన మాచరింపుచు, వడిన్ భూషించుచున్ మ్రొక్కుచున్,
ఘనతం బాడుచు నాడుచున్, బలువిడిన్ గర్వంబునన్ దాఁటుచున్.
501-శా.
నేనే చాలుదు రావణాసురు
తలల్ నేలం బడంగొట్టఁగా,
నేనే చాలుదు వాని పట్టణము
మున్నీటం బడం ద్రోయఁగా,
నేనే చాలుదు దుష్ట దానవ
తతిన్ నిర్భీతి దండింపఁగా,
నేనే చాలుదు నంచుఁ బంతములు
పూన్కిం బల్కుచున్
ద్రుళ్ళుచున్.
502-క.
ఆ రాత్రి కీశు లందఱు
మారుతితోఁ గూడి నిలిచి, మఱునాఁడచటన్
ధీరత దుర్ధర శైలము
చేరం జని, నిద్రచేసి చిత్తము
లలరన్.
503-వ.
అమ్మఱునాఁ డుదయంబున మధువనంబులోఁ
బ్రవేశింప నుద్యోగించి, యందఱకన్నను బెద్దవాఁడగు జాంబవంతునిం బిలిచి, నీవు శ్రీరామునకు
హితుండవు, సుగ్రీవునకు మంత్రివి, కావున మాకు నొక బుద్ధి యానతిమ్ము. ఈ కపులు
క్షుద్బాధావశంబునం బొరలి, మహాశ్రమంబును బొందియున్నవారు, గావున సుగ్రీవుని మధువనంబున నుండెడు
ఫలంబులం బరితృప్తులమై, రాముని సన్నిధానంబున కేఁగుట లెస్స యని యంగద హనూమంతులు పల్క జాంబవంతుండును
నత్యుత్సాహంబున నంగీకరించి, కపులం బురస్కరించుకొని, మధువనంబులో బ్రవేశించినంత.
504-సీ.
ఒక్కఁ డాఁకొని కొమ్మ నూఁచినఁ
బండ్లెల్లఁ-జేకొని తేర భక్షించు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని రేఁపు చున్నట్టి తేనియల్-తడయక
కొల్లడిత్రాగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని కోయుచున్నట్టి కాయలు-మిన్నక
యూటాడి మ్రింగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని గోళ్ళ నొలిచినట్టి చివుళ్ళఁ-బుక్కిళ్ళ
కొలఁదిగా బొక్కు నొకఁడు,
తరువుపై నుండి తరువుపై దాఁటు నొకఁడు
పండ్ల కెటువంటి మ్రాఁకైన బ్రాకు నొకఁడు,
దిగువఁ గూర్చుండి తరువున కెగురు నొకఁడు
పెద్ద పొడవున నుండి కుప్పించు నొకఁడు.
505-ఉ.
కాయల వ్రేటు లాడుచును, గంతులు
వైచుచుఁ, బూవు దీవలం
దూయల లూగుచున్, దరువు లూఁపుచుఁ, బండ్లను బొట్టనిండఁగా
మేయుచు, వెక్కిరింపుచును, మిన్నక దాఁటుచు, దోఁక
లెత్తుచుం
గూయుచు, నేల దూఁకుచును, గుంపులు గూడి కపీంద్రులెంతయున్.
506-క.
వన మెల్ల గాసి చేయఁగ
వనపాలకు లేఁగుదెంచి, వడిఁ
గోపముతో
డను నదలించిన, వారల
హనుమంతుఁడు మొదలుగాఁగ నగచరులెల్లన్,
507-క.
మెడఁబట్టి వనములోపల
వెడలఁగ నటు పాఱఁ ద్రొబ్బి, వెడలుం
డన్నన్
దడయక దధిముఖుఁ డను తమ
యొడయని కడ కేఁగి వార లుగ్రముగాఁగన్.
508-వ.
విన్నవించిన యంతనే.
అంగదాదులచే దధిముఖ పరాభవము
509-చ.
దధిముఖుఁ డల్గి మండిపడి, తాఁ దనవారలఁ గూడి వచ్చి, బల్
విధముల సంచరించు కపి వీరులఁ
గోపముతోఁడ జూచి, యీ
మధువన మెల్లఁ గొల్లగొన మర్కట
వల్లభు నాజ్ఞఁ ద్రోయ, మ
మ్మధములఁ జేయ, నెంత
ఘనులంచును బాఱఁగ వారి నుద్ధతిన్.
510-వ.
ఇట్లు దండింపుచున్న దధిముఖునిపై నంగదాది
వనచరులు గదిసి యాగ్రహంబున,
511-క.
కొందఱఁ గఱిచియుఁ బొడిచియుఁ,
గొందఱఁ దలపట్టి యీడ్చి కొట్టియు, గోళ్ళన్
గొందఱ వ్రచ్చియుఁ
దన్నియు,
నందఱ నొప్పింప వార లాగ్రహ
వృత్తిన్.
512-క.
వ్రయ్యలు వాఱఁగ వ్రచ్చినఁ
గ్రయ్యఁగ రక్తములు గ్రమ్మఁగా వడితోడన్
గుయ్యో మొఱ్ఱో యని వా
రయ్యెడ సుగ్రీవు కడకు నరిగిరి
భీతిన్.
513-వ.
అరిగి, రామ లక్ష్మణులం గూడియున్న మిహిరనందనుం
గనుంగొని, నమస్కరించి, మధువనంబునందు జరిగిన వృత్తాంతం బంతయు విన్నవించిన, వారల నాదరించి సుగ్రీవుం డిట్లనియె.
సుగ్రీవాజ్ఞచేఁ గిష్కింధకు వానర వీరుల
పునరాగమనము
514-క.
“దేవర పంపునఁ జని, వా
రే వెరవున సీతఁ గనిరొ, యిటు గాకున్నన్
నా వనము పాడుసేయరు
పావని మొదలైనవారు భయ విరహితులై.“
515-వ.
అని రామ భూపాలుండు విన సుగ్రీవుండు వారల
నూరార్చి, వారి దుండగంబులు వారికే యుండుంగాని వారలం దోడ్కొని యతివేగమ రండని యనిపినం
జని, యంగద హనుమంతులం గని, “యవనీశ్వరుం డీక్షణంబున మిమ్మందఱ నచ్చటికి రండని
యానతిచ్చెం గావునఁ జెచ్చెరఁ బదుం” డని, తోడ్కొని పోవునప్పుడు వారల కెదురుగా వానర వీరులఁ
గొందఱ ననిపిన, వారలం గూడి చనుదెంచి, శ్రీరామచంద్రుని పాదారవిందమ్ములకు సాష్టాంగ దండ
ప్రణామమ్ము లాచరించి, సౌమిత్రికిని వందనమ్ము లొనరించి, సుగ్రీవునకు నమస్కరించి, తనచేత మేలు వార్త విన
నుత్సహింపుచున్న రఘుకులేశ్వరుల తలం పెఱింగి హనుమంతుం డిట్లనియె,
516-శా.
“కంటిన్ జానకిఁ, బూర్ణ చంద్ర వదనన్, గల్యాణి నా లంకలోఁ,
గంటిన్ మీ పదపంకజాతము మదిన్ గౌతూహలం బొప్పఁగాఁ,
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగాఁ, గీర్తులం
గంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్య వారాన్నిధీ.
517-సీ.
కట్టిన వస్త్రంబు కట్టు కొంగే తప్ప-జీర్ణించి పోయిన చీరతోడ,
నుడుగని వగలచే నోరంత ప్రొద్దును-జెక్కింటఁ జేర్చిన చేయితోడఁ
బుడమిపైఁ బొరలాడు నొడలు బూడిద బ్రుంగి-నిరతంబు దొరఁగు కన్నీటితోడ,
నిడుద పెన్నెఱివేణి సడలించి జడలతోఁ-నిరత నిరాహార నియతితోడఁ
గినుక జంకించు దైత్య కామినుల
నడుమఁ
దపముఁ జేయుచు దనుజ బాధలకు నోర్చి,
వనిత ప్రాణంబు దక్క సర్వముఁ ద్యజించి
నిత్యమును మిమ్ము మదిలోన నిల్పియుండు.
518-క.
జానకిఁ బొడగనియును, మీ
రానతి నా కిచ్చి పంపినట్టి
విధంబున్,
నే నాయమ కెఱిఁగించియు,
జానకి రత్నంబుఁ గొంచుఁ జనుదేఁ
గంటిన్.”
సీతా శిరోరత్నమును గాంచి శ్రీరాముఁడు
దురపిల్లుట
519-వ.
ఇవ్విధంబున సీత చిహ్నంబులు రామచంద్రునకుం
జెప్పి, దండప్రమాణంబు లాచరించి, తనకు సీతా మహాదేవి దయచేసిన శిరోరత్నంబు శ్రీరామచంద్రునకు
సమర్పించినం జూచి, యది యక్కునం జేర్చి, యానంద బాష్పంబులు గ్రమ్ముదేర మూర్ఛిల్లి, తెప్పిఱిల్లి, “హా! వామలోచన! హా!
పద్మగంథి! హా! సీత! హా! సీతా!” యనుచు శోకించి సుగ్రీవుం జూచి, మనము లంకా ప్రయాణముఁ
జేయఁబోవుదము, గాన నిఁక సేనలం గూర్చు మని యానతిచ్చిన వానరేశ్వరుండు మహాప్రసాదం బని యంగద
హనుమ జ్జాంబవత్సుషేణ పనస నల నీల గజ గవాక్ష గోముఖాదు లగు సేనానాయకుల నఱువదికోట్ల
నియోగించిన, వారును నొక్కొక్కరు నూఱేసి కోట్ల బలంబులతోడ రామచంద్రుని కిరువంకల నాడుచుఁ
బాడుచు మాల్యవంతంబు వెడలి” రన విని నారదుని వాల్మీకి మహామునీశ్వరుం “డటమీఁది వృత్తాంతం
బెట్టి” దని యడుగుటయును.
ఆశ్వాసాంత పద్య గద్యములు
520-క.
జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత!
సుధా
జలరాశి భవ్య మందిర!
జలజాకర చారు హంస! జానకి
నాథా!
521-గ.
ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధ
గురుజంగమార్చన వినోద సూరిజన వినుత కవితాచమత్కా రాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల
నామధేయ విరచితంబైన శ్రీరామాయణ మహా కావ్యంబునందు సుందర కాండము సర్వము నేకాశ్వాసము.
~X~
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి