యుద్ధ కాండ - 2

 

యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము

644-క.

అమలిన శుభచారిత్రా
కమలదళ సమాననేత్ర! కౌశికమిత్రా!
ద్యుమణికులవార్ధిసోమా!
సమదాసురజనవిరామ! జానకిరామా!

645-వ.

శ్రీనారదమహామునీశ్వరుండు వాల్మీకి కెఱింగించిన తెఱంగెఱింగించెద నాకర్ణింపు మట్లు.

ఆహవ రంగమునకు రావణాగమనము

646-ఆ.

చారులరుగుదెంచి సౌమిత్రిచే నింద్ర
జిత్తుఁ డీల్గె ననుచుఁ జెప్పుటయును
బంక్తిముఖుఁడు సుతునిఁ బలుమాఱు దలఁచుచు
వగవఁ జొచ్చె నెల్లవారు వినఁగ.

647-వ.

ఇట్లనేక ప్రకారంబులఁ గుమారుం బలవరింపుచు దుఃఖించుచుఁ గొంత తడవున కూఱడిల్లి ధైర్యంబు నూలుకొల్చి తనకుమారుం జంపినవానిని నేఁ డవశ్యంబును సంగ్రామ రంగంబునఁ జంపుదు నని నియమంబు చేసి తత్క్షణంబ.

648-సీ.

శైలసన్నిభములౌ సామజంబులతోడ-ననిలవేగము గల్గు హరుల తోడఁ
గాంచనోజ్జ్వలములౌ ఘనరథంబులతోడఁ- బ్రతి లేని ఘనమూల బలముతోడఁ
గిమ్మీరవర్ణోరు కేతనంబులతోడఁ-దఱచైన పట్టు ఛత్రములతోడ
భేరీ మృదంగాది పృథువాద్యములతోడ-వరశంఖకాహళ ధ్వనులతోడఁ

బాదఘట్టన చలితోర్విభాగుఁ డగుచు
వనధు లెల్లను బిండలివండ గాఁగ
నడిచె లంకేశుఁ డధిక సన్నాహమునను
రామచంద్రునితోడను రణ మొనర్ప.

  టీక -   పిండలివండ- గడ్డగట్టు

649-మ.

కరిఘీంకారములున్ మహాజవతురంగవ్రాతహేషావళుల్
వరకోదండనినాదముల్ సుభటదుర్వారాట్టహాసంబులున్
గురుశంఖోజ్జ్వలనాదముల్ దశదిశాక్రోశంబుగా నొక్కటై
పరగన్బంక్తి ముఖుండు దా నడిచెఁ గోపస్ఫూర్తి నిశ్శ్వాసుఁడై.

  టీక -  హేష- గుఱ్ఱం అరుపు

రావణ సుగ్రీవుల కథనము

650-వ.

ఇట్లు చతురంగబలంబులు గొల్వ లోకవిద్రావణుం డగు రావణుండు సమరం బొనర్ప నరుదేరం గని రాఘవేశ్వరుం డతనికి దండనాయకులం బనిచిన, వారును దరుగిరిపాషాణపాణులై యెదురు నడిచి సింహనాదంబులు సేయ నుభయ బలంబులుం దలపడి పోరాడు సమయంబున నమరవైరులు శస్త్రాస్త్ర వర్షంబులు గురియించి నొప్పించి నంత వానరవీరులు మరల దానవులపైఁ బాషాణపాదపంబు లడరింప నరిబలంబులు విఱిగి పికాపికలై పఱచునత్తఱిఁ బంక్తి కంధరుం డుదగ్రుండై కెరలుచుఁ గ్రూరనారాచంబులు చాపంబునం దొడిగి పనస, పవనతనయ, నల, నీల, ద్వివిద, శరభ, కుముద, గజ, గవయ, గవాక్ష, గంధమాద, నాంగద, మైందాదుల నొక్కొక్కరిఁ బదేసి బాణంబుల గుదిగొన నేసిన విఱిగి యగచరసేనలు సురుగు నయ్యవసరంబున.

   టీక -   అగచరుడు- వానరుడు, సురుగు- అటమటించు

651-క.

చేరి విరూపాక్షుని దగు
తేరిపయిని నొక్కకొండ ధీరతతోడన్
సూరజుఁ డప్పుడు మిక్కిలి
శూరత్వం బడరనేసి చూర్ణము సేసెన్.

   టీక -  విరూపాక్షుడు- మాల్యవంతుని కొడుకు, సూరజుడు- సుగ్రీవుడు

652-ఆ.

రథము విఱిగినంత రణమధ్యమున నొక్క
వారణంబు నెక్కివచ్చు నెడను
వాలికొడుకు దాని పటురోషమునఁ దోల
నుఱికి ప్లవగుఁ గోల నఱికె వాఁడు.

653-క.

అక్షయబలుఁ డగు రవిసుతుఁ
డాక్షణమున నుగ్రుఁ డగుచు నద రంట విరూ
పాక్షుని వక్షముఁ బొడిచిన
రక్షోవీరుండు కూలి రణమునఁ బడియెన్.

654-వ.

ఇట్లు కూలిన.

655-క.

హుమ్మని యాతనికూరిమి
తమ్ముండును గనలి వచ్చు తపనజు నత్యు
గ్రమ్ముగ మార్కొని జడిగా
నమ్ముల వర్షంబుఁ గురియ నాలోఁ బెలుచన్.

   టీక -  తపనజుడు- సుగ్రీవుడు

656-చ.

శరములు తాఁకకుండ నొకశైలమునం దగ నోసరించి యా
యరదము నుగ్గుగాఁ గపికులాగ్రణి వైచిన వాఁడు నేలకున్
వరభుజశక్తి దాఁటి కరవాలున నేసినఁ దప్పఁ గ్రుంకి వా
నరపతి కొట్టె నప్డు మహినాథుఁడు సంతసమంది చూడఁగన్.

657-క.

కదనమున నొచ్చి దానవుఁ
డదలింపుచు భానుసుతుని యౌదల వగులన్
గదచే నడిచిన వానినిఁ
గుదియంగాఁ బట్టి వైచెఁ గుంభినిమీఁదన్.

పవనజుఁడు సుపార్శ్వుని మట్టుపెట్టుట

658-క.

అంత సుపార్శ్వుఁడు మిక్కిలి
పంతము నెఱపుచును రథము పవనాత్మజుపై
నెంతయుఁ బఱపుచు బాణము
లంతంతనె నాట నేయునవసరమందున్.

659-సీ.

హనుమంతుఁ డాదైత్యు నరదంబు పై దాఁటి-చెక్కలు వాఱంగఁ ద్రొక్కివేసి
సైంధవంబులఁ జంపి సారథితలఁగొట్టి-గొడుగులు పడగలు పుడమిఁ గలిపి
వడి వానిచే నున్న యడిదంబుఁ గైకొని-బిరుసుగా నేసిన ధరను గూలి
గొబ్బునఁ దెప్పిర్లి కోపంబు దీపింప-ననిలజునురము మూఁడంబకముల

జాంబవంతుని నిరుమూఁడు సాయకముల
వడి గవాక్షుని నైదింట వాలిసుతుని
నేడు బాణంబులను దూలనేసె నంత
నవనిఁ బడి లేచి యంగదుం డాగ్రహమున.

660-తే.

వాని చేవిల్లు విఱిచిన వాఁడు కినిసి
పరిఘఁ గొని యేయ మూర్ఛిల్లి ధరణి వ్రాలి
తెలిసి యంగదుఁ డాదైత్యుఁ దెగువ నురము
పిడు గడంచినగతి ముష్టిఁ బొడిచి చంపె.

661-వ.

ఇట్లు సుపార్శ్వాది రక్షోనాయకు లాక్షణంబునం గూలిన.

రామ రావణుల భీకర సంగ్రామము

662-క.

తన కట్టెదురను గూలిన
దనుజులఁ బెక్కండ్రఁ జూచి దశకంఠుఁడు దాఁ
గనలుచు సూతున కనియెను
జననాయకుమీఁద రథముఁ జన నిమ్మనుచున్.

663-ఆ.

అధిపుఁ డానతిచ్చినట్టుగా సూతుండు
రామచంద్రుమీఁద రథము వఱపె
నపుడు శంఖకాహళాదిరవంబులు
వందిజనులనుతులు సందడింప.

664-వ.

ఇట్లు శతాంగతురంగ హేషారవంబులును బహుళకింకిణీ ఘంటికా నినదంబులును రణనేమిస్వనంబులును దనుజభటాట్టహాసంబులును బోరుకలంగ సంగరరంగంబున కరుగుదెంచు నక్తంచరేశ్వరుండు ధనుర్ధరుండై ప్రతిఘటించు సమయంబున.

665-క.

తన కెదిరించిన రామునిఁ
గని దనుజవిభుండు కినుక గదురఁగ నటఁ జ
య్యన నాగాస్త్రములను దన
ధనువునఁ గీలించి యేసెఁ దనభుజశక్తిన్.

666-క.

అవి లెక్కఁ గొనక పొరిఁబొరి
నవనీనాయకుఁడు గినుక నసురాధిపుపై
దివిజారు లులికి పాఱఁగఁ
బవిసన్నిభ మైన తీవ్రబాణము లేసెన్.

667-సీ.

లంకేశుఁ డవి యెల్ల లక్ష్యంబు సేయక-తిమిరాంబకములు సంధించి యేయ
నిబిడమై చీఁకటి నిండంగఁ బర్వినఁ-గపు లెల్ల నంధులై కళవళింప
నుర్వీశ్వరుం డంప నుగ్రబాణంబుల-నంధకారం బంత నడఁగఁ జేసి
వాసవారాతిపై వహ్నిబాణము నేయ-నాతండు రౌద్రాస్త్ర మడర  

రెండు బాణంబులును గూడి గం డెసంగఁ
బెనఁగి యాకాశమున నుండి పృథ్విమీఁదఁ
బడియె నద్భుతగతి జగత్ప్రళయముగను
సురలుఁ గపులును దైత్యులుఁ జోద్యపడఁగ.

   టీక -  గండు- మిక్కిలి, ఎసగు- అతిశయించు, పెనగు- కలియబడు

668-వ.

అట్లు మహాద్భుతకరంబుగా సమరంబు జరుగుచున్న సమయంబున.

669-క.

రామునిమేనను బాణ
స్తోమంబులు నాట నేసె సురరిపుఁ డలుకన్
రాముఁడు ఘననారాచ
స్తోమంబులు నాట నేసె సురరిపుమీఁదన్.

   టీక -  స్తోమము- సమూహము, యజ్ఞము

670-చ.

ధరణిపుమీఁదనుం గనలి దానవనాయకుఁ డేసె నంత భీ
కర శర భోష్ట్ర కాక ఫణి గండక ఘూక బలాక భేక సూ
కర కిరి ఋశ్య కూర్మ శుక గర్దభ భల్లుక నీలకంఠ కే
సరి వృక గృధ్ర కీట బక సైంధవ సైరిభ వక్త్రబాణముల్.

   టీక -  శరభము- మీనగండ్లమృగము; ఉష్ట్రము- ఒంటె; కాకము- కాకి; ఫణి- సర్పము; గండకము- ఖడ్గ మృగము; ఘూకము- గుడ్లగూబ; బలాకము- తెల్లకొంగ; భేక- కప్ప; సూకరము- పంది; కిరి- వరాహము. అడవిపంది; ఋశ్యము- మనుబోతు, సాంబార్, తెల్లని కాళ్ళుండి గుఱ్ఱము వంటిరూపుతో మూడుకొమ్ములు ఉండు మృగము; కూర్మము- తాబేలు, శుకము- చిలుక, గర్దభము- గాడిద, భల్లకము- ఎలుగుబంటి, నీలకంఠము, నెమలి, కేసరి- సింహము, వృకము- తోడేలు, గృధ్రము- గ్రద్ద, కీట- పురుగు, బకము- కొంగ, సైంధవము- గుఱ్ఱము, సైరిభము- కారెనుబోతు, ఎద్దు,

671-వ.

ఇట్లు నిరంతరంబుగాఁ బ్రయోగించిన.

672-చ.

పరువడి మీదవచ్చు పటుబాణచయంబులఁ జూచి రాఘవుం
డరుదుగ వాని నన్నిటి వియత్తలవీథిని ద్రుంచి క్రమ్మఱన్
సురరిపుమీఁద నేసె బలసూదనముఖ్యులు సూచి మెచ్చ ని
బ్బరముగ నగ్నిబాణము నభంబునఁ గీలలు పర్వుచుండఁగన్.

673-వ.

అమ్మహాస్త్రంబువలన.

674-క.

దహన ముఖంబుల శరములు
గ్రహముఖములు గలుగునట్టి ఘనతరశరముల్
మిహిరముఖంబుల శరములు
బహుళముగాఁ గల్గి దైత్యపతిపైఁ బర్వెన్.

675-ఆ.

అంత దానవేంద్రుఁ డాబాణతతు లెల్ల
దృణములట్లు నడుమఁ ద్రించి వైచి
మయునిచేతఁ గొన్న మహనీయ మగునట్టి
శంబరాఖ్య మైనశరము వైచె.

676-క.

ఆశరమున బహుశస్త్రము
లాశుగతిం గలిగి గవియ నన్నిటి నొకటన్
నాశము చేసెను రాముం
డాశాపతు లలర మన్మథాస్త్రముచేతన్.

677-ఆ.

శంబరాఖ్యశరము జగదీశుబాణంబు
వలనఁ జెడక రామువక్ష మడర
నాటె నంతలోన నాకారిపై నేసె
విశిఖతతులు వేయి వేయునెడను.

టీక -   నాకారి- అసురుడు, రావణుడు

678-క.

రావణుఁ డాబాణములకు
వేవేగను ప్రతిఘటించి వేసినశరముల్
చేవ మెయిఁ దాకిఁ వడి ధా
త్రీవలయంబునను బడి ధరిత్రి వడంకెన్.

రావణుని శక్తి ప్రహారముచే లక్ష్మణుని మూర్ఛ

679-ఉ.

తల్లడ మంది రామవసుధాపతి కడ్డము సొచ్చి లక్ష్మణుం
డుల్లమునొవ్వనాటుచు మహోన్నత కోపముతోడ దైత్యుచే
విల్లును నారియుం దునిమివేసి వడిన్ శరసప్తకమ్ముచే
బల్లిదుఁడైన దైత్యకులపాలుని వక్షముఁ దూర్చి యార్చినన్.

680-క.

అంత విభీషణుఁడమరేం
ద్రాంతకు నరదంబుఁ గూల నట నేసిన న
త్యంత జవంబున ధరణికి
గంతుగొనెన్ వడిని బంక్తి కంధరుఁ డలుకన్.

681-వ.

ఇట్లు తన రథంబుఁ గూలనేసిన విరథుండై రావణుండు మయదత్తంబైన శక్తినిఁ బూని తమ్ముని నేయఁ జూచు చున్నంత శరణాగత వజ్రపంజరుండగు రాఘవేశ్వరునితోబుట్టు వగుటంజేసి లక్ష్మణుండు కరుణాపరుండై విభీషణుం దనవెనుక నిడికొని యెదిర్చినం గని నీవు నాపగర కడ్డంబ వైతివి గావున నీవ యీశక్తిచేత హతుఁడవు గమ్మన యేసిన నదియును శతఘంటికా రంజితంబును శతకోటి నినదంబును బావకజ్వాలాభీలకీలాన్వితంబునునై పఱతేరం గని సురేంద్రాది దేవగణంబులు భయంబంది రాముతమ్మునకు దీర్ఘాయు వగుం గావుత మని దీవింప జగంబులు తల్లడిల్ల సముద్రంబులు ఘూర్ణిల్లఁ గులాచలంబులు వడంకఁ జంద్రార్క బింబంబులు దలంక నేఁగుదెంచి సౌమిత్రియురంబునాటి ధాత్రిం బడియె నట్టియవసరమ్మున.

682-సీ.

పంక్తికంధరుఁ డేయుబాణంబు లవి లెక్క-సేయక రఘుకులసింహుఁ డపుడు
తమ్మునిమెయి నాటి ధరణి గాడినశక్తి-నొగి వానరులు తీయ నోపకున్న
నవలీల దాని నొయ్యనఁ దీసి పోవైచి-ఘనులైన కపులను గాపు వెట్టి
నేనె రాఁముడ నైతినేని మజ్జనకుండు-దశరథుం డగునేనిఁ దప్పకుండఁ

గలన నెదిరించి నాతోఁడ గయ్యమునకు
నిలిచె నేనియు దనుజేంద్రు నిజము గాఁగ
నమరు లెఱుఁగంగ జంపుదు నతనిచేతఁ
జత్తు నింతియకాని నే రిత్తమగుడ.

683-వ.

అని మఱియును.

684-క.

రాముఁడు రావణుఁ డనుచును
భూమిపయిని నిర్వురునికి పొసఁగదు సుండీ
నామాట వినుఁడు లెస్సగ
రాముఁడ నే నొండె భువిని రావణుఁ డొండెన్.

685-వ.

ఉండుదు మని వీరాలాపంబు లాడుచు రామచంద్రుండు ధనుర్ధరుండై శరవర్షంబులు గురియించిన నసురేశ్వరుండును బ్రతిశరంబుల వాని నన్నింటినిం దూల నేసినఁ గనలి రామచంద్రుండు తొడిగినయమ్మును వెడలు తూఁపులును విల్లుగుడుసుపడుటయు నెఱుంగ రాని చందంబునఁ బింజపింజంగఱచి పాఱుచుండునట్లుగా హస్తంబు ముడుచుటయుఁ జాచుటయు దెలియరాకుండ రావణు కాలు సేతు లాడకుండ శరలాఘవంబు నెఱపుచు నేయుచున్న యప్పుడు విఱిగి శరీర భూషణంబు లురులఁ గిరీటంబులు డుల్లఁ దలలు వీడ మరలి మరలి చూచుచు మృగేంద్రుం గన్నగజేంద్రుని చందంబున భీతచేతస్కుండై దశముఖుండు లంకాపురంబుఁ జొచ్చెఁ దదనంతరంబున.

686-క.

ఆ వేళ లావు సూపుచు
రావణుచేశక్తి దాఁకి రణరంగమునన్
జేవ సెడి పడిన లక్ష్మణ
దేవున్ డగ్గఱఁగ రామదేవుఁడు వచ్చెన్.

687-వ.

ఇట్లరుగుదెంచి.

688-తే.

రక్తసిక్తాంగుఁడై ధాత్రి శక్తి నాఁటి
యున్న తమ్మునిఁ గనుఁగొని యుస్సు రనుచు
దుఃఖ మంతంత నాఁగక తొంగలింపఁ
దొడలపై నిడి బాష్పముల్ దొప్పదోఁగ.

శ్రీరాముని సంతాపము

689-సీ.

“హా! భానుకులదీప! హా! సత్యసల్లాప! -హా! సుగుణకలాప! హా! సురూప!
హా! ధర్మసంచార! హా! వైరి సంహార! -హా! కీర్తివిస్తార! హా! సుధీర!
హా! నిత్య సుజ్ఞాన! హా! పుణ్యసంధాన! -హా! పూజ్యసమ్మాన! హా! నిధాన!
హా! శౌర్యగుణవృద్ధ! హా! యుద్ధసన్నిద్ధ! -హా! చిత్త సంశుద్ధ! హా! ప్రసిద్ధ!

హా! మునీశ్వరసంరక్ష! యసురశిక్ష!
హా! గుణస్తోత్రసత్పాత్ర! యబ్జనేత్ర!
హా! సదాచారసంపన్న! హా! ప్రసన్న!
యనుచు శోకాతురాత్ముఁడై యంతకంత.

690-క.

జనకుని పంపున నడవికిఁ
జనుదెంచియు నిడుము కోర్చి సన్మునివృత్తిన్
ననుఁ గూడి నడవ నేర్చిన
యనుజన్మా! యెందుఁ బోయితయ్యా! తలఁపన్.

691-క.

వనమునఁ గలఫలమూలము
లనుదినమును భక్తి యుక్తి నర్పింపుచు మ
జ్జనకుని భంగిని నన్నును
జనకజఁ బోషించి యెందుఁ జనితివి తండ్రీ!

692-క.

నీవంటితోడఁబుట్టువు
నీవంటిగుణోత్తరుండు నిజ మూహింపన్
భూవలయమందుఁ గలఁడే
భావింపఁగ నీవెతక్కఁ బావనచరితా!

693-క.

నెఱయక నిద్రాహారము
లెఱుఁగక పదునాలుగేండ్లు హితమతితో మ
మ్మఱిముఱి నరసిన నిన్నును
మఱువ నగునె నీతి గల్గుమనుజుల కెందున్.

694-క.

నిన్నిచట విడిచి పురికిని
జన్నను నినుఁ గన్నతల్లి సనుదెంచి ననున్
నిన్నడుగఁ దడవ మదిలోఁ
జిన్నం బోవుచును నేమి చెప్పుదుఁ దండ్రీ! “

695-వ.

అని మఱియును.

696-చ.

“వినుఁడు కపీంద్రులార! పలవింపుచు మజ్జనకుండు నాకమున్
జనియె ధరాతనూభవ నిశాచరుచేఁ జెఱవోయె నేటితో
ననుజుఁడు దీఱె నింక నడియాసల నుండుట నాకు ధర్మమే
చనుఁడు నిజాశ్రమంబులకు సంశయ మొందక మీరి గొబ్బునన్.”

697-వ.

అని విభీషణుం గనుంగొని.

698-ఉ.

“అక్కట! నీకు నింటఁ గలయట్టి సుబాంధవకోటిఁ బాసి నీ
విక్కడ కేఁగుదెంచితి వహీనముదంబున మమ్ము నమ్మి పెం
పెక్కఁగ రావణుండు తగ నేలెడిలంకఁ గడంగ నీకు నేఁ
దక్కఁగ నిత్తునన్ ప్రతిన దప్పె విభీషణ! నీవు పోవుమా.

699-వ.

అని యనేక ప్రకారంబులఁ బ్రలపించుచున్న రామభూపాలునకు సుషేణుం డిట్లనియె.

700-ఉ.

దేవర! నీకు నీగతి మదిం దలపోయఁగ నేల తీవ్ర మై
రావణు చేతిశక్తి బవరంబున నాటుటఁజేసి లక్ష్మణుం
డీవిధిఁ నుండెఁగాని ధరణీశ్వర! చూడు ముఖారవిందమున్
జావఁడు సావఁ డియ్యెడ నిజంబుగ నమ్ము మనంబులోపలన్.

701-ఉ.

పున్నమ చందురుందెగడి పొల్పెసలారెడి మోముఁదమ్మియున్
గన్నులు కల్వఱేకులను గాంతి జయించెడుఁ గాని రక్తిమన్
జెన్నుదొలంగియుండ వఱచేతులుఁ బాదములున్ దలంపఁగా
నున్నవి వర్ణముల్ గలిగి యొప్పుతొఱంగదు రాఘవేశ్వరా!

702-వ.

అని విన్నవించుచు హనుమంతుఁ గనుంగొని సుషేణుం డిట్టులనియె.

సంజీవనికై హనుమ పయనము

703-క.

” ఈయన ప్రాణము లెత్తఁగ
వాయుజ! యలనాఁటిమందు వడిఁ దేవలె నీ
వీయెడ నచటికిఁ దడయక
పోయి వెసన్ రమ్ము ప్రొద్దు పొడువక మునుపే.”

704-వ.

అనిన భూకాంతుండు హనుమంతున కిట్లనియె.

705-క.

“రమ్మా వాయుతనూభవ!
యిమ్మహి సత్కీర్తిఁ బడయు మీతని ప్రాణం
బిమ్ముగ రక్షింపుము నా
తమ్ములలో నీవు నొక్కతమ్ముఁడ వరయున్.”

706-వ.

అని డాయం జని కౌఁగిటం జేర్చి దీవించి యంపె నప్పుడు.

707-ఆ.

పదము లూనఁ ద్రొక్కి వదనంబు దిగఁ జూచి
చేతు లూని నడుము చిక్కఁబట్టి
క్రుంగి నిక్కి యెగసి కుప్పించి వడి దాఁటి
చనియె గగనవీధి ననిలసుతుఁడు.

708-వ.

అట్టి సమయంబున.

కాలనేమి కపటోపాయము

709-సీ.

దనుజేశుఁ డావార్త విని కాలనేమిగే-హము సొచ్చి నడిరేయి యతనితోడఁ
తనచేత హతుఁ డైన ధరణీశు తమ్ముని-ప్రాణంబు లెత్తంగఁ బవనసుతుఁడు
సనుచున్న యట్టియాపని విఘ్న మొనరింపఁ- గ్రక్కున నటఁ బోయి రమ్మటంచుఁ
గాలనేమి యిదేటి కార్యంబు తగ దన్న-వినక కోపించిన వేగ నరిగి

ద్రోణ శైలంబు చేరువత్రోవయందు
వనముఁ గావించి తగ మునీశ్వరునిరీతి
జపము సేయుచుఁ గన్నులు చక్కమూసి
నడుము నిక్కించి పద్మాసనమున నుండె.

710-వ.

అప్పు డాకాశమార్గంబునఁ జనుచున్నయప్పవనసుతుండు వనంబుగాంచి త్రోవ దప్పె నని మనంబున సందియ మొంది యమ్మునీంద్రు నడిగి చనువాఁడై యతనికి నమస్కరించి యిట్లనియె.

711-తే.

“మునినాథ! నేను రాముని
పనికై చనుచున్న వాడఁ బరమౌషధముల్
గొని రావలె మది భావిం
చి నిజమ్ముగ నిపుడు త్రోవ సెప్పుము నాకున్.”

712-వ.

అని ప్రార్థించి దాహోపశమనంబున కుదకంబు వేఁడిన నక్కపట మునీంద్రుం డిట్లనియె.

713-ఆ.

“పవనతనయ! రామభద్రునిపని మాకుఁ
దీర్పవలయుఁ గాన నేర్పుతోడఁ
బ్రాణరక్షకొఱకు ద్రోణాద్రి కరుగంగ
వలదు వినుము నాదువనమునందు.

714-తే.

ఘనతరం బైన సంజీవి కరణి మొదలు
గాఁగ దివ్యౌషధంబులు గలవుగానఁ
గొంచుఁ బోవచ్చుఁ గావునఁ గోరుపండ్లు
తనివి దీఱంగఁ దిని నీళ్ళు త్రాగుమిచట.”

715-వ.

అని తనహస్తంబున నున్న విషయుక్తం బైన కమండలూదకంబు చూపినం గని హనుమంతు డవి చాల వనిన నక్కపటమునీంద్రుండు క్రూరమకరావృతం బైన కమలాకరం బొకం డెఱింగించి పొమ్మనినఁ బవనాత్మజుండుసని.

716-క.

విమలమకరందలుబ్ధ
భ్రమరనికరపక్షపవనపరికంపితస
త్కమనీయ కుముద కైరవ
కమలంబులు గలుగుకొలనుఁ గనుఁగొని యచటన్.

శాప విముక్తయై దేవకన్యయైన మొసలి

717-సీ.

మడుగుఁ లోపలఁ జొచ్చి కడుపార నుదకంబు- గ్రోలంగ దిగ నందుఁ గ్రాలు మొసలి
పాదముల్ కబళించి పట్టినఁ జరణముల్-విదళింపఁ బట్టూని విడవకున్న
గడుసూక్ష్మరూపుఁడై కడుపులోపలఁ జొచ్చి-వేగంబ భేదించి వెడలె నంత
నది దేవకన్యయై యాకాశముననుండి-తనదు వృత్తాంత మంతయును జెప్పి

వీఁడు దైత్యుండు నమ్మకు వీనిఁ జంపి
పొమ్ము సంజీవికొండకుఁ బ్రొద్దు గలుగ
నీకతంబున శాపంబు నాకుఁ దీఱె
ననుచు దీవించి చనియెఁ దా నమరపురికి.

718-వ.

అంత హనుమంతుడు తేజోవంతుండై యరుగుదెంచి కపటసంయమినిం గనిన నతండిట్లనియె.

కాలగతి చెందిన కాలనేమి

719-చ.

“తడసితి వేల యింతవడి దాపుననే వసియించినట్టి యీ
మడుగున కేఁగి రాకునికి మాకనుమానము దోఁచెనయ్య! యి
ప్పుడు గలదేనిఁ గొంత గురుపూజకు విత్తము కాన్క వెట్టి నీ
వడుగుము మందులెట్టివి ప్రియం బగునట్టివి నీకు నిచ్చెదన్.”

720-చ.

అనవుడుఁ గోపమెత్తి పవనాత్మజుఁ డప్పుడు “నీకుఁ బూజ గొ”
మ్మని యురుముష్టిచేఁ బొడువ నాతఁడు డీకొని పక్షిరూపుఁడై
తనుఁగదియంగవచ్చుటయు దాని నపక్షముగాఁగ ద్రుంచినన్
గినిసి మృగేంద్రుఁడై పొడువఁ గేసరిపుత్త్రుఁడు దానిఁ గూల్చినన్.

721-తే.

అంత సుగ్రీవుఁడై వచ్చి “యనిలతనయ!
బ్రతికె సౌమిత్రి మందులపని తలంప
వలదు ర” మ్మని నన్ను భూవరుఁడు పనిచె
మగిడి పోదము పద మన్నమాట వినుచు.

722-వ.

సుగ్రీవుం డని విచారించి కాకుండు టెరిఁగి వాని బాహుమధ్యంబునఁ బొడిచిన నతం డారూపంబు విడిచి శతశృంగుండై నొప్పించిన నలిగి జగత్ప్రాణ నందనుండు వాలంబున నడిచి కరంబులు ఛేదించి శిరంబుఁ ద్రుంచివైచి సింహనాదంబు చేసి జయలక్ష్మిం గైకొని.

హనుమంతుఁడు పెకలించి తెచ్చిన సంజీవని పర్వతము

723-క.

ద్రోణాగ్రి కేఁగి మందులు
పోణిమి నీకున్నఁ గినిసి పొల్పలరఁగ నా
క్షోణీధర మగలింపుచుఁ
బాణితలాగ్రమునఁ బెట్టి పట్టుకరాఁగన్.

724-సీ.

కావలి యున్నట్టి గంధర్వగణములు-పదునాల్గువేలు కోపంబుతోడ
నాహవం బొనరింప నందఱ నచ్చోట-వాలముఖంబున వసుధఁ గూల్చి
గగనమార్గంబునఁ గడుతీవ్రగతితోడఁ-బోవ నందిగ్రామపురమునందుఁ
దైలయుక్తం బైన తలలతోఁ బొరలాడ-గలిగిన రామలక్ష్మణుల తెఱఁగు

భరతుఁ డారాత్రి కలఁ గని భయము దోఁచి
తొడరి దుస్స్వప్న దోషంబు దొలఁగి పోవ
విప్రవరులకు దానముల్ వేడ్కనిచ్చి
వెలుపలను నున్న భరతభూవిభునిఁగాంచి.

725-తే.

రాముఁడే యంచు నూహించి రాముఁ డేల
వచ్చు నిచటికి సౌమిత్రి వనచరులను
జనకనందనఁ దగ డించి జగ మెఱుంగఁ
బరగఁ జంపక రా నేమిపని తలంప.

మాల్యవంతుని మరణము

726-వ.

అని యిట్లు సందియంపడి కాఁడని నిశ్చయించి యంత హనుమంతుండు దక్షిణపాథోనిధి దఱియం జనునప్పుడు దశాననుపంపున సేనలఁ గూడి మాల్యవంతుం డెదిరించి శస్త్రాస్త్రంబులు గురియించి నొప్పించినం గని వాతూల సంభవుండు వాల మల్లార్చి యార్చిపేర్చి దనుజబలంబులఁ జలంబునం దఱిమి వాలముఖంబున గళంబులు పట్టి నానాముఖంబులం బాఱవైచినన్‌ గని మాల్యవంతుండు తీవ్రశరంబుల నొప్పించిన నడరి యద్దానవేంద్రుని కంఠంబున వాలంబుంగీలించి గిరంగిరం ద్రిప్పి సముద్ర మధ్యంబునఁ బడవైచిన వాఁడును బాతాళంబునకుం జనియె నాక్షణంబ.

727-తే.

మాల్యవంతునిఁ బోకార్చి మానుషమున
గగనమండలఁ మందందఁ పగులనార్చి
వచ్చునప్పుడు శతకోటివారిజాప్త
దీప్తిఁ గనుపట్టెఁ బ్రాచీనదిక్కునందు.

728-వ.

ఇట్లు వెలుంగుచున్న మహౌషధాచలంబు దివ్యదీప్తులు గనుంగొని రాఘవేశ్వరుం డది సూర్యోదయం బని మనంబునఁ దలంచి కపిరాజున కిట్లనియె.

729-చ.

“అదె కనుఁగొంటిరే కలయ నర్కుఁడు పూర్వగిరీంద్ర శృంగమం
దుదయమునొందె నింక నిటనుంచినఁ దమ్ముని ప్రాణవాయువుల్
బ్రదుకుట దుర్లభం బకట! పల్మఱు మ్రొక్కెడు ప్రొద్దె మాకుఁ దా
నదయత శత్రుఁడయ్యెఁ గపులార వినుండిదె మీకుఁ జెప్పెదన్.

730-తే.

మాకులంబున కెల్లను మహినిఁ దలఁపఁ
దానె కర్తయై యుండియు ధర్మ మగునె
యుదయ మందంగ మనుమఁ డిట్లున్న యెడను
గొసరి చుట్టాలుఁ బగవారిఁ గూడవలెనె.

731-క.

ఈ లాగునఁ దాఁ బొడిచిన
మా లక్ష్మణు ప్రాణ మేల మగుడును భానుం
గూలఁగ నేసెద విల్లును
గోలలుఁ దె” మ్మనుచు నందికొనునాలోనన్.

732-వ.

రామచంద్రునకు జాంబవంతుం డిట్లనియె.

733-ఉ.

“భానుఁడు కాఁడు చూడు నరపాలక! మందులకొండదీప్తు లీ
మానము దోఁచెఁగాని యనుమానములేదు వినుండు వేడ్కతో
వానరసేన నింకెదురు వాయుతనూజుని గారవింపఁగా
మానవనాథ! పంపు మనుమాత్రనె వచ్చెనతండు తీవ్రతన్.”

734-క.

అనిమిషులు సన్నుతింపఁగ
హనుమంతుఁడు ద్రోణశైల మతిశీఘ్రముగాఁ
గొని వచ్చి నిలిచి రఘురా
ముని శ్రీపాదముల కెలమి మ్రొక్కినయంతన్.

లక్ష్మణుఁడు సంజీవనిచే మూర్ఛదేరుట

735-వ.

రామచంద్రుం డతనిం గౌఁగిలించుకొని సుషేణుం జూచి నీ విందలి దివ్యౌషధంబుల వలన సౌమిత్రి ప్రాణంబులు తేర్పుమనిన నయ్యధిపు నాజ్ఞ శిరంబునఁ దాల్చి వనచర సహితుండై పర్వతం బెక్కి తొల్లి దేవత లమృతపానంబు చేసిన తావును నారాయణుండు మోహినీరూపంబున నమృతము పంచునప్పుడు సూర్యచంద్రులనడుమ నిఱికిన రాహువు శిరంబుఁ ద్రుంచిన తావును బలిచక్రవర్తి యాగంబు చేసిన తావును రాక్షసులు జన్మించిన తావును శంకరభగవానుండు పర్వతరాజు కూఁతును బెండ్లియాడిన తావును వానరులకుం జూపుచు నగ్గిరీంద్రంబుపై నున్న యౌషధంబులు గొనివచ్చి ప్రయోగింప నాయౌషధముల సామర్థ్యంబునం జేసి లక్ష్మణునకుఁ బ్రాణంబులు మగుడ వచ్చె నంత సకల వానరులు నానందసాబ్ధిందేలి రప్పుడు సౌమిత్రి రామునకు నమస్క్జరించిన రామచంద్రుండు కౌఁగిటం జేర్చి హనుమంతుం డొనరించిన యుపకృతికి సంతోషించి యీ పర్వతంబును దొల్లింటి యునికినే యుంచి రమ్మనిన నతం డట్లు కావించెనని నారదుండు సెప్పిన వాల్మీకి మునీశ్వరుం డట మీఁది కథావిధానం బెట్టి దని యడుగుటయు.

ఆశ్వాసాంత పద్య గద్యములు

736-క.

జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా!

737-గ.

ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహా కావ్యంబునందు యుద్ధకాండమున ద్వితీయాశ్వాసము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Intro

 Ramayana is a Sanskrit epic ithihasa, that happened like this, story of Indian Subcontinent. It finely reflects the Indian values to fulles...