శ్రీరామ
పూర్వం పీఠిక
ఆదికవి రచించిన రామాయణాన్ని ఎన్నో భాషలలో ఎందరో మహనీయులు పునఃపునః అనువాదాలు, అనుసృజనలు చేసారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు. అవును తెలుగులో ఐతే భాస్కర మొల్ల రామాయణలతో మొదలు ఎన్ని రామాయణాలో లెక్క చెప్పలేము. ఎవరి భక్తి వారిది, ఎవరి ప్రత్యేకత వారిది. కులమతాలుకానీ వయోలింగ భాదాలు కాని అడ్డు కాదు. ఆ కోవకు చెందిన పరమ భక్తురాలు, ప్రథమాంధ్ర మహిళా కవయిత్రి ఆత్మకూరు మొల్ల. తన కావ్యారంభంలో “నా రాజు దైవం ఐన ఆ శ్రీరాముని చరితం భక్తికి ముక్తికి మూలమైనది కదా, ఎంతమంది ఎన్ని మార్లు వర్ణింస్తేనేం, నేను నుతిస్తే తప్పేముంది” అంటుంది.
మొల్ల పేరు చెప్పగానే మొల్లరామాయణం గుర్తుకు స్పురిస్తుంది. మొల్ల అంటే మల్లెపువ్వు. ఆ పేరులాగనే ఆమె రామాయణ సౌందర్య సొరభం నలుదుశలా గుబాళిస్తూంది. “మొల్ల రామాయణము” లో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, “కంద రామాయణము” అనడం కూడా కలదు.
16వ శతాబ్దికి చెందిన ఈ కవయిత్రీ శిరోమణి పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో నివసించింది. ఆమె ఒక కుమ్మరి కుమార్తె. మొల్ల తండ్రి కేసన, గురులింగ జంగమార్చనపరుడు. గొప్ప శివభక్తుడు. రామాయణం వంటి ఉద్గ్రంథం రచించిన మహా కవయిత్రి మొల్ల “తాను సంప్రదాయ విద్యను అభ్యసించలేదు అని. తన సహజ పాండిత్యానికి శ్రీకంఠమల్లేశ్వరుడే కారణ” మని వినయంగా ప్రకటించింది. “రాముడు చెప్పమన్నాడు, చెప్పించాడు. వారి పలుకుమీద రామాయణ రచనకు పూనుకున్నా” నని వివరించినది. ఇతర కవులు వలె ధనము, కీర్తిని ఆశించక ఏ రాజులకు అంకిత మివ్వలేదు. వ్రాసిన రామాయణం సంక్షిప్త రూపమైనా, వాసిలో గణించదగ్గది. సర్వజనాదరణ పొందినది. ఈమె మృదువైన పలుకులతో, దేశీయమైన పలుకుబడులతో సరళ గంభీర సరళితో సాగిన ఆమె కవిత్వతత్వం చూస్తే విదూషామణి అని అర్థ మవుతుంది.
కొందఱు విశిష్ఠ వ్యక్తుల తత్వాలలో చక్కటి సామ్యం ఉంటుంది, ఇక్కడ కుల వయో లింగ భేదాలు ఉండవు. ఉదాహరణకు పోతన, మొల్లల విషయం చూద్దాం. శ్రీమద్భాగవత ప్రణీతం చేసిన మహనీయుడు బమ్మెఱ పోతనామాత్యులవారు సహజకవి అని ప్రఖ్యాతి పొందాడు. మొల్ల తనది సహజపాండిత్యం అని ప్రకటించుకుంది; ఇద్దరూ మంచి శివారాధన కుటుంబాలలోంచి వచ్చారు. ఇద్దరూ శ్రీరామభద్రుల వారు చెప్పుటచే చేపట్టారు. ఇద్దరూ ధనకీర్తులను ఆశించ లేదు. రాజులకు అంకితమివ్వలేదు. ఇద్ధరూ ప్రధానంగా భక్తి, శృంగార రసపోషణ చేసారు.
కవిత్వం “తేనెసోక నోరు తీయన యగురీతి”గా వీనుల విందుగా ఉండాలని అంటుంది మొల్ల. అంత మధురంగానూ తేటతెలుగులో రసరమ్య రామాయణం వ్రాసి వాసికెక్కింది. అలంకారాలు, రసపోషణ, ప్రబంధ లక్షణాలు అన్ని చక్కగా పాటించింది. శ్రీరాముణ్ణి అడవులకు పంపే సందర్భంలో దశరథుని దుఃఖాన్ని అద్భుతంగా వర్ణించింది. సీతాదేవి ముగ్ధత్వాన్ని, పాతివ్రత్యాన్ని విశిష్ఠంగా చిత్రీకరించింది. నదిని దాటించే ముందు గుహుడు రాముని పాదాలు కడగడం హృద్యంగా వివరించింది. భక్తి, కరుణ రసాలను బహు చక్కగా వర్ణించింది. శృంగార రస ఒలికించడంలో నేర్పు చూపించింది. యుద్ధఘట్టాలలో రౌద్ర వీర రసాలను చాకచక్యంగా పోషించింది.
ఆత్మకూరి మొల్ల ప్రథమాంధ్ర కవయిత్రి కమ్మని జనరంజకమైన కవిత్వంతో, సామాన్యులకు సైతం రామాయణ అర్థం కావాలని తేటతెలుగులో చక్కటి సామెతలు వంటివాటితో రచించింది. తాను ధన్యురాలైంది. జనులకు ధన్యమైన మార్గం అందించింది. తెలుగు సాహితీ వేదికపై సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. మహిళాలోకానికి గర్వకారణంగా నిలిచింది.
ఇంత చక్కటి కావ్యం అందిస్తున్నాం హాయిగా ఆస్వాదించండి. రామానుగ్రహం పొందండి.
~ సంకలన కర్త
బాగుందండి. . మంచి ప్రయత్నం
రిప్లయితొలగించండిజై శ్రీసీతారామా
తొలగించండిజై శ్రీగురుదత్త
రిప్లయితొలగించండిజై శ్రీసీతారామా
చాలా మంచి ప్రయత్నం స్వామి
జై శ్రీసీతారామా