బాల కాండ

బాల కాండ

అయోధ్యాపుర వైభవము

25-వ.

అని వితర్కించి, ముదంబున నిష్టదేవతా ప్రార్థనంబును బురాతన కవీంద్ర స్తుతియునుం జేసి నా యొనర్పంబూనిన మొల్ల రామాయణ మహా కావ్యమునకుఁ గథా క్రమం బెట్టు లనిన.

26-సీ.

సరయూనదీతీర సతత సన్మంగళ-ప్రాభవోన్నత మహా వైభవమ్ము,

కనక గోపుర హర్మ్య ఘన కవాటోజ్జ్వల-త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,

గజ వాజి రథ భట గణి కాతపత్ర చా-మర కేతు తోరణ మండితమ్ము,

ధరణీవధూటి కాభరణ విభ్రమ రేఖ-దరిసించు మాణిక్య దర్పణమ్ము,

భానుకులదీపరాజన్య పట్టభద్ర

భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము

నాఁగ నుతికెక్కు మహిమ ననారతమ్ము

ధర్మ నిలయమ్ము, మహి నయోధ్యా పురమ్ము.

 టీక : గణిక- వేశ్య; ఆతపత్రము - గొడుగు; ధరణీవధూటి- భూదేవి; దరిసించు - దర్శించు; నాగ - వలె; అనారతము - అనవరతము.

27-సీ.

మదనాగ యూధ సమగ్ర దేశము గాని- కుటిల వర్తన శేష కులము గాదు,

ఆహవోర్వీజయ హరి నివాసము గాని- కీశ సముత్కరాంకితము గాదు,

సుందర స్యందన మందిరంబగుఁ గాని- సంతత మంజులాశ్రయము గాదు,

మోహన గణికా సమూహ గేహము గాని- యూధికా నికర సంయుతము గాదు,

సరస సత్పుణ్యజన నివాసమ్ము గాని-

కఠిన నిర్దయ దైత్య సంఘమ్ము గాదు

కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి-

పురవరాగ్రమ్ము సాకేత పురవరమ్ము.

 టీక : ఆహవము - యుద్ధము; ఉర్వీజయము - భూమండలజయము; కీశ - కోతి, పక్షి; యూధిక - అడవిమొల్ల, పెద్దగోరింట; సాకేత - అయోధ్య.

28-సీ.

భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై- గణుతింప సత్యలోకమ్ము వోలె

మహనీయ గుణ సర్వమంగళావాసమై- పొగడొందు కైలాస నగము వోలె

లలిత సంపచ్ఛాలి లక్ష్మీనివాసమై- యుఱవైన వైకుంఠ పురము వోలె

విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై- యారూఢి నమరాలయమ్ము వోలె

రాజరాజ నివాసమై తేజరిల్లి-

నరవరోత్తర దిగ్భాగ నగరి వోలె

సకల జనములు గొనియాడ జగములందుఁ-

బొలుపు మీరును సాకేత పురవరమ్ము.

 టీక : ఉఱవు - ఔచిత్యము; రాజరాజు - కుబేరుడు, చక్రవర్తి; ఉత్తరదిగ్భాగనగరి - అలకాపురి; అమరాలయము - స్వర్గము; పొలుపు - ఒప్పు.

29-క.

ఇమ్ముల నప్పురి వప్రము

కొమ్ములపై నుండి పురము కొమ్మలు వేడ్కన్

దమ్ముల చుట్టము పద జల

జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్.

 టీక : వప్రము - కోట; కొమ్మలు - స్త్రీలు; తమ్మిచుట్టము - సూర్యుడు; అజస్రము - నిత్యము.

30-క.

పరుపున మురువై యుండును

సురపురమునఁ గల్పతరులు చూపఱ కింపై

పరుపున మురువై యుండును

దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్.

 టీక : పరుపు - విరివి; మురువు - సౌందర్యము, గర్వము; చూపఱ - చూచువారు; ప్రతోళి - పెద్దవీధి, రథములు పోవు మార్గము.

31-క.

దాన గుణమ్మున సుర పురి

నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్;

దాన గుణంబున మిక్కిలి

యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్.

 టీక : ఏనుగులు - పెద్దలు.

32-క.

కవి గురు బుధ మిత్త్రాదులు

వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్

గవి గురు బుధ మిత్త్రాదులు

వివిధార్చనలం బురమున వెలయుదు రెపుడున్.

 టీక : కవి - శుక్రుడు, కవిత్వము చెప్పువాడు; గురు - బృహస్పతి, విద్యలు నేర్పు గురువులు; మిత్రాదులు - మిత్రుడు మున్నగు ద్వాదశాదిత్యులు, స్నేహితులు హితులు బంధులు మున్నగువారు; సురపురి - స్వర్గము, ఆకాశము.0

33-క.

భోగానురాగ సంపద

భోగులు వర్తింతు రందు భూనుత లీలన్

భోగానురాగ సంపద

భోగులు వర్తింతు రిందు భూనుత లీలన్.

 టీక : భోగులు - భోగాలు అనుభవించువారు, పాములు; అందు - ఆలోకంలో; ఇందు - ఈలోకంలో.

34-సీ.

ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని- రమణీయ రుక్మకారకులు గారు,

శుభ పవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని- టక్కరి హాస్యనాటకులు గారు,

ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని- చర్చింపఁగా నిశాచరులు గారు,

తిలకించి చూడ సద్ద్విజు లౌదురే కాని- తలఁపంగఁ బక్షిజాతములు కారు,

బాడబులు గాని యగ్ని రూపములు గారు

పండితులు గాని విజ్ఞుల పగిదిఁ గారు

ధీవరులు గాని జాతి నిందితులు గారు

పరమ పావను లా పురి ధరణిసురులు.

 టీక : రుక్మకారులు - బంగారునగలుచేయువారు, కంసాలులు; నిశాచరులు - రాక్షసులు బాడబుడు - బ్రాహ్మణుడు.

35-ఉ.

రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహినీ

రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గో

రాజులు భోగమందు, దినరాజులు సంతతతేజమందు, రా

రాజులు మానమందు, నగరమ్మున రాజకుమారు లందఱున్.

 టీక : రాజు - చంద్రుడు, రతిరాజు - మన్మథుడు, వాహినీరాజు -సముద్రుడు, మృగరాజు - సింహము, గోరాజు -స్వర్గాధిపతి, దినరాజు - సూర్యుడు, రారాజు -దుర్యోధనుడు.

36-సీ.

తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని-సతతాంగ కుష్ఠ పీడితులు గారు,

నిర్మల సత్యోక్తి ధర్మసూతులు గాని-చర్చింప ననృత భాషకులు గారు,

ప్రకటవిభూతి సౌభాగ్యరుద్రులు గాని-వసుధపై రోషమానసులు గారు,

కమనీయగాంభీర్యఘన సముద్రులు గాని-యతులిత భంగసంగతులు గారు,

వర్తకులు గాని పక్షు లేవరుసఁ గారు

భోగులే గాని పాము లెప్పుడును గారు,

సరసులే కాని కొలఁకుల జాడఁ గారు

వన్నె కెక్కిన యప్పురి వైశ్యు లెల్ల.

 టీక : కుబేరుడు - ధనాధిపతి, కుష్టువ్యాధి కలదు, ధర్మసూతి - ధర్మరాజు యుద్ధసమయంలో ఒకమారు అబద్దమాడాడని నింద కలదు, రుద్రులు - 1. భయంకరమైన (సౌభాగ్యాలు కలవారు) 2. రోషరూపులు, సముద్రము - గాంభీర్యానిక పేరు భంగ (అలలు) కలది, వర్తక - వ్యాపారి వర్తకా -మీలవల్లంకిపిట్ట, భోగులు - 1. భోగాలు అనుభవించేవారు, 2. పాములు, సరసులు - 1. రసజ్ఞులు 2. సరస్సులు పద రూపాంతరం

37-క.

పంటల భాగ్యము గలరై

పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్

బంటలుఁ బాడియుఁ గల యా

పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్.

38-సీ.

కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు-బ్రహ్మచారుల నైన భ్రాంతి గొలిపి,

మృదువచోరచనల వదలింప నేర్తురు-ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,

వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు-సన్న్యాసులను నైనఁ జలముపట్టి,

సురత బంధమ్ములఁ జొక్కింప నేర్తురు-వ్రతములు గైకొన్న యతుల నైన,

నచలమెక్కింప నేరుతు రౌషధముల

మరులుగొలుపంగ నేర్తురు మంత్రములను,

ధనము లంకింప నేర్తురు తక్కుసేసి

వాసి కెక్కిన యప్పురి వారసతులు.

 టీక : కచ్చడము - గోచీ,

39-తే.

అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు

నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె?

అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ

బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు.

 టీక : అమృతము - 1. సుధ 2. నీరు, ధేనువు - 1. కామధేనువు, 2. ఆవు

39-క.

ఈ కరణి సకల విభవ

శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్

నాక పురితోడ నొఱయుచు

సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్.

 టీక : సాకేతపురము - అయోధ్య

40-వ.

అట్టి మహా పట్టణంబున కధీశ్వరుం డెట్టివాఁ డనఁగ:

ధర్మ పాలనము

41-సీ.

తన కీర్తి కర్పూర తతిచేత వాసించెఁ -బటుతర బ్రహ్మాండభాండ మెల్లఁ,

దన శౌర్యదీప్తిచే నిన బింబ మనయంబుఁ -బగ లెల్ల మాఁగుడువడఁగఁ జేసెఁ,

దన దానవిఖ్యాతి ననుదినంబును నర్థి -దారిద్ర్యములు వెళ్లఁ బారఁ దఱిమెఁ,

దన నీతిమహిమచే జనలోకమంతయుఁ -దగిలి సంతతమును బొగడఁదనరెఁ,

భళిర! కొనియాడఁ బాత్రమై పరఁగినట్టి-

వైరినృపజాల మేఘ సమీరణుండు,

దినకరాన్వయ పాథోధి వనజవైరి-

నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు.

 టీక : మాగుడుపడు - మాసిపోవు, అర్థి - దానం కోరువాడు, సమీరణుడు - వాయువు, దినకరాన్వయుడు - సూర్యంవంశమువాడు, పాథోథి - సముద్రము, వనజవైరి - సూర్యుడు

42-సీ.

పాలింపఁ డవినీతిపరుల, మన్ననఁ జేసి -పాలించు సజ్జన ప్రతతి నెపుడు,

మనుపఁడెన్నఁడుఁ జోరులను, గారవము చేసి -మనుచు నాశ్రితకోటి ఘనముగాఁగ,

వెఱపెఱుంగఁడు వైరివీరులఁ బొడగన్న, -వెఱచు బొం కేయెడ దొరలునొ యని,

తలఁక డర్థివ్రాతములు మీఱిపైకొన్నఁ, -దలఁకు ధర్మమ్మెందుఁదప్పునొ యని,

సరవిఁ బోషింపఁ డరిగణషట్క మెపుడు, -

వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రవరుల,

భాస్కరాన్వయ తేజో విభాసితుండు, -

మానధుర్యుండు, దశరథక్ష్మావరుండు.

 టీక : బొంకు - అబద్ధము, అరిగణషట్కము -అరిషడ్వర్గము.

43-సీ.

కనఁగోరఁ డొక నాఁడుఁ గన్నులఁ బర వధూ -లావణ్య సౌభాగ్య లక్షణములు,

వినఁగోరఁ డొక నాఁడు వీనుల కింపుగాఁ -గొలుచువారల మీఁది కొండెములను,

చిత్తంబు వెడలించి జిహ్వాగ్రమునఁ గోరి -పలుకఁడు కాఠిన్య భాషణములు,

తలఁపఁ డించుకయైన ధన కాంక్ష నే నాఁడు -బంధు మిత్త్రాశ్రిత ప్రతతిఁ జెఱుప,

సతత గాంభీర్యధైర్యభూషణపరుండు,

వార్తకెక్కిన రాజన్యవర్తనుండు,

సకల భూపాల జన సభాసన్నుతుండు,

ధర్మతాత్పర్య నిరతుండు, దశరథుండు.

44-సీ.

విరహాతిశయమున వృద్ధిపొందఁగలేక, -విషధరుండును గోఱ విషముఁబూనె,

తాపంబు క్రొవ్వెంచితరియింపనోపక, -పలుమాఱుఁ గడగండ్లఁబడియెఁ గరులు,

కందర్పశరవృష్టి నందనోపక ఘృష్టి, -వనవాసమునఁ గ్రుస్సి వనరుసూపె,

దీపించి వల పాపనోపక కూర్మంబు, -కుక్షిలోపలఁ దలఁగ్రుక్కికొనియె.

కుంభినీ కాంత తమమీఁది కూర్మి విడిచి

ప్రకట రాజన్య మస్తకాభరణ మకుట

చారు మాణిక్య దీపిత చరణుఁడైన

దశరథాధీశు భుజపీఠిఁ దగిలినంత.

 టీక : విషధరుడు - ఆదిశేషుడు, కడగండ్లుపడు - బాధ లనుభవించు, కరులు - దిగ్గజములు, ఘృష్టి - వరాహము, వలపు - చొక్కు, కామము, పాపనోపు - విడువలేక.

45-క.

ఆ రాజు రాజ్యమందలి

వారెల్లను నిరత ధర్మవర్తనులగుచున్

భూరిస్థిరవిభవంబుల

దారిద్ర్యం బెఱుఁగ రెట్టి తఱి నే నాడున్.

46-వ.

ఇట్టి మహాధైర్యసంపన్నుండును, మహైశ్వర్యధుర్యుండును నగు దశరథ మహారాజు సకల సామంతరాజలోక పూజ్యమానుం డగుచుఁ బ్రాజ్యంబగు రాజ్యంబు నేలుచు నొక్కనాఁడు.

దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట

47-సీ.

సంతానలబ్ధికై చింతించి చింతించి -శిష్టవర్తనుఁడౌ వశిష్ఠుఁ జూచి,

తనకోర్కి వినుపింప, విని మునిసింహుండు -పలికె నా ఋష్యశృం గెలమిఁ దేర,

ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్టి యనుపేర -యాగమ్ముఁ గావింప, నందువలన

వినుతికెక్కఁగఁజాలు తనయులు గలుగుట -సిద్ధమ్ము, నామాట బుద్ధిలోన

నిలుపుమని చెప్ప, నా రాజు నెమ్మితోడ

నకుటిలాత్మకు నా విభాండకుని తనయు

నెలమి రావించి, పుత్త్రకామేష్టి యనెడి

జన్న మొనరించుచున్నట్టి సమయమునను

సురల మొఱ లాలించి శ్రీమహావిష్ణు వభయ మొసఁగుట

48-ఉ.

రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై

దేవతలెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా

జీవతనూజుఁ డున్నెడకు శీఘ్రమ తోడ్కొనిపోయి చెప్ప, నా

దేవుఁడు విష్ణుసన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యచ్చటన్.

 టీక : గీష్పతి - బృహస్పతి, రాజీవతనూడుడు - బ్రహ్మదేవుడు.

49-వ.

అప్పురాణపురుషోత్తముం గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి, బ్రహ్మ యిట్లని విన్నవించె,

50-ఉ.

రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమశక్తిని వీరిసంపదల్

వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁజేయ, నేఁడు దే

వావళి దీనభావమున నక్కడ నుండఁగనోడి, భీతిచే

దేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్.

 టీక : కొల్లలాడి - దొంగతనంచేసి, త్రిదివము - స్వర్గలోకము, పాడుగజేయు -నాశనం చేయు, ఉండగనోడి - ఉండలేక.

51-వ.

అని విన్నవించిన విని వనరుహలోచనుండు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని గూర్చి యిట్లాన తిచ్చె,

 టీక : అనిమిషనాయకుడు - దేవేంద్రుడు.

52-తే.

వనజగర్భుని గూర్చి రావణుఁడు మున్ను

తపముఁజేసిన వరమిచ్చు తఱినిఁ దనకు

నేరిచేఁ జావులేకుండఁ గోరునాఁడు

నరుల వానరులను జెప్ప మఱచినాఁడు

 టీక : వనజగర్భుడు - బ్రహ్మదేవుడు, ఏరిచేన్ - ఎవరిచేత.

53-వ.

అక్కారణంబునం జేసి

54-తే.

వనరుగలిగెను మనకు రావణుని జంప,

వినుఁడు మీరెల్ల నా మాట వేడ్కమీఱ,

దశరథుం డను రాజు సంతాన కాంక్ష

నొనర జన్నంబు గావించుచున్నవాఁడు

 టీక : వనరు -వీలు, నెలవుకొను, హత్తు

55-క.

ధరణీపతి యగు దశరథ

నరనాయకు నింటఁ బుట్టి నరరూపమునం

బెరిగెద నేనిక, మీరును

సురకంటకుమీఁద లావు సూపుటకొఱకై.

56-క.

కొందఱు కపి వంశంబునఁ

గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై

యందఱు నన్ని తెఱంగుల

బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై.

57-వ.

అని, కృపాధురీణుండైన నారాయణుఁ డానతిచ్చిన విని వనజాసనాది దేవతా నికరం బవ్వనజోదరుని పాదారవిందములకు వందనమ్ము లాచరించి, నిజనివాసమ్ములకుం జని రయ్యవసరమ్మున.

టీక : వనజోదరుడు - పద్మాక్షుడు, హరి.

అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట

58-మ.

ఇల సాకేతనృపాలశేఖరుఁడు దా హేలా విలాసంబుతో

ఫలకాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారుపాత్రమ్ము లో

పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమై నిల్చి ని

ర్మల తేజంబునఁ బావకుం డనియెఁ బ్రేమన్ మంజువాక్యంబులన్.

 టీక : సాకేతనృపాలశేఖరుడు - అయోధ్యాధిపతి దశరథుడు,  దుగ్ధాన్నము - పరవాన్నం.

59-క.

భూపాల! నీదు భార్యల

కీ పాయస మారగింపనిమ్మీ! తనయుల్

శ్రీపతి పుత్త్ర సమానులు

రూపసు లుదయింతు రమితరూపస్ఫూర్తిన్.

60-వ.

అని చెప్పి యప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన.

61-ఆ.

పాయసమ్ము రెండు భాగముల్ గావించి,

యగ్రసతుల కీయ, నందులోన

సగము సగము దీసి ముగుద సుమిత్రకు

నొసఁగి, రంత నామె మెసవెఁ బ్రీతి.

కౌసల్యా కైకేయీ సుమిత్రల దౌహృద లక్షణములు

62-వ.

అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ,

 టీక : దౌహృద - దోహదము; వేవిళ్లు.

63-సీ.

ధవళాక్షు లనుమాట తథ్యంబు గావింపఁ -దెలుపెక్కి కన్నులు తేటలయ్యె,

నీల కుంతల లని నెగడిన యా మాట -నిలుపంగ నెఱులపై నలుపు సూపె,

గురుకుచలను మాట సరవి భాషింపఁగఁ -దోరమై కుచముల నీరువట్టె,

మంజుభాషిణులను మాటదప్పక యుండ -మెలఁతల పలుకులు మృదువు లయ్యెఁ,

గామిను లటంట నిక్కమై కాంతలందు

మీఱి మేలైన రుచులపైఁ గోరికయ్యె,

సవతిపోరనఁ దమలోన సారె సారె

కోకిలింతలు బెట్టు చిట్టుములుఁ బుట్టె.

 టీక : సారెసారెకు - చీటికిమాటికీ, ఓకిలించు - కక్కు, డోకు, వాంతిచేయు, బెట్టు- ఉధృతము, చిట్టుములు - గర్భిణికి కలుగు ఒక లక్షణము, వేవిళ్ళు, దౌహృదము

64-వ.

మఱియును,

65-సీ.

తనుమధ్య లనుమాటఁ దప్పింపఁ గాఁబోలు, -బొఱలేక నడుములు పొదలఁజొచ్చెఁ

గుచములు బంగారు కుండలో యనుమాట -కల్లగా, నగ్రముల్ నల్లనయ్యెఁ,

జంద్రాస్య లనుమాట సరవి మాన్పఁగఁబోలుఁ, -గళల విలాసమ్ము పలుచనయ్యె,

సుందరు లనుమాట సందియమ్ముగఁబోలు, -గర్భ భారమ్ములఁ గాంతిదప్పె,

ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ

గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండ

నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ

గాంతలకు నప్డు గర్భముల్ కానుపించె.

 టీక : వ్రేకము - వ్రేగు, భారము.

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

66-వ.

ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భానువాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రంబునఁ, గర్కటక లగ్నంబున శ్రీరామభరత లక్ష్మణశత్రుఘ్నులం గాంచినం దదనంతరంబున దశరథుండు రథోచిత కర్తవ్యంబులు జరపి, యప్పది దినంబులు నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార చతుష్టయంబునకుఁ గాలోచితంబు లగు చౌలోపనయనాది కృత్యంబులు గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ రథారోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి, పెంచుచున్న సమయమ్మున,

యాగ రక్షణమునకుఁ రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు

67-సీ.

ఒకనాఁడు శుభగోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి -హిత పురోహితులును నెలమిఁ జేరి,

బంధువర్గము రాయబారులుఁ జారులుఁ -బరిచారకులు నెల్ల సరవిఁ జేరి,

గాయకులును భృత్యగణమును మిత్త్రులు -సతులును సుతులును జక్క నలరి,

సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా-వంతులు గడు నొక్కవంకఁ జేరి,

కొలువఁ గొలువున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ

డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య

మధిపునకుఁ జెప్ప, మదిలోన నాత్రపడుచు

వినయ మొప్పార నిట్లని విన్నవించె

 టీక : చారులు - గూఢచారులు, కుశికపుత్రుడు - విశ్వామిత్రుడు కౌశికుడు.

68-క.

“రాముఁడు దనుజులతో సం

గ్రామము సేయంగఁ గలఁడె? కందు గదా! నే

నే మిమ్ముఁ గొలిచి వచ్చెద

నో మునిరాజేంద్ర! యరుగు ముచితప్రౌఢిన్.”

 టీక : కందు - పసికందు, చంటిపిల్లాడు

69-మ.

అనినం గౌశికుఁ డాత్మ నవ్వి, “వినుమయ్యా! రాజ! నీచేతఁ గా

దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోపబాహాబలుల్,

ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ

వనుమానింపక పంపు మింకఁ, గ్రతురక్షార్థంబు భూనాయకా!”

70-వ.

అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్త్రునకు మిత్త్ర కుల పవిత్రుం డైన దశరథుండు మాఱాడ నోడి యప్పుడు,

71-క.

మునినాథు వెంట సుత్రా

ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రా

ముని సౌమిత్రిని వెస న

మ్మునితో నానంద వార్థి మునుఁగుచుఁ బనిచెన్.

 టీక : సుత్రాముడు - ఇంద్రుడు.

కౌశికుని యాజ్ఞపై రాముఁడు తాటకను గూల్చుట

72-మత్త.

వారిఁ దోడ్కొని కౌశికుం డట వచ్చు నయ్యెడ ఘోర కాం

తార మధ్యమునందు నొక్కతె దైత్యకామిని భీకరా

కార మొప్పఁగ నట్టహాస వికాస మేర్పడ రాగ నా

క్రూర రాక్షసిఁ జూచి యమ్మునికుంజరుం డొగి రామునిన్.

73-క.

“తాటక వచ్చిన దదిగో

నాటగ నాఁటు”డని “మేలమాడక నీ వీ

పాటి పడనేయు” మని తడ

బాటున శంకించు రామభద్రున కనియెన్.

 టీక : మేలమాడు - వెనుకాడు

74-వ.

ఇట్లు చెప్పిన యా మునిచంద్రుని పల్కు లాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె.

75-క.

“ఈ యాఁడుదానిఁ జంపఁగ

నా యమ్మున కేమి గొప్ప? నగరే వీరుల్?

చీ” యని రోయుచు నమ్ముని

నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్.

76-క.

వ్రేటుగొని రామచంద్రుఁడు

సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్

ఘోట కసమ వక్షస్స్థలఁ

దాటక నత్యుగ్ర లీల ధరపైఁ గూల్చెన్.

77-వ.

అట్లు తాటకం గీటణంచినయంత, నమ్మునీంద్రుండు మేటి సంతోషమ్మున రామునిం గొనియాడుచు నశ్రమంబున నిజాశ్రమంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబు సేయుచున్న సమయంబున.

రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట

78-క.

ఆకాశ వీథి నెలకొని

రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం

బా కౌశికు యజ్ఞముపై

భీకరముగ ముని గణంబు భీతిం బొందన్.

 టీక : పలలము - మాంసము.

79-ఉ.

అంబరవీథి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం

సంబులు గాధినందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో

నంబరరత్నవంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు

గ్రంబుగఁ ద్రుంచెఁ జండ బలగర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై.

 టీక : అంబరవీథి - ఆకాశము, త్రిదశాంతకులు - రాక్షసులు, ఏచు - బాధించు, గాధినందనుడు - విశ్వామిత్రుడు, అంబరరత్నవంశము - సూర్యవంశము, కలశాంబుధి- పాలసముద్రము,

80-వ.

ఇట్లు రామచంద్రుండు సాంద్ర ప్రతాపంబు మించ నింద్రారులఁ ద్రుంచిన, నమ్మునిచంద్రుఁడు నిర్విఘ్నంబుగా జన్నం బొనర్చి, రామ సౌమిత్రులం బూజించె నట్టి సమయమ్మున.

81-క.

ధరణీసుత యగు సీతకుఁ

బరిణయమొనరింప జనకపార్థివుఁ డిల భూ

వరసుతుల రం డని స్వయం

వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్.

 టీక : భూవరసుతులు - రాకుమారులు.

82-వ.

ఇట్లు స్వయంవరమహోత్సవ ఘోషంబున సంతోషమ్ము నొంది, విశ్వామిత్రుండు రామ సౌమిత్రుల మిథిలానగరంబునకుఁ దోడ్కొని, చనుచుండు మార్గంబున, శ్రీరాముని పాదధూళి సోక నహల్యయైన శిల

83-క.

ముది తాపసి వెనువెంటను

వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీ

పదరజము సోఁకి, చిత్రం

బొదవఁగఁ గనుపట్టె నెదుట నొక యుపల మటన్.

 టీక : ఉపలము -రాయి.

84-క.

పదనై, యొప్పిదమై, కడుఁ

గదలుచు బంగారు పూదె కరఁగిన రీతిన్,

మెదలుచు, లావణ్యస్థితి

సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిర లీలన్.

 టీక : సుదతి - సుందరి.

85-ఉ.

ఆ ముని వల్లభుండు కొనియాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ

రాముని జూచి యిట్లనియె, రామ! భవత్పదధూళి సోఁకి, యీ

భామిని రాయి మున్ను, కులపావన చూడఁగఁ జిత్రమయ్యె నీ

నామ మెఱుంగువారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్.

 టీక : నమ్మ - నమ్మకము

86-వ.

అని యక్కాంతారత్నంబు పూర్వవృత్తాంతం బంతయు నెంతయు సంతసమ్మున నమ్మనుజేంద్ర నందనుల కెఱింగింపుచు, మిథిలానగరంబునకుం జనియె నచ్చట.

సీతా స్వయంవరము

87-సీ.

ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర -రాజకుమారులు తేజ మలరఁ

బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ -భూపనందనులు విస్ఫూర్తి మీఱ,

గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ -ధరణీశపుత్రులు సిరి వెలుంగ,

మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ -నృపతనూభవులు నెన్నికకు నెక్క,

మఱియు నుత్కల కొంకణ మద్ర పౌండ్ర

వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ

రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజసుతులు

వచ్చి రక్కామినీ స్వయంవరమునకును

88-ఉ.

కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం

గొందఱు, కొంద ఱశ్వములఁ, గొందఱు మత్త గజేంద్ర సంఘమున్

గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృపాలనందనుల్

సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్.

89-వ.

అట్టి సమయంబున.

90-చ.

గురుభుజశక్తిగల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా

హరుని శరాసనంబుఁ గొనియాడుచుఁ బాడుచుఁ గొంచు వచ్చి, సు

స్థిరముగ వేదిమధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దీపముల్

విరులును గంధ మక్షతలు వేడుక నిచ్చిరి చూడ నొప్పుగన్.

91-వ.

అట్టి సమయంబున జనక భూపాలుండు రాజ కుమారులం గనుంగొని యిట్లనియె.

శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన

92-ఉ.

“కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మత్తనూజకై

యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ

శంకరుచాప మెక్కిడిన సత్త్వ ఘనుం డగువాని కిత్తునీ

పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్.”

 టీక : శంకరుచాపము - శివధనుస్సు.

93-ఆ.

అనుచుఁ బలుకుచున్న యవనీశతిలకుని

వాక్యములకు నుబ్బి, వసుమతీశ

సుతులు దాము తామె మతిలోనఁ జెలఁగుచు

దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి,

రాజకుమారులు శివచాపమును గదల్ప నోడుట

94-క.

విల్లా? యిది కొండా? యని

తల్లడపడి సంశయంబు తలకొన మదిలో

బల్లిదు లగు నృప నందను

లెల్లరు దౌదవుల నుండి రెంతయు భీతిన్.

 టీక : దౌదవుల - దౌదవ్వుల, దూరందూరంగా

95-క.

కొందఱు డగ్గఱ నోడిరి,

కొందఱు సాహసము చేసి కోదండముతో

నందంద పెనఁగి పాఱిరి

సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్.

96-సీ.

గాలిఁ దూలిన రీతిగా నెత్తఁ జాలక -తముఁ దామె సిగ్గునఁ దలను వంచి,

కౌఁగిలించిన లోను గాక వెగ్గలమైన -భీతిచే మిక్కిలి బీరువోయి,

కరముల నందంద పొరలించి చూచినఁ -గదలక యున్నఁ జీకాకు నొంది,

బాషాణ మున్నట్టి పగిది మార్దవ మేమిఁ -గానరాకుండినఁ గళవళించి,

రాజసూనులు కొందఱు తేజముడిగి

జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి,

జనకుఁ డీ మాయఁ గావించెఁ, జాలు ననుచుఁ

దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి.

 టీక : వెగ్గములము - మిక్కుటము.

97-సీ.

ఇది పర్వతాకార, మీవిల్లు కను విచ్చి-తేఱి చూడఁగ రాదు దేవతలకు,

నటుగాక మును శేషకటకుని ధను వంట-హరుఁడె కావలెఁ గాక, హరియుఁ గాక,

తక్కినవారికిఁ దరమె యీ కోదండ-మెత్తంగఁ? దగు చేవ యెట్లు గలుగు?

దీని డగ్గఱ నేల? దీని కోడఁగ నేల? -పరులచే నవ్వులు పడఁగ నేల?

గుఱుతు సేసియుఁ దమ లావు కొలఁదిఁ దామె

తెలియవలెఁ గాక, యూరక తివుర నేల?

యొరుల సొమ్ములు తమ కేల దొరకు? ననుచుఁ

దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు.

 టీక : శేషకటకుడు - శేషసర్పం కడియముగా కల శివుడు.

98-వ.

అంత విశ్వామిత్ర మునీంద్రుండు రామచంద్రుని ముఖావలోనంబుఁ జేసిన

ముని యానతి శ్రీరామునిచే శివ ధనుర్భంగము

99-చ.

“కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు, ఫణీంద్ర భూవిషా

స్పదులను బట్టు, కూర్పమ రసాతల భోగి ఢులీకులీశులన్

మెదలక పట్టు, ఘృష్టి ధరణీఫణి కచ్ఛప పోత్రి వర్గమున్

బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁ డీశుని చాప మెక్కిడున్.

 టీక : కాశ్యపి - పరశురామునిచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడిన భూమండలము, ఫణీంద్రుడు - ఆదిశేషుడు, భూవిషాస్పదులు - నేలమీది పాములు, కూర్పము - భూగర్భంలో, భోగి - సర్పము, ఢులీకులీశులు - కూర్మావతారుని వంశస్తులు, ఘృష్టి - వరాహము, కచ్ఛపము - కూర్మము, పోత్రి - వరాహము, కరులు - దిగ్గజములు.

100-క.

ఉర్వీ నందనకై రా

మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం

బుర్విం బట్టుఁడు దిగ్దం

త్యుర్వీధర కిటి ఫణీంద్రు కూఁతఁగఁ గడిమిన్.”

101-వ.

అనుచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున,

102-మ.

ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ

దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబు చే నంది, చి

వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్,

దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్.

103-ఆ.

ధనువు దునిమినంత ధరణీశ సూనులు

శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి,

సీత మేను వంచె, శ్రీరామచంద్రుని

బొగడె నపుడు జనక భూవిభుండు.

సీతా రాముల కల్యాణ వైభవము

104-వ.

ఇట్లు శ్రీరామచంద్రుని సత్త్వసంపదకు మెచ్చి, సంతోషించి, జనకమహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన, దశరథ మహారాజును నా శుభలేఖలం జదివించి, సంతోషంబున నానందబాష్పంబులు గ్రమ్ముదేర మంత్రిప్రవరుండగు సుమంత్రునిం బిలిపించి, "సుమంత్రా! యిపుడు మన మందఱమును బయలుదేఱి, మిథిలా పట్టణంబునకుం బోయి, యట జనకమహారాజు నింట మన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహమహోత్సవము జరుపవలయుఁ, గావున వశిష్ఠాది ద్విజ వర్యులను, గౌసల్యాది కాంతాజనమ్మును, నరుంధతి మొదలుగాఁగల భూసుర భార్యలను మఱియు సకల బంధు జనంబును రావించి, బంగరుటరదంబుల నిడికొని దోడ్కొని ర" మ్మని యంపిన నతండును మహా ప్రసాదం బని తత్క్షణము యంతఃపురంబునకుం బోయి, కౌసల్య కైక సుమిత్ర మొదలగు రాజకాంతలను, వశిష్ఠాది ద్విజవరిష్ఠులను, నరుంధతి మొదలుగాఁ గల ముత్తైదువలను, మిగిలిన సకల బంధుజనమ్మును రావించి, యుక్తప్రకారముగాఁ గనకరథమ్ములపై నిడికొని, దశరథమహారాజు కడకుం గొనివచ్చిన, యంత దశరథుండు పుత్రద్వయ సహితమ్ముగ రథ మారోహించి, సమస్తసేనాసమన్వితుం డగుచు వాద్యఘోషంబులు దశదిశలు నిండ, నడచుచున్న సమయమ్మున, నంతకుముందు జనకభూవల్లభుండు దశరథమహీపాలు నెదుర్కొని, తోడితెచ్చి, యడుగులు గడిగి, యర్ఘ్య పాద్యాది విధుల విధ్యుక్తంబుగాఁ బూజించి, మానితంబుగఁ గానుక లొసంగి, సకల సంపత్సంపూర్ణ మయిన నివేశముం గల్పించి, యందుఁ బెండ్లివారిని విడియించె, నంత నక్కడఁ గనకవికారమైన పీఠమ్ముపైఁ గూర్చున్న సమయమ్మున "దేవా! శుభముహూర్తం బాసన్నమగుచున్నది ర" మ్మని వసిష్ఠుండు సనుదేర నాతఁడు సని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళస్నానమ్ముఁ జేయించి, నిర్మలాంబరాభరణంబు లొసంగి, వేర్వేఱ నొక్క ముహూర్తమునఁ దన కూఁతు సీతను శ్రీరామచంద్రునకును, దన తమ్ముఁడు కుశధ్వజుని కూఁతు లగు మాండ వ్యూర్మిళా శ్రుతకీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకును నిచ్చి, వివాహముం జేసి, తన ప్రియతనయల కొక్కొకతెకు నూఱేసి భద్రగజమ్ములను, వేయేసి తురంగంబులును, బదివేలు దాసీజనమ్మును, లక్ష ధేనువులును నరణంబు లిచ్చి, దశరథాది రాజలోకమ్మునకు బహుమానముగా నవరత్నఖచిత భూషణమ్ములును, జీనిచీనాంబరమ్ములును నొసంగి, సుగంధద్రవ్యముల నర్పించి, పూజించి యంపె. నంత దశరథమహారాజు మరలి యయోధ్యాపట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యే మార్గంబున.

దశరథరాముని గని పరశురాముని యధిక్షేపము

105-ఆ.

పరశురాముఁ డడ్డుపడి వచ్చి, మీ నామ

మెవ్వ రనిన, మొలకనవ్వుతోడ

నేను దశరథుండ, నితఁడు నా పుత్త్రుండు,

రాముఁ డండ్రు పేరు, భీమ బలుఁడు.

106-వ.

అని వినిపించినఁ గ్రోధావేశవశంవదుండై యప్పు డప్పరశురాముండు రాముం గనుంగొని యిట్లనియె.

107-క.

“రాముఁడు నేనై యుండఁగ

నామీఁద నొకండు గలిగెనా మఱి? యౌఁగా

కేమాయె, రణ మొనర్పఁగ

రామా! ర”మ్మనుచుఁ రహి దగన్ బిలువంగన్

 టీక : రహి - ధ్యుతి, శోభ.

108-వ.

పిలిచినతోడనే రామచంద్రుం డతని కిట్లనియె,

109-ఆ.

“బ్రాహ్మణుండ వీవు పరమ పవిత్రుండ

వదియుఁ గాక భార్గవాన్వయుండ

వైన నిన్నుఁ దొడరి యాహవస్థలమున

జగడమాడ నాకుఁ దగునె చెపుమ?”

 టీక : ఆహవము - రణము.

110-వ.

అనిన విని పరశురాముం డిట్లనియె.

111-ఉ.

“శస్త్రముఁ దాల్చినం దగునె? సన్నుతి కెక్కిన భార్గవుం డనన్

శాస్త్రము గాదు, నా కెదిరి సంగర భూమిని నిల్చినంతనే

శస్త్రముఖంబులన్ నృపులఁ జక్కుగఁ జేయుఁదు గాఁన నిప్పుడున్

శస్త్రము శాస్త్రముం గలవు సాహస వృత్తిని రమ్ము పోరఁగన్.”

 టీక : జక్కు - జిత్తు,

112-వ.

అనిన రామచంద్రుం డిట్లనియె.

113-మ.

“విను, మావంటి నృపాలురైనఁ గలనన్ వీరత్వముం జూపఁగా

ననువౌఁగాక, మహానుభావుఁడవు, నిన్నాలంబులో మీఱఁగా

నెనయన్ ధర్మువె మాకుఁ జూడ? మఱి నీ వేమన్న నీ మాటకుం

గనలన్, బంతము కాదు మా కెపుడు దోర్గర్వంబు మీ పట్టునన్.”

 టీక : కలన - రణము, ఆలము - పోరు, మీఱు - అతిశయించు, కనలు - బాధపడు.

114-వ.

అనిన విని యెంతయు సంతోషించి భార్గవరాముం డారఘురామునితో నిట్లనియె

115-ఆ.

“శివుని చివుకు విల్లు శీఘ్రంబె యలనాఁడు

విఱిచినాఁడ ననుచు విఱ్ఱవీఁగ

వలదు, నేఁడు నాకు వశమైన యీ చాప

మెక్కుపెట్టి తివియు మింతె చాలు.

 టీక : చివుకు - చివికిపోయిన, ఎక్కిడు - విల్లుకు నారి తగిలించు, తివియు - బాణము సంధించు.

116-ఉ.

రాముఁడు గీముఁ డంచును ధరా జనులెల్ల నుతింప దిట్టవై

భీమునిచాపమున్ విఱిచి ప్రేలెద వందుల కేమిగాని, యీ

శ్రీమహిళేశు కార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ

తో మఱి పోరు సల్పి పడఁ ద్రోతు రణస్థలి నీ శరీరమున్.”

టీక : ఎక్కిడు -విల్లుకు నారితగిలించు, భీమునిచాపము - శివధనుస్సు, శ్రీమహిళేషుడు - లక్ష్మీపతి హరి.

శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁ గూడ విష్ణు తేజము నందికొనుట

117-చ.

అని తన చేతి విల్లు నృపు లందఱుఁ జూడగ నందియీయ, నా

ధనువును గూడి తేజముఁ బ్రతాపము రాముని జెందె, నంతనే

జనవరుఁ డా శరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడి బాణ మం

దున నిడి యేది లక్ష్యమనఁ ద్రోవలు సూపినఁ ద్రుంచె గ్రక్కునన్.

 టీక : అందియీయు - అందించు, త్రోవ - బాణము వేయు దిక్కు.

118-వ.

ఇట్లు మహా ప్రతాపంబున నా విలు ద్రుంచి, యనర్గళ ప్రతాపమ్మున భార్గవ రాము దోర్గర్వంబు నిర్గర్వంబు గావించి, జయమ్ముఁ గైకొన్న కుమారునిం గౌఁగిలించుకొని, దశరథుండు కుమార చతుష్టయమ్ముతో నయోధ్యానగరంబుఁ బ్రవేశించి సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్న సమయంబున.

119-శా.

పారావార గభీరికిన్, ద్యుతిలసత్పద్మారికిన్, నిత్య వి

స్ఫారోదార విహారికిన్, సుజన రక్షాదక్ష దక్షారికిన్,

సారాచార విచారికిన్, మదరిపుక్ష్మాపాల సంహారికిన్,

వీరా సాటి నృపాలకుల్? దశరథోర్వీనాథ జంభారికిన్.

 టీక : పారావార గభీరుడు - సముద్రమంత గంభీరమైనవాడు, ద్యుతి - రహి, శోభ, లసత్ - ప్రకాశవంతమైన, పద్మారి -సూర్యుడు, విస్ఫారము - ధనుష్టంకారము, ఉదార - అధికము, దక్షారి - దక్షుని మీఱిన వాడు, సారము - న్యాయము.

120-వ.

అని కొనియాడఁదగిన నృపాలశేఖరుఁడు ధర్మమార్గంబు నొక్కింతయేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె” ననుట విని నారదుని వాల్మీకిమహామునీశ్వరుం “డటమీఁది కథావిధానం బెట్టి”దని యడుగుటయు.

ఆశ్వాసాంత పద్య గద్యములు

121-క.

జలజాక్ష! భక్తవత్సల!

జలజాసనవినుతపాదజలజాత! సుధా

జలరాశిభవ్యమందిర

జలజాకరచారుహంస! జానకినాథా!

 టీక : జలజాక్షుడు - పద్మాక్షుడు,  భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యము కలవాడు, జలజాసన - బ్రహ్మదేవునిచే, వినుత - నుతింపబడిన, పాదజలజాతుడు - పాదపద్మములవాడు సుధాజలరాశి - పాలసముద్రమను, భవ్యమందిర - దివ్యమైననివాసమను, జలజాకర - సరస్సునందు విహరించు, చారుహంస - అందమైన హంస ఐనవాడు, జానకినాథుడు - శ్రీరాముడు.

122-గ.

ఇది శ్రీగౌరీశ్వరవరప్రసాదలబ్ధ గురుజంగమార్చనవినోద సూరిజనవినుత కవితాచమత్కా ‘రాతుకూరి కేసనసెట్టి’ తనయ ‘మొల్ల’ నామధేయ విరచితంబైన శ్రీరామాయణ మహాకావ్యంబు నందు బాలకాండము సర్వము నేకాశ్వాసము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Intro

 Ramayana is a Sanskrit epic ithihasa, that happened like this, story of Indian Subcontinent. It finely reflects the Indian values to fulles...