అరణ్య కాండము
167-క.
మునిదత్త ధనుర్వేదా!
మునినాథప్రియసతీ సుపూజిత పాదా!
జనకార్చిత గుణధామా!
సనకాదిస్తవ్యనామ! జానకి రామా!
168-వ.
శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి
కెఱింగించిన తెఱంగు వినిపించెద.
పంచవటిలో సీతా రాముల
మధుర జీవనము
169-చ.
"ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనొ? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి
దుర్దశల్
ప్రతివసియించు టెట్లొ? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁ ద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత
లమ్మహాత్ములన్.
170-సీ.
నడువనేరని కొమ్మ యడుగులు పొక్కులై-శర్కర స్థలముల శ్రమముఁ జెందె,
వీచిన చేతుల వ్రేళ్ళు నెత్తురు
గ్రమ్మి-పొటమర్లు కెంపుల పోల్కి నమరె
వడి గాలి సుడివడి వాడిన లేఁదీఁగ-భావంబునను మేని చేవ తఱిగెఁ,
బూర్ణ చంద్రుని కాంతి పున్నమ వేకువఁ-గనుపట్టు గతి మోము కళల విడిచె.
ధవుని నడుగడుగునకుఁ గైదండఁ గొనుచు
నెగడు దప్పిని
నిట్టూర్పు లెగసి చిగురుఁ
బెదవు లెండఁగ, నీడకు నుదిలగొనుచు
మనసులోఁ జేవ యూఁతగఁ జనెడు వేళ.
టీక : శర్కర- గులకరాయి, ధవుడు -భర్త, ఉదిలగొను-
తత్తరపడు, తపించు
171-వ.
ఇట్లా సీతయు రాముండును సత్యఋషిం బోని
సౌమిత్రియుఁ గతిపయ ప్రయాణంబులఁ బంచవటికిం జని, సంతోష భరితాంతరంగులై,
172-క.
అచ్చటఁ గొన్ని దినంబులు
ముచ్చటపడి యుండఁ దలఁచి ముని ముఖ్యులచే
మచ్చికఁ దమ్ముఁడుఁ దానును
గ్రచ్చఱ నొక పర్ణశాలఁ గావించి తగన్.
173-ఆ.
అందు రామచంద్రుఁ డనుజన్ముఁడును దాను
గొన్ని వాసరంబు లున్నవేళ
వికృత వేషధారి వేవేగ నట శూర్ప
ణఖ యనంగ దైత్య నారి యోర్తు.
టీక : అనుజన్ముడు - తమ్ముడు, వాసరంబులు - దినములు
శూర్పణఖ రామలక్ష్మణుల
మోహించి పరాభూతురాలగుట
174-వ.
రాముని గని ప్రేమాభిరామం బగు మనంబునఁ
దన్నుఁ గామించి రమ్మనిన, రామచంద్రుండు సౌమిత్రిం జూప, నతఁడు మున్ను మా యన్న నభిలషించుటంజేసి
నాకు దోషంబు గాన నీ వా రాముని కడకు మరలఁ జనుమన్న నది యట్లచేసిన, రామచంద్రుండు తిరుగ లక్ష్మణుం
జూపినఁ గోపించి యా రాక్షసి మనుజేంద్ర సూనుల దండింప దలంచిన నెఱింగి, భరతానుజుండు దాని
నాసికా కర్ణంబులు గోసివైచిన నది నెత్తురు జొత్తిల్లఁ బసిపాపయుం బోలి యేడ్చుచు ఖర
దూషణాది సోదరులకుం జెప్పిన వారు గనలి రాక్షణంబున.
175-క.
పదునాల్గు వేల దైత్యులు
మదమున సోదరులు గొల్వ మండుచు శూరా
స్పద మగు రథ నికరముతోఁ
గదనంబున రాము కడకు ఖరుఁ డేతెంచెన్.
ఖర దూషణాది రాక్షస
సంహారము
176-ఆ.
ఖరుఁడు వచ్చినట్టి కలకలం బాలించి,
రాఘవుండు తనదు రమణియొద్దఁ
దొలఁగ కుండ ననుజుఁ దోడుగాఁ గాఁపుంచి,
బెదర కంతఁ గలని కెదిరి నిలిచె.
టీక : కలను - యుద్ధము
177-శా.
ఆ వేళన్ ఖరుఁ డుగ్రవృత్తి
లయకాలాభీల ఘోరాకృతుల్
దైవారన్, గజవాజి సంఘములతో, దైత్యాళితో, భూరి రో
షావిర్భూత మనస్కుఁడై నడిచె
గర్వారంభ సంరంభుఁడై
దేవవ్రాతము భీతి నొంది
కలఁగన్ దేజంబు సొంపారఁగన్.
టీక : దైవారు - పొంగిపొరలు, నడచు - దండువెడలు
178-వ.
ఇట్లు ఖరుండు సనుదెంచి భయంకరంబుగా రణంబు
సేయు సమయంబున.
179-ఉ.
అప్పుడు రామచంద్రుఁడు భయంకర రౌద్ర రసంబు
కన్నులన్
నిప్పులు రాల్చుచున్ నెరయ, నిర్జరులార్వ, విచిత్ర శస్త్రముల్
కుప్పలుగాఁగ నేయుచును, గుంజరవాజి రథావళుల్ ధరన్
దప్పక కూల్చుచున్, రుధిరధారలఁ దేల్చె సురారి
సంఘమున్.
180-వ.
అట్టి సమయంబున.
181-క.
కరితురగస్యందనములుఁ
బరివారముఁ దెగిన పిదపఁ బటు రోషమునన్
గరకర పడుచును నెదిరిన
ఖరకరవంశజుఁడు ద్రుంచె ఖరుని శిరంబున్.
టీక : ఖరకరవంశజుడు - సూర్యవంశజుడు, ఖరుడు - విశ్రవసుకు రాక
యందు పుట్టిన కొడుకులు ఖరుడు దూషణుడు త్రిశిరసుడు. ఖరుడు దండకారణ్య మందలి జనస్థానమందలి
సేనకు అధిపతి, దూషణుడు త్రిశిరసుడు ఖరునికి సహాయులు.
182-వ.
త్రుంచినం గని తీండ్రంబుగా.
183-క.
ఘోషించి, రామచంద్రుని
దూషించుచు వచ్చినట్టి దూషణు మీఁదన్
రోషించి, సురలు కడు సం
తోషింపఁగ వాని కరముఁ ద్రుంచెఁ గడంకన్.
184-ఆ.
త్రిశిరుఁ డంతఁ గనలి దివ్యాస్త్ర సంపద
రాముమీఁద జూపి రణ మొనర్చె,
మూఁడు శరము లతఁడు ముదలించి యట వాని
మూఁడు తలలఁ ద్రుంచె మొగ్గరముల.
టీక : త్రిసురుడు - విశ్రవసు రాకయందు
పుట్టిన కొడుకులలో మూడవవాడు. వీని అన్నలు ఖరుడు దూషణుడు. ఖరుడు జనస్థానమందలి సేనకు
అధిపతి దూషణుడు, త్రిశిరసుడు ఖరునికి సహాయకుడు.
185-వ.
ఇట్లు ఖరాది రాక్షసుల శిక్షించి, జయంబు గొని, ధను వెక్కుడించి, మరలి పర్ణశాల కేతెంచి, తమ్ముఁడును దానును
సమ్మదంబునం గలసియున్న సమయంబున.
శూర్పణఖ వలన సీతా
సౌందర్యమును విన్న రావణుని కామాంధత
186-చ.
చలమున నంత శూర్పణఖ సయ్యన లంకకు నేఁగి, రావణుం
గొలువునఁ గాంచి మ్రొక్కి, తనకున్ నృపసూనులు సేసినట్టి
చేఁ
తలు వినుపించి, వారు తమ తండ్రి యనుజ్ఞను వచ్చి, కానలో
పలఁ దిరుగాడు చందములుఁ బన్నుగ నేర్పడఁ జెప్పి పిమ్మటన్.
టీక : చలము - ద్వేషము, శూర్పణఖ- చుప్పనాతి,
రాక్షసి, రావణుని చెల్లెలు, ఈర్ష్య, పట్టుదల, కంపము
187-క.
ఆరాము భార్య విభ్రమ
మే రాజకుమార్తెలందు నెఱుఁగము విని మున్
ధారుణిలోపలఁ గామిను
లా రమణికి సాటి పోల రభినుతి సేయన్.
టీక : అభినుతి - మిక్కిలిపొగడు
188-సీ.
కన్నులు కలువలో? కాము బాణంబులో? -తెలివిగా నింతికిఁ దెలియరాదు
పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల-పలుకులో? నాతి కేర్పఱుపరాదు
అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము-తెంపులో సతికి భావింపరాదు
కుచములు బంగారు కుండలో? చక్రవా-కమ్ములో? చెలి కెఱుఁగంగరాదు
కురులు నీలంబులో? తేఁటి గుంపు లొక్కొ
పిఱుఁదు పులినంబొ? మన్మథు పెండ్లి యరుఁగొ?
యనుచుఁ గొందఱు సంశయం బందుచుండ
వెలఁది యొప్పారు లావణ్య విభ్రమముల.
189-క.
కలదో! లేదో! యనుచును
బలుమఱు నెన్నడుముఁ జూచి పలుకుదు రితరుల్,
బలిమో! కలిమో! యనుచును
బలుమఱు జఘనంబుఁ జూచి పలుకుదు రితరుల్.
190-సీ.
షట్పదంబుల పైకి సంపెంగ పువ్వుల, -జలజాతముల పైకిఁ జందమామఁ,
గిసలయంబుల పైకి వెసఁ గలకంఠముల్, -సింధురమ్ములపైకి సింహములను,
దొండపండుల పైకి దొడ్డ రాచిలకల, -నలరుఁ దూఁడుల పైకి హంసవితతిఁ,
బండు వెన్నెల నిగ్గు పైకిఁ జకోరముల్, -పవనంబు మీఁదికి బాపఱేని,
మరుఁడు వైరంబు చేసిన మాడ్కి, నలక
నాసికా కరానన చరణస్వనములు
వర పయోధర మధ్యోష్ఠ వచన బాహు
గమన హాసాక్షు లూర్పారు రమణి కమరె.
191-క.
బంగారు నీరు నిలువునఁ
బొంగారుచు నుండ నజుఁడు వోసిన మాడ్కిన్,
శృంగార మెల్ల నిలువునఁ
బొంగారుచు నుండుఁ గరఁగి పోసిన మాడ్కిన్.
192-వ.
అట్టి వయోరూపంబులను గనుపట్టునట్టి
యక్కాంతారత్నంబు నీకు సిద్ధించెనేని నీవు త్రిభువనంబులు విజయంబు చేసిన యంతకన్నను
సంతసింతువన్న విని, కామాశుగంబులం దగిలి, కామాంధుండై కన్నులుగానక యన్నుకొని తన్నుఁదా మఱచి, యొడ్డోలగంబు సాలించి, పుష్పకంబను
విమానరత్నంబుపై నధిష్ఠించి, మారీచు కడకుం జని, ప్రార్థించి, "నీవు కనకమృగంబవై జనస్థానబునకుం
జని, దశరథనందనుండగు శ్రీరాముం డున్న పర్ణశాల కడం బొడకట్టిన, నతండును నిన్ను
వెనుకొను, నీవు నతని నతి దూరంబుగాఁ గొనిపోయి మాయంబైన, నేను రాముని భార్యం గొనివత్తు" ననిన
విని సమ్మతిలక మాఱుత్తరం బిచ్చిన, రావణుం డుగ్రుండై మండిపడ, నతం డా సన్న యెఱింగి, కనకమృగ రూపంబును
దాల్చె నాక్షణంబున.
193-క.
ఒడ లెల్లను బంగారము,
పొడ లెల్లను రత్న సమితిఁ బోలిన మెఱపుల్
నడ లెల్ల నెఱపి మెలఁగెడు
కడ లెల్ల విలాసరేఖ కళలం దొప్పెన్.
194-వ.
ఇట్లు కనకమృగాకారంబు గైకొని పర్ణశాల
కడకుం బోయి మెలంగునప్పుడు.
195-క.
కనియును వినియును నెఱుఁగము
కనకమృగం బనుచు వేడ్క గడలుకొనంగన్
గనఁగ, మృగం బద్భుత మిది
కనకమృగం బేమి సేయఁగలదో మీఁదన్.
196-వ.
అని కనుఁగొన్న మునిజనంబులు మనంబులం
దలంకునెడ, నా మృగంబును మృగనేత్ర యగు ధాత్రీపుత్రి గని దాని నభిలషించిన, నా సన్న యెఱింగి
సౌమిత్రిని భూమిజకుం దోడిడి, శ్రీరామచంద్రుండు దాని వెనుకొని చనుచున్న యవసరమ్మున,
టీక : ధాత్రీపుత్రి - జానకిదేవి
రాముఁడు బంగారు
జింకను వెన్నంటి తరుముట
197-సీ.
తనుఁబట్ట నొయ్యన వెనుకొని చనుదెంచు-నిలఱేని తలఁపుఁ దాఁదెలిసి తెలిసి,
చేరువ మెలఁగుఁచుఁ బూరిమేయుచు డాసి-మెల్లన యంతంత మెలఁగిమెలఁగి,
తన నీడఁ గనుఁగొని తానె దిగ్గన దాఁటి-భయమునఁ బరువెత్తి పఱచి పఱచి,
యెడరైనఁబోవక యెలయించి కనుఁగొన్నఁ-దరువుల నొయ్యననొరసి యొరసి,
చెవులు నిక్కించి
చూచుచుఁ జెలగిఁ చెలఁగి
పోవ, రాముండు దవ్వుగాఁ బోయిజూచి
యెలమి మాయామృగం బని యెఱిఁగి మదిని
దీనిఁ జంపుదుఁగా కని తెగువ చేసి.
198-క.
ఏచిన కినుకను బలు నా
రాచము సంధించి డాసి రాఘవుఁ డా మా
రీచుని దైత్యాధముఁ గుల
నీచునిఁ గూలంగ నేసె నిర్జరు లలరన్.
టీక : ఏచిన - చెలరేగిన
199-వ.
వాఁడునుం గూలు నవ్వేళ "హా!
లక్ష్మణా" యను రవంబుం జేసిన నా ధ్వని విని జనక నందన మనంబున నులికి లక్ష్మణుం
బిలిచి "మీ యన్న కేమి కీడు వాటిల్లెనో కాని నిన్నుఁ దలంచె, నీవునుం బోయి మీ యన్న
కుశల స్థితిం దెలిసికొని ర" మ్మనిన నతండు తలంకక నామెతో నిట్లనియె,
200-ఉ.
“ఏమిటి కింత భీతి మది? నీ వగ తోఁచుట యేమి నీకు? నో
భామిని! రామునందు నొక భారము చెందదు, చెందెనేనియున్
భూమి వడంకదే? నభము బోరన మ్రోయదె? వార్ధు లింకవే?
తామరసాప్త సోమ గ్రహ తారకలెల్లను నేల డుల్లవే?
201-ఉ.
అంత పనయ్యెనేని, దనుజాంతకు, నంతకు, మన్మథాంతకున్
బంతము మీఱఁగా గలఁచి, పన్నగమర్త్యసురేంద్ర
లోకముల్
బంతులు గట్టియూడ్చి, రిపు భంజను రాముని గందకుండ న
ర్పింతును నీకుఁ దెచ్చి, మది భీతినిబొందకు మమ్మ
జానకీ!”
టీక : దనుజాంతకుడు - విష్ణువు, అంతకుడు - యముడు, మన్మంథాంతకుడు - శివుడు, పన్నగ మర్త్య సురేంద్ర
లోకములు - ముల్లోకములు
202-వ.
అని లక్ష్మణుండు పలికిన విని, జనకరాజనందన కినిసి, వినరాని మాటలం
దూలనాడిన, మనంబునం గందికుందుచు, శ్రీరామచంద్రుం డేఁగిన మార్గంబున చనియె, నంత నిక్కడ.
రావణుఁడు సన్యాసి
వేషమున సీత నపహరించుట
203-క.
సన్యాసి వేష మలరఁగ
నన్యాయము తలఁచుకొనుచు నసురేంద్రుఁడు దాఁ
గన్యారత్నముఁగని సౌ
జన్యమునన దీవన లిడె శాంతము దోఁపన్.
204-క.
దీవించుడు, మునియే యని
భావింపుచుఁ జేర వచ్చు భామిని, నపు డా
రావణుఁడు రథము మీఁదికి
వే వేగము తిగిచి గగన వీథిని జనియెన్.
205-వ.
అయ్యవసరంబున.
206-ఆ.
అసుర గొంచుఁ బోవ నవనీతనూభవ
వెఱచి పలికె దిశలు వినఁగ నంత
“సీత నాదు పేరు, శ్రీరాముభార్యను
నన్నుఁ గావరయ్య మిన్న కిపుడు”
207-వ.
అని మఱియును,
208-ఆ.
" దేవగణములార! దిక్పాలవరులార!
వృక్షజాతులార! పక్షులార!
కుటిల దానవుండు గొంపోవుచున్నాఁడు
కరుణతోడ నన్నుఁ గావరయ్య!"
రావణుని నిరోధించిన
జటాయువు
209-ఆ.
అనుచుఁ బలుకుచున్న నా యార్తనాదంబు
విని జటాయు వనెడి విహగ నాథుఁ
డరుగుదెంచి, కలహ మత్యుగ్రముగఁ జేయ
రావణుండుఁ బక్షిరాజుఁ దాకెఁ.
210-చ.
అసుర విభుండు వైచు నిశితాస్త్ర ముఖంబుల నొచ్చి, పక్షియున్
గొసరక దైత్య నాయకుని గుండెను నొవ్వఁగ దన్న, నంతలోఁ
గసరి నిశాచరుండు కరఖడ్గముఁ ద్రిప్పుచు
బక్షయుగ్మమున్
వసుధ బడంగఁ ద్రుంచి, కడు వైళమ లంకకు నేఁగు
నత్తఱిన్.
211-క.
వనచరు లొక గిరి చేరువ
వనమునఁ జరియింపఁ జూచి వసుధా సుతయున్
దన చీర కొంగు తునకను
దన సొమ్ములు మూట గట్టి ధరపై వైచెన్.
212-క.
అంతట దైత్యుఁడు లంకకుఁ
బంతముతో నేఁగి శింశుపా తరు క్రిందన్
సంతసమున నిడి, దానవ
కాంతల నవనిజకుఁ దోడు కావలి యుంచెన్.
213-ఉ.
అత్తఱి రాఘవుండు తను నాసలఁ బెట్టుచుఁ గొంచుఁ
బోవఁగాఁ
జిత్తము నొచ్చి, యా మృగము శీఘ్రమునం బడనేసి, దాని మై
తిత్తినిఁ దీసి వింటి కొనఁ దెచ్చెడి వేళఁ, బయోజమిత్ర వం
శోత్తముఁడుల్కఁ, గానఁబడె నొక్కెడ లక్ష్మణుఁ డన్న
దృష్టికిన్.
టీక : పయోజమిత్రవంశోత్తముడు -
సూర్యవంశోత్తముడు
214-చ.
పొడగని గుండె ఝల్లుమన బుద్ధిఁ గలంగుచు
రామచంద్రుఁ డ
య్యెడఁ గడు నుగ్రుఁడై పలికె “నీ విటు నా కడ కేల వచ్చి? త
క్కడ నినుఁ బర్ణశాల కడఁ గావలి యుంచిన చోట, నొంటిమైఁ
బడఁతుక డించి రాఁదగునె వన్య మృగోత్కర మధ్య
సీమకున్"
215-ఆ.
అనుచుఁ బలుకుచున్న యన్నకుఁ బ్రణమిల్లి
వినయ వాక్య ఫణితి విన్నవించె,
జనకతనయ పలుకు చందంబు మొదలెత్తి
లవముఁ దప్పకుండ లక్ష్మణుండు.
216-వ.
చెప్పిన మాటలు విని, విన్నఁ దనంబునఁ జిన్నఁ
బోవుచు దుర్నిమిత్తంబులం గనుచుఁ దత్తరంబున నాశ్రమంబునకుఁ జని యక్కడ.
సీతను గానని
శ్రీరామచంద్రుని విరహాతిశయము
217-ఆ.
పర్ణశాలలోనఁ బరికించి పరికించి
సీత కానఁ బడమిఁ జిన్నవోయి,
చిత్తమంతఁ గలఁగి, శ్రీరామచంద్రుండు
పలువరింపఁజొచ్చె బ్రమసి బ్రమసి.
218-సీ.
నీ దృగ్విలాసంబు నెఱి నభ్యసించెడు-గురుకుచఁ గానవే హరిణవిభుఁడ?
నీ మంజులాలాప నిచయంబుఁ గైకొన్న-సుకుమారిఁ గానవే పికకులేంద్ర?
నీ నిండు సత్కాంతి నెమ్మోము గలయట్టి-రుచిరాంగిఁ గానవే రోహిణీశ?
నీ పక్ష విస్ఫూర్తి నెనయు ధమ్మిల్లంబు-గల యింతిఁ గానవే యళికులేశ?
స్తన భరంబున నీ పోల్కిఁ దనరినట్టి
యతివఁ గానవె చక్రవాకాధినాథ?
నెఱయ నినుఁ బోలు నెన్నడ నేర్చినట్టి
రమణిఁ గానవె నీవు మరాళరాజ?
టీక : పికము - చిలుక, రోహిణీశుడు - చంద్రుడు, అళి - తుమ్మెద, నెన్నడచు - నెఱ నడచు, చక్కని నడక, మరాళరాజు - రాజహంస
219-సీ.
ఘనసార భూజంబ! కానవే నీ వంటి-గంధంబు గలయట్టి కరటియానఁ?
గదళికా తరురాజ! కానవే నీ యట్టి-మెఱుఁగుఁ బెందొడల మా మీననేత్ర?
విలసిల్లి చంపక వృక్షంబ! కానవే-లలి నీదు పుష్ప విలాస నాసఁ?
గమనీయ లత! నీవు కానవే నీయట్టి-కరములు శోభిల్లు కంబుకంఠిఁ?
గ్రముక ధరణీరుహాధీశ! కానవయ్య
నీ ఫలస్ఫూర్తి కంఠంబు నీలవేణిఁ?
గలికలను మించు నవకుంద! కానవమ్మ
నీదు కోరిక నిభదంత నీరజాస్య?
టీక : ఘనసారము - కర్పూర అరటి, కరటియాన - గజయాన (సీత), కదళిక - అరటి, చంపక - సంపెగ, నాస - ముక్కు, క్రముకము - పోక, కలిక - మొగ్గ, కుంద - మల్లె
220-సీ.
వనజాస్య! నినుఁగూడి వర్తించు నతిఘోర-వనములు శృంగారవనము లగును,
పడఁతి! నీతోఁగూడి పవళించు కర్కశ-శయ్యలు పూవుల శయ్య లగును,
గలకంఠి! నీచేతి కందమూలాది భో-జనములు మధురభోజనము లగును,
హరిమధ్య! నినుఁగూడి చరియించునటువంటి-తపములు సత్పుణ్యతపము లగును,
ఇంతి! నీతోడఁ గూడి భోగించునట్టి
భోగమంతయు దేవేంద్ర భోగ మగును,
సుదతి! పొడకట్టఁ గదె
నాకుఁ జూడవలయుఁ
గన్నులకుఁ గానఁబడ వేమి కమలనయన!
221-వ.
అని మఱియును,
222-సీ.
ఏ మృగంబును గన్న నేణాక్షిఁ గానవే? -యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే పక్షిఁ గనుఁగొన్న నెలనాఁగఁ గానవే? -యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే మ్రానుఁ బొడగన్న మీనాక్షిఁ గానవే? -యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే గట్టుఁ బొడగన్న నిభయానఁ గానవే-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
కలఁగు, భీతినొందుఁ, దలఁకుఁ జిత్తములోన,
సొలయు, మూర్ఛఁబోవు, వలయు, నలఁగు,
సీతఁ గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి.
223-వ.
ఇట్లు సీతా వియోగంబునకుఁ బలవరించుచున్న
యన్నం గని సౌమిత్రి యిట్లనియె,
శ్రీరామునికి
లక్ష్మణుని స్వాంతనము
224-క.
“దీనుని కైవడి నూరక
మానము సెడి వగవ నేల మనుజేశ్వర! యీ
కానన భూముల వెదకఁగఁ
గానని మీఁదటను వగవఁగాఁ దగు మనకున్.”
225-వ.
అని ప్రతాపించి, కోప మాఁపుకోఁజాలక కన్నులు జేగురింప, నన్నతో నిట్లనియె,
226-ఉ.
“వ్రచ్చెద నాకలోకమున వారల గుండెలు, నాగలోకమున్
గ్రొచ్చి యహీంద్ర వర్గమును గూల్చెదఁ, గవ్వపుఁ గొండకైవడిన్
ద్రచ్చెద మర్త్యలోకము, నుదారత నే గతి నైనఁ
గ్రమ్మఱం
దెచ్చెద సీత, నీ క్షణము దేవర చిత్తము
మెచ్చునట్లుగన్.”
టీక : గ్రొచ్చు - త్రవ్వు, అహి - పాము,
227-వ.
అని యిట్లు పలికి మఱియును,
228-ఉ.
“చించెద దైత్య సంఘములఁ జిందఱవందఱఁ జేసి, బ్రహ్మ బా
ధించెద, లోక పాలకులఁ ద్రెళ్ళఁగ నేసెద, భూతలమ్ము గ్ర
క్కించెద, శైల జాలముల గీటడఁగించెద, భూమినందనన్
గాంచెదఁ, దల్లడిల్లకుము కంజహితాన్వయ వార్ధి
చంద్రమా!”
229-క.
భూతలమును, నాకసమును,
బాతాళము నెమకియైన బాధించియొ నే
సీతను దెచ్చిన పిమ్మట
నీ తమ్ముఁడ ననుచు మెచ్చు నిఖిలోర్వీశా!”
230-వ.
అని పలుకుచున్న తమ్ముని శౌర్య ధైర్యాది
గుణంబులకు సంతోషించుచు, జనస్థానంబు వెడలి, జనకనందన నన్వేషించుచు దక్షిణాముఖులై
చనుచు ముందట.
జటాయువు రామునకు
రావణుని దుశ్చేష్టను దెలుపుట
231-క.
పక్షములుఁ గాళ్ళుఁ దునిఁగిన
పక్షీంద్రునిఁ జూచి రామభద్రుఁడు మదిలో
రాక్షస మాయయొ? యనుచును
శిక్షింపఁ దలంచు నంత శీఘ్రమె పలికెన్.
టీక : తునుగు - తెగు
232-క.
“నీ తండ్రికి నతి మిత్త్రుఁడ
నో తండ్రీ! నన్ను నేయ నుచితమె నీకున్?
నా తగు పేరు జటాయువు
సీతాధిప! నన్ను నెఱుఁగు చిత్తములోనన్.”
233-వ.
అని చెప్పి వెండియు నా జటాయు విట్లనియె,
234-మ.
“వినుమో రాఘవ! పంక్తికంధరుఁడు
దోర్వీర్యంబు సంధిల్లఁగా
జనకక్ష్మాపతినందనన్
గొనుచు స్వేచ్ఛా వృత్తితో నేఁగుచో,
వనితారత్నము దీనయై పలుకు
తద్వాక్యంబు లేర్పాటుగా
విని, పోరాడఁగఁ బ్రాప్తమయ్యె
మఱి యీ వేషంబు భూమీశ్వరా!”
235-క.
అని సీత తెఱఁగుఁ దన పని
జన నాయకుఁడైన రామచంద్రునితోడన్
వినిపించి, యా జటాయువు
తను వెరియఁగ నంతఁ గాలధర్మము నొందెన్.
టీక : తెఱగు - జాడ. ఎరియు - నశించు, చచ్చుబడు
236-వ.
ఇట్లు రామచంద్రునకు సకల వృత్తాంతమును
నెఱింగించి శరీరంబు విడిచిన యప్పక్షిరాజునకు భక్తి పూర్వకంబుగా నగ్నిసంస్కారాది
విధులు దీర్చి, దక్షిణాభిముఖులై చనుచుఁ జిత్రరూపంబున నున్న కబంధుని వధియించి, ముందట,
శబరి మధుర భక్తి
237-క.
చని చని, యెదుటను రాముఁడు
గనుఁగొనియె మహీజనోగ్రకలుషాద్రిమహా
శనిరూపం బనఁదగు, నా
ఘనముక్తివధూవిలాసకబరిన్, శబరిన్.
టీక : మహీజన - మానవులు, మహా అశని - గొప్ప వజ్రాయుధము, కబరి -
శిరోపరినలంకరించుకొప్పు, శబరి - పంపాతీరమునందలి మతంగాశ్రమ శిష్యురాలు, శబర జాతి స్త్రీ.
238-తే.
కాంచినను మ్రొక్కి యా
భూమికాంతునకును
మించి సద్భక్తిఁ బూజగావించినంత,
శబరితోడను దమ కార్యసరణిఁ దెలియ
వినయమునఁ జెప్ప నా కాంత విన్నవించె,
239-తే.
“ఇనకులాధీశ! సుగ్రీవుఁ డనెడువాఁడు
కపికులశ్రేష్ఠుఁ డత్యంత ఘనుఁడు తలఁప
నతనితోఁ బొత్తుగావింపు మన్ని పనులుఁ
జక్కనౌటకు నాత్మ నిస్సంశయంబు.”
240-వ.
అని చెప్పి వీడ్కొలిపిన నమ్మనుజేంద్ర
నందను లటమీఁదఁ బంపా తటంబునకుం జని, రని చెప్ప నారదుని వాల్మీకి మునీశ్వరుం డటమీఁది కథా
విధానం బెట్టి దని యడుగుటయు,
ఆశ్వాసాంత పద్య
గద్యములు
241-క.
జలజాక్ష! భక్తవత్సల!
జలజాసనవినుతపాదజలజాత! సుధా
జలరాశిభవ్యమందిర
జలజాకరచారుహంస! జానకి నాథా!
242-గ.
ఇది శ్రీగౌరీశ్వర వరప్రసాదలబ్ధ గురుజంగమార్చనవినోద సూరిజనవినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీరామాయణ మహాకావ్యంబునం దరణ్యకాండము సర్వము నేకాశ్వాసము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి